వైఎస్సార్ సీపీ సమీక్ష సమావేశం షెడ్యూల్ ఖరారు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒంగోలులో ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశాల షెడ్యూల్ ఖరారైంది. దీనిపై ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ముత్తుముల అశోక్‌రెడ్డిలు చర్చించి ఈ మేరకు ఓ షెడ్యూల్ ఖరారు చేశారు. రెండు రోజుల పాటు జరిగే సమీక్ష సమావేశాలను విజయవంతం చేయాలని నేతలు పిలుపునిచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి ఈ నెల 24వ తేదీ ఉదయం 8.30 గంటలకు విమానంలో విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి బయల్దేరి 12 గంటలకల్లా ఒంగోలు వస్తారు. రెండు రోజుల పాటు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు ఒంగోలు రైల్వేస్టేషన్ సమీపంలోని బచ్చల బాలయ్య కల్యాణ మండపంలో జరుగుతాయి. మొదటి రోజు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2.30 గంటల వరకు కందుకూరు నియోజకవర్గ సమీక్ష జరుగుతుంది.
మధ్యాహ్నం మూడు నుంచి ఐదు గంటల వరకు అద్దంకి, పర్చూరు నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది. సాయంత్రం ఆరు నుంచి 8.30 గంటల వరకు చీరాల, సంతనూతలపాడు నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తారు. రెండో రోజు మంగళవారం ఉదయం 9.30 గంటల నుంచి 11 వరకు ఒంగోలు నియోజకవర్గ సమీక్ష జరుగుతుంది. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు గిద్దలూరు, యర్రగొండపాలెం, మధ్యాహ్నం రెండు నుంచి 4.30 గంటల వరకూ మార్కాపురం, కనిగిరి సమీక్ష, సాయంత్రం ఐదు నుంచి రాత్రి 7.30 గంటల వరకు కొండపి, దర్శి నియోజకవర్గాల సమీక్ష జరుగుతుంది.
సమీక్ష సమావేశానికి ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు, పార్టీ మండల అధ్యక్షులు, పార్టీ విభాగాల అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ సభ్యులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, సహకార సంఘాల అధ్యక్షులు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఇతర ముఖ్య నేతలు తప్పక హాజరు కావాలని వైవీ, బాలినేని, అశోక్‌రెడ్డిలు కోరారు.