
సాక్షి, కడప : వైఎస్సార్ హయాంలో పులివెందులలో అభివృద్ధి పరుగులు తీసింది. నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి కొరత రాకుండా చూసుకున్నారు. అడగందే అమ్మయినా అన్నం పెట్టదంటారు. అటువంటిది ఏమీ అడగకపోయినా జన్మించిన గడ్డ పులివెందులకు అన్నీ చేసి వైఎస్సార్ ప్రజల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
♦ ఈ ప్రాంత రైతాంగానికి ప్రధాన జీవనాధారమైన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి కావాల్సినన్ని నిధులు కేటాయించారు. గండికోట ద్వారా కృష్ణా జలాలను తీసుకురావడానికి సంకల్పించారు. పైడిపాలెం ప్రాజెక్టుకు సంబంధించి 85 శాతం పనులను పూర్తి చేయించారు.
♦ జిల్లాలో జలయజ్ఞంలో భాగంగా ప్రాజెక్టులన్నింటికీ నిధుల వరద పారించారు. ఆయన హయాంలోనే అన్ని ప్రాజెక్టులు దాదాపు పూర్తి కావచ్చాయి. అయితే కేవలం పదిహేను శాతం పనులను కూడా చేయకుండా....చివరి అంకంలో ఇటీవల కాలంలో మిగిలిన పది శాతం పనులు పూర్తి చేసి కృష్ణా జలాలు తీసుకొచ్చిన ఘనత తమదేనని టీడీపీ నేతలు చెప్పుకుంటుండడంపై పలువురు విస్తుపోతున్నారు. పులివెందుల ప్రాంతానికి నీరిచ్చి చీనీ చెట్లను బతికించామని చెప్పుకోవడం చూస్తే ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఎందుకంటే ప్రాజెక్టులు వైఎస్సార్ హయాంలో పూర్తయిన విషయం ప్రజలందరికీ తెలుసు. ఆరు టీఎంసీల సామర్థ్యంగల పైడిపాలెం ప్రాజెక్టుకు గత ఏడాది కేవలం 0.3 టీఎంసీ మాత్రమే నీరు తీసుకొచ్చారు. అంటే ఒక టీఎంసీ నీటిని కూడా ఇవ్వలేకపోయినా పైకి మాత్రం చెట్లను రక్షించినట్లు చెప్పుకోవడం చూస్తే ఎవరికైనా చిత్రంగానే కనిపిస్తుంది.
♦ గత మూడేళ్లుగా ఉద్యానశాఖ రికార్డులను పరిశీలించినా పులివెందుల నియోజకవర్గంలో వేలాది ఎకరాలు ఎండిన చీనీ చెట్ల విషయం బయటపడుతుంది. చివరకు పులివెందుల నియోజకవర్గంలో చిన్నపని చేసినా చంద్రబాబు సర్కార్ ప్రత్యేక మైలేజీ కోసం ఆరాటపడుతుంది తప్ప ప్రజల కోసం కాదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ పులివెందుల అభివృద్ధికి తార్కాణం...
♦ వైఎస్సార్ సీఎం అయ్యేనాటికి మేజర్ పంచాయతీగా ఉన్న పులివెందుల 2004 చివరిలో మున్సిపాలిటీగా ఆవిర్భవించింది. అప్పటి నుంచి రూపురేఖలు మారిపోయాయి.
♦ పులివెందులలో జేఎన్‌టీయూ ఇంజనీరింగ్ కాలేజీ, ఇడుపుల పాయలో త్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు.
♦ రూ. 385 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో అంతర్జాతీయ పశుపరిశోధనా కేంద్రాన్ని అధునాతన వసతులతో నిర్మించారు.
♦ పులివెందుల – కడప మధ్య నాలుగులేన్ల రోడ్డు ఏర్పాటు చేశారు.
♦ శిల్పారామాన్ని తీసుకొచ్చి ప్రజలకు ఆహ్లాదాన్ని పంచారు.
♦ గండిక్షేత్రంలో విస్తృత అభివృద్ధి.
♦ రూ. 2,800 కోట్లతో పులివెందుల నియోజక వర్గాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రారంభించారు.
♦ ప్రతి మండల కేంద్రంలో ప్రభుత్వ ఐటీఐ, ఇంటర్మీడియేట్ కాలేజీలు ప్రారంభించారు.
♦ పులివెందుల చుట్టూ రూ. 18 కోట్లతో రింగ్ రోడ్డు నిర్మించారు.
♦ నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడానికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సంస్థ ఏర్పాటు.
♦ నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు పులివెందుల డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) ఆధ్వర్యంలో సుమారు రూ. 130 కోట్లకు పైగా ఖర్చు చేశారు.
♦ పులివెందుల మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు నిధులు అందించారు. అండర్‌గ్రౌండ్ డ్రైనేజీకి రూ. 42 కోట్లు కేటాయించారు.
♦ శ్రీ రంగనాథస్వామి, పాతబస్టాండులోని శ్రీ వెంకటేశ్వరస్వామి, మిట్టమల్లేశ్వరస్వామి ఆలయాలతోపాటు నియోజకవర్గం లోని అనేక గ్రామాల్లో ఆలయాల అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేశారు.
♦ లింగాల మండలం నక్కలపల్లె వద్ద సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఏర్పాటు చేసి అక్కడి నుంచి నీటిని పులివెందులకు తీసుకొచ్చేలా రూ. 40 కోట్లతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు.
♦ పులివెందులలో ఫుడ్ అండ్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు.
♦ సింహాద్రిపురం మండలంలో రూ. 550 కోట్లతో పైడిపాలెం ప్రాజెక్టు నిర్మించారు.
♦ పులివెందుల బ్రాంచ్ కెనాల్ లోని కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణకు రూ. 500 కోట్లు వెచ్చించారు.
♦ ఇడుపుల పాయలో రూ. 50 కోట్లతో ఎకో పార్కు ఏర్పాటు.
♦ పులివెందుల నియోజక వర్గంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా గోవిందరాజ స్పిన్నింగ్ మిల్ ఏర్పాటు. రాయలాపురం సమీపంలో సంయుగ్లాసెస్ పరిశ్రమ, ఎన్‌ఎస్‌ఎల్ టెక్స్ టైల్స్ ఏర్పాటు చేశారు.
♦ అధునాత హంగులతో పులివెం దులలో ఆర్ అండ్‌బీ గెస్ట్‌హౌస్, మున్సిపల్ ఆఫీసు భవనాలను నిర్మించారు.
♦ పులివెందుల – కదిరి మధ్య రూ. 28 కోట్లతో కొత్త రోడ్డు నిర్మించారు.
♦ పులివెందుల – ముదిగుబ్బ మధ్య, పులివెందుల– జమ్మల మడుగు మధ్య డబుల్ లైన్ రోడ్డు నిర్మించారు.
♦ రూ. 1100 కోట్ల వ్యయంతో వేముల మండలం మబ్బు చింతలపల్లి వద్ద యురేనియం శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయించారు.
వైఎస్సార్ మరణంతో... ఆగిన అభివృద్ధి..
♦ వైఎస్సార్ మరణంతో పులివెందులలో అభివృద్ధి ఆగిపోయింది. తర్వాత అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోకపోగా, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం గాలికి వదిలేసింది. దీంతో పులివెందులలో అభివృద్ధి పడకేసింది.
♦ పులివెందులలో శిల్పారామానికి అనుబంధంగా బడ్జెట్ హోటల్ నిర్మాణానికి ఆమోద ముద్ర లభించింది. సుమారు 100 గదులతో అద్దెకు ఇచ్చేలా ప్లాన్ వేసి అక్కడనే హోటల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. వైఎస్సార్ మరణించాక దాన్ని వదిలేశారు.
♦ పులివెందుల ప్రాంతంలో సుమారు 10 వేల మెగా వాట్ల అణువిద్యుత్ ప్లాంట్ పెడుతున్నట్లు అప్పట్లో ప్రకటించారు. అందుకు సంబంధించి స్థల సేకరణ జరుగుతుండగానే ఆయన మరణానంతరం దాన్ని పట్టించుకోలేదు.
♦ ఐజీ కార్ల్‌లో అద్భుతమైన వసతులు ఉన్నా నేటికీ తెలుగుదేశం ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మూడున్నరేళ్లయినా ఇప్పటివరకు ఎలాంటి పరిశోధనలు జరగలేదు.
♦ వేంపల్లె పాపాఘ్ని నదిలో అలిరెడ్డిపల్లె–వేంపల్లె మధ్య రూ. 12 కోట్లతో బ్రిడ్జి నిర్మాణానికి వైఎస్సార్ హయాంలో మంజూరైంది. అప్పట్లో పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు ప్రాజెక్టుకు అవసరమైన మొత్తంపై ప్రతిపాదనలు పంపుతున్నా మంజూరు కాలేదు. దీంతో అలిరెడ్డిపల్లె, తువ్వపల్లె గ్రామాల ప్రజలు 30 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.
♦ పులివెందులలో మినీ సెక్రటేరియేట్ (అన్ని కార్యాలయాలు ఒకేచోట), సబ్‌జైలు, ఆర్టీసీ బస్టాండు నిర్మించాలని సిద్ధం చేసినా మహానేత మరణం తర్వాత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
♦ పైడిపాలెం ప్రాజెక్టుకు సంబంధించి కూడా వైఎస్సార్ హయాంలో 80 శాతం పనులు పూర్తయ్యాయి. కేవలం 20 శాతం పనులను టీడీపీ సర్కార్ 2017 వరకు పూర్తి చేయలేదు.