మోసపు బాబును ఎండగడదాం | ysr congress party fight against the tdp government | Sakshi
Sakshi News home page

మోసపు బాబును ఎండగడదాం

Published Sat, Dec 6 2014 3:21 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM

మోసపు బాబును ఎండగడదాం - Sakshi

మోసపు బాబును ఎండగడదాం

చంద్రబాబు మోసాలను ఎండగట్టేందుకు ఒంగోలు కలెక్టరేట్ ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, డ్వాక్రా మహిళలు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మాట్లాడారు. నేతల అభిప్రాయాలు వారి మాటల్లోనే...        

మాయమాటలు చెబితే ప్రకృతి కూడా సహకరించదు
గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎమ్మెల్యే

ప్రజలకు మంచి చేద్దామని మంచి మనసుతో అధికారంలోకి వస్తే అదే తరహాలో వాతావరణం కూడా అనుకూలిస్తుంది. అలా కాకుండా మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించేలా అధికారంలోకి వచ్చినందు వల్లనే వాతావరణం కూడా అనుకూలించలేదు. అందుకే వర్షాలు లేవు, సాగు నీటి కాలువల్లో నీరు లేదు, విత్తనాలు లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. మహానేత రాజశేఖర్ రెడ్డి గతంలో పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రజలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి 2004 ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను తూచా తప్పకుండా అధికారంలోకి రాగానే అమలు చేశారు. అయితే 2014 ఎన్నికల్లో హామీలిచ్చిన చంద్రబాబునాయుడు వాటన్నింటి నీ గాలికొదిలేశాడు.
 
మాటలు కోటలు దాటాయి.. చేతలు లేవు
పాలపర్తి డేవిడ్ రాజు, యర్రగొండపాలెం ఎమ్మెల్యే
 
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాటలు కోటలు దాటాయి. పెద్ద ఎకనమిస్ట్‌నని, ఆర్థిక రంగంలో మంచి ప్రావీణ్యం ఉందని, పాలన ఎలా చేయాలో తనకు బాగా తెలుసునని ఊదరగొట్టాడు. చంద్రబాబు చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకోవాల్సింది పోయి ప్రజలను ఏ విధంగా మోసపు మాటలు చెప్పి మాయచేయచ్చో తెలుసుకున్నారు. కేవలం ఆ కుర్చీమీద ప్రేమతోటే ప్రజలకు ఎన్నికల్లో ఆచరణ సాధ్యం కాని హామీలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది. రెండు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం మొదలుకొని వైఎస్సార్ సీపీ అసెంబ్లీలో పోరు బాటలోనే నడిచింది.  
 
రైతుల పక్షాన పోరాటం
పోతుల రామారావు, కందుకూరు ఎమ్మెల్యే
 
ప్రభుత్వ విధానాలను వేలెత్తి చూపించేలా చంద్రబాబు పాలన కొనసాగుతోంది. తనకున్న అనుభవం రాష్ట్రంలోనే ఎవరికీ లేదంటూ ప్రజలను వంచించిన ఘనత ఒక్క చంద్రబాబుకే దక్కుతుంది. ఇప్పటికైనా ఆయన నిజాల్ని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్తే  ప్రజల ఆగ్రహం కొంతలో కొంతైనా తగ్గుతుంది. రుణాలు మొత్తం లక్షా ఇరవై వేల కోట్లకి పైగా ఉంటే రూ.5 వేల కోట్లు రైతుల రుణాలకి కేటాయించానని చెప్పి తిరిగి వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు ధర్నాలు చేపడుతున్నారని తెలియడంతో ఏవో మాయ లెక్కలు చెప్తూ ప్రజలను ఇంకా మోసం చేయాలని చూస్తున్నాడు. రాజధాని పేరుతో 60 నుంచి 70 వేల ఎకరాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకొని రైతుల వద్ద నుంచి బలవంతంగా పంటపొలాల్ని లాక్కోవాలని చూడటం సహించరానిది.  
 
