వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విజయసాయిరెడ్డి రాక
పార్టీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి వెల్లడి
ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఏడాది పాలనలో ప్రజా సంక్షేమాన్ని విస్మరించడం, ఎన్నికల సందర్భంగా టీడీపీ ఇచ్చిన వాగ్దానాల అమలులో విఫలం కావడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా శాఖ అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు తెలిపారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా.. ఏ వర్గానికీ న్యాయం చేయలేకపోయిందని కొత్తపల్లి విమర్శించారు. ఎన్నికలకు ముందు రైతుల రుణాలు, డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. నిరుద్యోగులకు భృతి, ఇంటింటికీ ఒక ఉద్యోగం వంటి అనేక హామీలు ఇచ్చినా వాటిలో ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో అమలు కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సాధికారత విషయంలో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న డ్వాక్రా మహిళలు టీడీపీ నిర్వాకం వల్ల ప్రస్తుతం అవమానాలకు గురవుతూ దయనీయ పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం చేతిలో మోసానికి గురైన ఆయా వర్గాలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుందన్నారు. హామీలను అమలు చేసేవిధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికే ఈనెల 26న నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్‌లోని వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించి.. ర్యాలీగా కలెక్టర్‌కార్యాలయానికి చేరుకుంటామన్నారు. అక్కడ ధర్నా నిర్వహించి అనంతరం వివిధ సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పాల్గొంటారని చెప్పారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
సమర దీక్షను విజయవంతం చేయాలని పిలుపు
రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం జూన్ 3, 4 తేదీల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరు జిల్లా మంగళగిరిలో తలపెట్టే సమర దీక్షను విజయవంతం చేయాలని సుబ్బారాయుడు పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ ఏడాది పాలన మోసాలతోనే సాగిందన్నారు. రైతు రుణమాఫీ హామీ కంటితుడుపు చర్యగా జరుగుతుండగా, డ్వాక్రా మహిళల రుణమాఫీపై ప్రభుత్వానికి చలనమే లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రజల పక్షాన అనేక పోరాటాలు, దీక్షలు చేపట్టారని గుర్తు చేశారు. ఇటీవల ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలోనూ వైఎస్ జగన్ హెచ్చరికతోనే ప్రభుత్వం దిగివచ్చి కార్మికులకు 43 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వడానికి అంగీకరించిందన్నారు.
కమీషన్ల కోసమే పనులు : శేషుబాబు విమర్శ
ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ప్రభుత్వం కేవలం కమీషన్ల కోసమే వివిధ పనులు చేపడుతోందన్నారు. పుష్కర పునులు, పట్టిసీమ ఎత్తిపోతల పథకం వంటి పనుల్లో కోట్లాది రూపాయలు కమీషన్ల రూపంలో చేతులు మారాయన్నారు. ప్రభుత్వం ప్రజల కోసం కాకుండా టీడీపీ కార్యకర్తల కోసమే పనిచేస్తోందన్నారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు మాట్లాడుతూ నీరు-చెట్టు పథకం కింద చెరువుల్లో తవ్విన మట్టిని రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ధ్వజ మెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, ప్రజల ఆస్తులను ఆక్రమిస్తున్న ఘటనలపై ఎప్పటికప్పుడు జిల్లా ఎస్పీ, కలెక్టర్ దృష్టికి తీసుకెళుతుండాలన్నారు.
పలువురు నాయకులు మాట్లాడుతూ సర్కారు తీరుపై ప్రతి గ్రామంలో అసంతృప్తితో ఉన్న డ్వాక్రా మహిళలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను వైఎస్ జగన్ దీక్షకు హాజరయ్యేలా చైతన్యపరచాలని సూచించారు. ప్రభుత్వం విద్యుత్ శాఖ ద్వారా రూ.10కే పంపిణీ చేస్తున్న ఎల్‌ఈడీ బల్బుల నిమిత్తం ప్రతినెలా బిల్లులో రూ.20 అదనంగా వసూలు చేస్తోందన్నారు. ఇది దాదాపు నాలుగేళ్లపాటు కొనసాగుతుందనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ కన్వీనర్ తోట గోపి, గోపాలపురం కన్వీనర్ తలారి వెంకట్రావు, నిడదవోలు కన్వీనర్ ఎస్.రాజీవ్‌కృష్ణ, ఉంగుటూరు కన్వీనర్ పుప్పాల వాసుబాబు, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి పోల్నాటి బాబ్జి, యువజన విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుమంచి రమేష్, ప్రచార కమిటీ సభ్యుడు పెన్మెత్స సుబ్బరాజు, కోశాధికారి దిరిశాల ప్రసాద్, క్రమశిక్షణ సంఘం సభ్యులు పటగర్ల రామ్మోహనరావు, గంపల బ్రహ్మావతి, చలుమోలు అశోక్‌గౌడ్ పాల్గొన్నారు.
సర్కారు వైఫల్యాలపై 26న నిరసన
Published Sat, May 23 2015 1:55 AM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement