జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన ....
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమితులైన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం అధ్యక్షునిగా నియమితులైన తర్వాత ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డి, పార్టీని బలోపేతం చేస్తా
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, ఇతర సహచర ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌చార్జులు ఎంతో నమ్మకంతో తనపై ఉంచిన బాధ్యతను నెరవేరుస్తానని చెప్పారు.
ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చలేదన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ, రైతు రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం అంటూ ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ఈ నెల 5వ తేదీన జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో తహ శీల్దార్ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహిస్తామన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను పూర్తి స్థాయిలో ఎండగడతామని చెప్పారు. జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై చేస్తున్న దాడుల్ని అందరి సహకారంతో ఎదుర్కొంటానన్నారు. పార్టీ కార్యకర్తలకు పూర్తి అండదండగా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
బయోడేటా..
పేరు ముత్తుముల అశోక్‌రెడ్డి
పుట్టిన తేదీ:15-07-1968
తల్లితండ్రులు:రామచంద్రారెడ్డి, లక్ష్మీదేవమ్మ
స్వస్థలం: కొమరోలు
విద్యార్హత: (బీటెక్)
పదవి: గిద్దలూరు ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు
ప్రస్తుత నివాసం: ప్రశాంతినగర్, గిద్దలూరు
కుటుంబం: భార్య-పుష్పలీల, పిల్లలు - దివ్యేష్, భవజ్ఞ
సేవా కార్యక్రమాలు: తల్లిదండ్రుల పేరుతో పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
రాజకీయ నేపథ్యం: వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాలకు ఆకర్షితులై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో 2010లో పార్టీలో చేరారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా చేపట్టి ప్రజలకు చేరువయ్యారు. ఆయన సేవలను గుర్తించి 2013లో పార్టీ సమన్వయకర్తగా బాధ్యతలు అప్పగించింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో పది సొసైటీల్లో ఎనిమిది సొసైటీలు, 60 శాతం సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకున్నారు. గడపగడపకూ వైఎస్సార్ సీపీ కార్యక్రమాన్ని చేపట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో గిద్దలూరు ఎమ్మెల్యేగా వైఎస్సార్ సీపీ తరఫున గెలుపొందారు.