ఓడిపోయిన వారితో కమిటీలా?
ఆదిమూలపు సురేష్, సంతనూతపాడు ఎమ్మెల్యే
 
టీడీపీ కార్యకర్తలు, నాయకులను సమాజసేవ చేసే సామాజిక కార్యకర్తలుగా అభివర్ణించి మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల కోసం ఏర్పాటు చేసిన జన్మభూమి కమిటీల్లో వారిని వేసి గ్రామాల్లో ప్రజలను నానా అవస్థలకు గురిచేస్తున్నారు.  ఎంపీటీ పీ, జెడ్పీటీసీలుగా పోటీ చేసి ప్రజల చేత ఛీ కొట్టించుకొని ఓడిపోయినవారిని కమిటీలో వేయడం ద్వారా ప్రజలు ఈసడించుకుంటున్నారు. ఎన్నికల్లో ఓట్లు వేయలేదని సామాజిక కార్యకర్తల ముసుగులో ఉన్న టీడీ పీ నాయకులు పింఛన్లు, రేషన్ కార్డులు ఇలా అనేక సంక్షేమ పథకాల నుంచి వాళ్ల పేర్లు పీకేయిస్తున్నారు. ఫించన్ల సొమ్ము పెంచుతామని ప్రకటించి 10 లక్షల ఫించన్లు తీసేశారు. 20 లక్షల రేషన్ కార్డులు పీకేశారు.  రాష్ట్ర ప్రజల నమ్మకాన్ని చూరగొనడంలో విఫలమైన చంద్రబాబు విదేశీ పెట్టుబడిదారులను ఏవిధంగా నమ్మిస్తారో ఎవరికీ అంతుబడట్టడం లేదు.
 
ఆరు నెలల్లోనే నిజస్వరూపం బయటపడింది
జంకె వెంకటరెడ్డి, మార్కాపురం ఎమ్మెల్యే
 
మాట చెప్పి.. తప్పిన మనిషి ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆయన చెప్పేదొకటి చేసేది మరొకటి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే చంద్రబాబు నిజ స్వరూపం బయటపడింది. చెప్పింది చెప్పినట్లు చేయాలంటే ఒక్క దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి మాత్రమే చెల్లింది. రాజన్నను రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు.  ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు 5 హామీలిచ్చి ప్రజలకు ఉరి బిగిస్తున్నాడు. రైతు రుణమాఫీలు, డ్వాక్రా మహిళల రుణమాఫీల విషయంలో చంద్రబాబు చేతులెత్తేసినట్లే. ఇంటికొక ఉద్యోగం.. ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల చిట్టా విప్పితే చాంతాడంత ఉంటుంది. ఎన్నికల హామీల విషయాన్ని విస్మరించి ఆయన పార్టీ కార్యకర్తలకి మాత్రం సోషల్ వర్కర్లు అని ముద్రవేసి దోచిపెట్టేందుకు పథకం వేశారు.
 
చంద్రబాబుది నీచపాలన
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, దర్శి నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే
 
చంద్రబాబుది నీచపాలన. వైఎస్ పాలన సువర్ణయుగం. చంద్రబాబు నాయడు నరకాసురుడు లాంటి లక్షణాలు కలవాడు. నాయకుడంటే ఎలా ఉండకూడదో ఆయన్ను చూసి నేర్చుకుంటే సరిపోతుంది. ఎన్నికల సమయంలో అందరికీ బంగారు పాలన ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడేమో నీచంగా పాలిస్తున్నాడు. రైతుల రుణమాఫీ కోసం బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించి మరి ఇప్పుడు రూ.40 వేల కోట్లు ఇస్తానంటున్నాడు. రైతులు, మహిళలు ఇలా..అన్నీ సమాజిక వర్గాల కోసం పోరాటం చేయడానికి వైఎస్సార్ సీపీ సిద్ధంగా ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబు నాయుడిని ఎండకట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 
రుణాలు రద్దు చేసే వరకూ పోరాటం
వరికూటి అశోక్ కుమార్, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి
 
రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు రద్దయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉండాలి. టీడీపీ పాలన అస్తవ్యస్తంగా ఉంది. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దోచిపెట్టాలనే ఉద్దేశం తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న ఆలోచనే ఎక్కడా కనపడటం లేదు. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకి అండగా నిలిచి ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇకపై కూడా ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతూనే ఉంటారు. మనందరం ఆయనకు అండదండగా ఉండాలి.
 
చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి
గొట్టిపాటి భరత్, పర్చూరు నియోజకవర్గ ఇన్‌చార్జి
 
ఓట్లకోసం, సీట్ల కోసం మోసపూరిత హామీలిచ్చిన చంద్రబాబుకు గుణపాఠం చెప్పాలి. అధికారం కోసం నోటికొచ్చిన మాటల్లా చెప్పి ప్రజలను అంధకారంలోకి నెట్టాడు. ఎన్నికలకు ముందు రుణమాఫీపై ఒకరకంగా చెప్పి అధికారం చేతికొచ్చిన తర్వాత మరొక రకంగా చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. మొదటి సంతకం రుణమాఫీ ఫైలుపై పెడతానని చివరకు రుణమాఫీ చెయ్యడానికి సాధ్యసాధ్యాలను పరిశీలించేందుకు కోటయ్య కమిటీని వేస్తూ సంతకం పెట్టడం అత్యంత దారుణం. గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చెప్పి ఇచ్చిన ఎన్నికల హామీని అధికారంలోకి రాగానే అమలు చేసి చూపించిన నేతగా ఆయన చరిత్రలోకి ఎక్కారు. చంద్రబాబు కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప ప్రజలకు మేలు చేసే ఆలోచనే లేదు.  
 
దేశం నేతలు పండుగ చేసుకుంటున్నారు
బుర్రా మధుసూధన్ యాదవ్, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి
 
కనిగిరిలో టీడీపీ నాయకులు గురువారం బాణసంచా కాల్చారు. ఎందుకు కాలుస్తున్నారు, ఏంటి అని స్థానిక ప్రజలు వాళ్లని అడిగితే నాలుగు రోజుల్లో చంద్రబాబు నాయుడు రైతుల రుణాలు మాఫీ చేస్తున్నాడని ఆకాశ సువ్వలు కాలుస్తున్నామని చెప్పారు. అంటే రైతుల పట్ల ప్రజల పట్ల టీడీపి నాయకులకు ఎంత చిన్నచూపు ఉందో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఒకపక్క రైతులు, డ్వాక్రా మహిళలు నానా అవస్థలు పడుతూ కుటుంబాలు గుల్ల చేసుకుంటుంటే టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మాత్రం పండగలా ఉన్నట్టుంది. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే చంద్రబాబు పాలనపై ప్రజలు విసిగి వేసారిపోయారు.  ఈరోజుకు ఈ రోజు ఎన్నికలు వస్తే రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ  విజయ దుందుభి మోగిస్తుంది.
 
వెనుకా ముందు చూడకుండా అబద్ధాలు
వరికూటి అమృతపాణి, బాపట్ల పార్లమెంట్ ఇన్‌చార్జి

చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాలకు వ్యతిరేకంగా తన పాలన సాగిస్తున్నాడు. తనకు అనుభవం ఉందని, తనవద్ద చాలా విద్యలున్నాయని ఆయన ఎన్నికల కమిషన్‌కి కూడా లేఖ రాశారు. ఇప్పటి వరకు ఒక్క రైతుకైనా రుణమాఫీ జరిగిందా?  సిగ్గు శరం లేకుండా, వెనకాముందు చూడకుండా అబద్ధాలాడుతున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే రైతు వ్యతిరేకి చంద్రబాబు. ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఎవరైనా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ైవె ఎస్ రాజశేఖరరెడ్డి తర్వాతే. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిరుద్యోగ భృతి కావాలని అడిగితే అలాంటి హామీలు నేనెప్పుడిచ్చానని ఎదురు ప్రశ్న వేయడం చంద్రబాబుకే దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement