సైనికుల్లా పనిచేయండి | YSR Congress state chief secretary vijay sai reddy fire on TDP government | Sakshi
Sakshi News home page

సైనికుల్లా పనిచేయండి

Published Sun, Feb 15 2015 2:57 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM

సైనికుల్లా పనిచేయండి - Sakshi

సైనికుల్లా పనిచేయండి

 సాక్షి ప్రతినిధి, విజయనగరం/విజయనగరం మున్సిపాల్టీ :  చంద్రబాబు దుర్మార్గపు పాలనతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అన్ని వర్గాల్ని మోసగించారని, ఈ ప్రభుత్వంపై తిరగబడాల్సిన సమయం వచ్చిందని, ప్రజలకు అండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక నాయుడు ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన జిల్లా పార్టీ విసృ్తత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా  ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరే క విధానాలు ఎండగడుతూనే, సంస్థాగతంగా పార్టీ బలోపేతం చేసుకోవాలన్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ని సీఎం చేయడమే ధ్యేయంగా పెట్టుకుని వైఎస్సా ర్‌సీపీ శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కోరారు.
      
 హామీలపై నిలదీయాలి : సుజయ్‌కృష్ణ రంగారావు
 చంద్రబాబు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ పాలకుల్ని నిలదీయాలని, అందుకు తగ్గట్టుగా కార్యకర్తలు, నాయకులు సంసిద్ధులై ఉండాలని బొబ్బిలి ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజయ్ కృష్ణ రంగారావు పిలుపునిచ్చారు. రాజకీయ నిరుద్యోగ   సమస్యను తొలగించేందుకే ఈ కమిటీలు వేశారని అనుకోవద్దని, అంకిత భావంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు. ఎక్కువ, తక్కువ అనేది చూడకుండా కమిటీల్లో వేసిన వారంతా కష్టపడి పనిచేయాలన్నారు. చంద్రబాబుకు ఓటేసి పొరపాటు చేశామని ప్రజలు బాధపడుతున్నారని, వారి ఆవేదనను అర్థం చేసుకుని, వారి తరఫున పార్టీ శ్రేణులు పోరాడాలన్నారు. రాష్ట్ర విభజన జరిగితే విద్యా రంగంలోనూ, సాగునీటి రంగంలోనూ ఇబ్బందులుంటాయని ముందే తెలిసినప్పటికీ చంద్రబాబు ఆ దిశగా చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతవరకు కేంద్రాన్ని గాని, గవర్నర్‌ను గాని కలిసి ఆ సమస్యలను పరిష్కరించాలని కోరలేదన్నారు.
 
 దాని పర్యావసనమే నాగార్జున సాగర్ డామ్ వద్ద చోటు సంఘటన అని సుజయ్‌కృష్ణ రంగారావు అభిప్రాయపడ్డారు. దానిని భారత్, పాకిస్థాన్ సరిహద్దు సమస్యగా మార్చేశారని, ఎస్‌ఈ స్థాయి అధికారిని కూర్చోబెడితే ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయన్నారు. ఈ సమయంలో తెలంగాణ వాళ్లు నీరివ్వకపోతే ఆంధ్రా రైతులు ఏమైపోవాలని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలకిచ్చిన హామీలు చేయకపోతే ఢిల్లీలో బీజేపీకి పట్టిన గతే ఇక్కడ టీడీపీకి పడుతుందన్నారు. కోట్లు ఖర్చు పెట్టి సమావేశాలు ఏర్పాటు చేసినంత మాత్రాన, లక్షలు ఖర్చు పెట్టి సూట్‌లేసుకున్నా మాత్రాన ప్రజలు ఓటేసేయరని, సామాన్యుడు అవసరాలు తీర్చే విధంగా పనిచేసే వారికే పట్టం కడతారని డిల్లీ ప్రజలు నిరూపించారన్నారు. ఇప్పుడేసిన కమిటీలన్నీ ప్రణాళిక బద్దంగా పనిచేయాలని, కమిటీ సభ్యులకు అన్నీ విషయాలపై అవగాహన ఉండేలా ఎన్టీఆర్, వైఎస్సార్, చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో వివరించే బుక్‌లెట్లు ముద్రించి అందజేస్తే బాగుంటుందని అన్నారు.  
 
 చంద్రబాబువి ప్రజా వ్యతిరేక చర్యలు : రాజన్నదొర
 చంద్రబాబువన్నీ ప్రజా వ్యతిరేక చర్యలేనని, ప్రజలు తిరగబడాల్సిన సమయం వచ్చిందని సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర పిలుపునిచ్చారు. శాసన సభలో తామెలాగైతే ప్రశ్నిస్తున్నామో క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులు కూడా నిలదీసే విధంగా వ్యవహరించాలన్నారు. కొత్తగా నియమించిన కమిటీలన్నీ క్రమ పద్ధతిలో పనిచేసినట్టయితే ప్రజాధరణ చూరగొని ముందుకెళ్లగలుగుతామన్నారు. పెట్రోలు చార్జీలు పెంపు, పన్నుల వడ్డన తదితర ప్రజావ్యతిరేక కార్యక్రమాలతో  పేదలను చంద్రబాబు ఇబ్బందులుకు గురి చేస్తున్నారని, వారికి అండగా నిలిచి పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక నిధుల కింద కనీసం రూ.100 కోట్లు ఇచ్చినా బాగుండేదని, కేంద్రం ప్రకటించిన రూ.50 కోట్లు ఎటూ చాలవని, ఈ విషయమై  కేంద్ర,రాష్ట్ర మంత్రులు, జెడ్పీ చైర్మన్, టీడీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. వైఎస్సార్ హయాంలో ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డులిస్తే ఈ ప్రభుత్వం ఇళ్లుకు బిల్లు ఇవ్వకపోగా, రేషన్‌కార్డులను 14వేల వరకు తీసేసిందని, పింఛన్లు రద్దు చేసేసే కార్యక్రమానికి ఒడిగట్టిందన్నారు.
 
  మోసపూరిత హామీలిచ్చి ఉంటే జగనే సీఎం : పాముల పుష్ప శ్రీవాణి
  రాష్ట్రంలో నెలకొన్న దుస్థితికి ముఖ్యమంత్రి నారా.చంద్రబాబు నాయుడే ప్రధాన కారణమని కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల.పుష్ప శ్రీవాణి అన్నారు. ఎన్నికలకు ముందు రాష్ర్ట విభజన జరిగిపోయినప్పటికీ   ప్రజలను మభ్యపెట్టేందుకు మ్యానిఫేస్టోలో ఆచరణలో సాధ్యం కానీ హమీలతో గద్దెనెక్కిన చంద్రబాబు.. ఇప్పుడు రాష్ట్రంలో లోటుబడ్జెట్ ఉందంటూ కల్లబొల్లి కబర్లు  చెబుతున్నారని విమర్శించారు.   రోజుకో మాట.. పూటకో నిర్ణయంతో ప్రజలను ఆందోళన కర పరిస్థితిల్లోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మోసపూరిత, ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి ఉంటే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డే సీఎం అయ్యేవారని  పుష్ప శ్రీవాణి అన్నారు.   బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, రాష్ట్రానికి మేలు చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని నిలదీశారు. కేంద్రం ప్రకటించిన రూ.500కోట్లు ఎక్కడ సరిపోతాయని, దీని కోసం గట్టిగా అడగలేరా అని ప్రశ్నించారు.
 
 ఎన్టీఆర్ అభిమానులూ... చంద్రబాబు కపటనాటకాలు తెలుసుకోండి: కోలగట్ల
 తన మామ ఎన్టీర్ పేరు చెప్పుకుని  మూడు మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దెనెక్కిన చంద్రబాబునాయుడు కపటనాటకాలను ఎన్టీఆర్ అభిమానులు తెలుసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలగట్ల.వీరభద్రస్వామి హితవుపలికారు. బయటకు ఆయన పేరు చెబుతున్నా మనసులో మాత్రం నిత్యం తిట్టుకుంటూనే ఉంటారని విమర్శించారు. అదే తరహాలో రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని చూడటంలో తిరుగులేని ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు సాధించిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖరెడ్డి మరణానంతరం ఆయన అభిమానులు విగ్రహాలు పెట్టుకుంటే వాటిని తొలగించాలంటూ ఆదేశించడం విడ్డూరమన్నారు.
 
 అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా, రైతు రుణామాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు సవాలక్ష ఆంక్షలతో  ఆ హమీని తుంగలోకి తొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ఢిల్లీ తరహాలో ఫలితాలు రావటం ఖాయమని జోస్యంచెప్పారు. ప్రజలకు లేనిపోని ఆశ లు కల్పించి వాటిని ఆచరణలో చూపించకపోతే ప్రజలు ఇటువంటి తీర్పులనే ఇస్తారని హెచ్చరించారు.  రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక పార్టీ చిరంజీవి గ్లామర్‌తో, మరో పార్టీ బాలకృష్ణ వంటి సినీ నటుల గ్లామర్‌తో ప్రజలను ఆకర్షితులను చేస్తే, జగన్‌మోహన్‌రెడ్డి మాత్రం ఎటువంటి గ్లామర్‌లేకుండానే ప్రజల్లోకి వెళ్లి వారి మన్ననలు పొందుతున్నారన్నారు. జిల్లాలో పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయటంలో భాగంగా సుమారు 4000 మంది సభ్యులతో జిల్లా , మండల, పట్టణ, గ్రామ స్థాయికమిటీలను నియమిస్తున్నట్టు తెలిపారు. కమిటీల్లో సభ్యులుగా ఉన్న వారంతా పార్టీకోసం సమయం వెచ్చించి చిత్తశుద్ధితో పని చేయాలని సూచించారు.
 
 పథకాల అమల్లో ప్రభుత్వం విఫలం : వరుదు కళ్యాణి
 ఎన్నికలకు ముందు అమలకు సాధ్యం కాని హమీలు  గుప్పించి వాటిని ఆచరణలో చేసి చూపించటంలో ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వరుదు.కళ్యాణి ధ్వజమెత్తారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ  8 నెలల కాలంలో అబద్ధపు హమీలతోనే  కాలం వెళ్లదీస్తోందన్నారు. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని కాంక్షించాల్సిన  ప్రభుత్వం ఇప్పటికీ దివంగత నేత డాక్టర్ వైఎస్‌రాజశేఖరరెడ్డిపై ఆరోపణలు చేసేందుకు ప్రాధాన్యతనివ్వడం దారుణమన్నారు. మహిళలను లక్షాధికారులు చేస్తామని చెబుతున్న ముఖ్యమంత్రి కనీసం వారి డ్వాక్రా రుణాలను మాఫీ చేయకపోవటం ఏంటని ప్రశ్నించారు.
 
   ఈ కార్యక్రమంలో పార్టీ  కేంద్రపాలకమండలి సభ్యులు పెనుమత్స.సాంబశివరాజు, మాజీ ఎమ్మెల్యే సవరపు జయమణి,   రాష్ట్ర ఐటీ విభాగం  అధ్యక్షుడు చల్లా.మధుసూధనరెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి శత్రుచర్ల.పరీక్షిత్‌రాజు, సంగిరెడ్డి.బంగరునాయుడు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి గర్భాపు.ఉదయభాను, నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు కడుబండి.శ్రీనివాసరావు, జమ్మాన ప్రసన్నకుమార్, నెక్కల నాయుడుబాబు, సీఈసీ మెంబర్ కాకర్లపూడి.శ్రీనివాసరాజు, పార్టీ కోశాధికారి కందుల.రఘుబాబు, జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శులు అంబళ్ల.శ్రీరాములనాయుడు, కెవిఎన్.సూర్యనారాయణరాజు,  రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి కెవిఎన్ తమ్మన్నశెట్టి, మైనార్టీ జిల్లా కార్యదర్శులు ఎండి.మున్వర్,  వివిధ విభాగాల అధ్యక్షులు గొర్లె వెంకటరమణ, పీరుబండి జైహింద్‌కుమార్, మారంబాలబ్రహ్మారెడ్డి, రెడ్డి పద్మావతి పతివాడ.అప్పలనాయుడు ఎంఎం.శివాజీ, రొంంగలి జగన్నాధం, సత్యంనాయుడు,త్రినాధ్,  గర్బాపు ఉదయ బాను,మజ్జి వెంకటేష్, వర్రి నర్సింహమూర్తి, నెల్లిమర్ల జెడ్పీటీసీ సభ్యుడు గదల సన్యాసినాయుడు, చనుమళ్ల వెంకటరమణ, ఆశపు.వేణు,నడిపేన.శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement