సాక్షి, విశాఖపట్నం : తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టుతో.. రాజసమైన నడకతో రాజన్న నడిచొస్తుంటే ప్రజలంతా తమ జీవితాలు బాగు చేసేందుకు నమ్మకమే నడిచొస్తున్నట్లుగా భావించేవారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి గుర్తుచేసుకున్నారు. ప్రజాప్రస్థాన యాత్రలో రాజన్నతో కలిసి నాలుగు జిల్లాల్లో నడిచిన సత్తి రామకృష్ణారెడ్డిని వైఎస్సార్ జయంతి సందర్భంగా పాదయాత్ర విశేషాల్ని చెప్పమంటే తీపి గురుతులు జ్ఞాపకం చేసుకున్నారు.
‘‘నేనప్పుడు విశాఖ నగర కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. గతంలో వైఎస్సార్‌ను అడపా దడపా కలిస్తుండేవాడిని. ప్రజాప్రస్థాన యాత్ర ప్రారంభించినప్పటి నుంచి.. పలు జిల్లాల్లో కలిసి ఒక రోజు నడిచి వచ్చేసేవాడిని. కానీ.. తూర్పుగోదావరిలోకి ప్రవేశిస్తోందనగా ఆయనకు స్వాగతం చెప్పి వచ్చేద్దామని అనుకుని వెళ్లా. ఆ రోజు రాజన్నను చూశాక ఆశ్చర్యపోయా. చేవెళ్లలో పాదయాత్ర ప్రారంభమైనప్పుడు ఆయన ముఖంపై ఎలాంటి చిరునవ్వు ఉందో.. వేల కిలోమీటర్లు నడిచిన తర్వాత కూడా అదే చిరునవ్వు చూసి మంత్ర ముగ్థుడినైపోయా. స్వాగతం చెప్పి వచ్చేయాలనుకున్న నేను.. ఆయనతో కలిసి నడక ప్రారంభించా.
తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 31 రోజుల పాటు 630 కిలోమీటర్లు వైఎస్సార్‌తో కలిసి పాదయాత్ర ముగిసిన వరకూ ఉన్నాను. ఆయన వేసిన ప్రతి అడుగుకో సమస్య వినిపించేది. రాజన్న వస్తున్నాడంటూ పంటపొలాల నుంచి కూలీలు పరిగెత్తుకొచ్చి తమ సమస్యలు చెప్పేవారు. అందరికీ చిరునవ్వుతో సమాధానమిచ్చే వైఎస్సార్ సహనమే ఆయనకు ఆభరణంగా మారింది. నేను విన్న చాలా సమస్యలు పరిష్కారమయ్యాయి.
ఆయన సీఎంగా ఉన్న సమయంలో ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో లబ్ధి కలిగిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆయనలోని గుణాల్ని దగ్గరినుంచి చూశాక రాజన్న అడుగుజాడల్లో నడవాలనీ, ఆయన ఆశయ సాధనకు కృషిచెయ్యాలని నిర్ణయించుకున్నా. వైఎస్సార్ మరణించారన్న వార్త విని ఎంతో మనోవేదనకు గురయ్యాను. అలాంటి నేత మళ్లీ రారని అనుకున్నాను. కానీ.. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రూపంలో వెఎస్సార్ మళ్లీ వచ్చారని ముఖ్యమంత్రి పాలనతో ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.’’ అని సత్తి రామకృష్ణారెడ్డి గుర్తు చేసుకున్నారు.
ప్రజాప్రస్థానంలో వైఎస్సార్‌తో కలిసి నడుస్తున్న సత్తి రామకృష్ణారెడ్డి
బెల్లం తీయన..ఆయన మనసు చల్లన
మునగపాక(యలమంచిలి): మహానేత రాజన్నతో మునగపాకకు విడదీయరాని అనుబంధం ఉంది. 17 ఏళ్ల క్రితం రాజశేఖరరెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో 2002 ఏప్రిల్ 4న డ్వాక్రాసదస్సుకు హాజరయ్యేందుకు పరవాడ నుంచి అచ్యుతాపురం మీదుగా మునగపాకకు వచ్చారు. ఈ సందర్బంలో మునగపాకకు చెందిన ఆడారి పోలయ్య క్రషర్‌వద్ద బెల్లం తయారీ జరుగుతుండడంతో తన వాహనం నుంచి కిందకు దిగి రైతు తయారు చేస్తున్న బెల్లాన్ని పరిశీలించారు. బెల్లం తయారీ ఖర్చుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. బెల్లానికి గిట్టుబాటు ధర కల్పించాలని, అలాగే వ్యవసాయ రంగానికి 7గంటల పాటు నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ రైతులు రాజన్న దృష్టికి తీసుకువచ్చారు. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రాజశేఖర్‌రెడ్డి మొదటి సంతకంగా ఉచిత విద్యుత్ ఫైల్‌పై చేయడం, అలాగే 7గంటల పాటు ఏకధాటిగా విద్యుత్ సరఫరా అందజేయడంతో రైతుల నుంచి నాడు హర్షాతిరేకాలు వినిపించాయి.
బెల్లం తయారీని ఆసక్తిగా తిలకిస్తున్న రాజన్న(ఫైల్‌ఫొటో)
ప్రతి ఇంట్లో మహానేత ఫొటో
అరకులోయ: వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో గిరిజనులకు చెప్పలేనంత అనుబంధం ఉంది. ముఖ్యంగా కోడిపుంజువలస గిరిజనులకు రాజన్న ఆరాధ్య దైవమనే చెప్పాలి. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో రాజన్న ఫొటో ఉంటుంది. గిరిజనుల విజ్ఞప్తి మేరకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఎస్టీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభా రవిబాబు గత ఏడాది కొడిపుంజువలసలో మహానేత వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 2005 సంవత్సరం ఆగస్టు నెలలో కొడిపుంజువలసలో వరద బీభత్సం సృష్టించింది. కొండదిగువున గ్రామం కావడంతో కొండచరియలు విరిగిపడ్డాయి. 36 ఇళ్లు కొట్టుకుపోయాయి.
నిద్రిస్తున్న సమయంలో ఈ సంఘటన జరగడంతో 19 గల్లంతయ్యారు. ఈ సంఘటనపై స్పందించిన అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి రాత్రికి రాత్రే సహాయక బృందాలను పంపి అప్రమత్తం చేశారు. అప్పటి ఎస్.కోట ఎమ్మెల్యే కుంభా రవిబాబు కూడా కొడిపుంజువలసలో జరిగిన అపార నష్టాన్ని వైఎస్సార్‌కు ఫోన్‌లో వివరించారు. గ్రామ గిరిజనులు నిరాశ్రయులవ్వడంతో చలించిన వైఎస్. రాజశేఖర్‌రెడ్డి మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్ నుంచి కొడిపుంజువలసకు చేరుకున్నారు. గిరిజనులకు ఏర్పడిన నష్టం, 19మంది గల్లంతు సంఘటనపై మహానేత వైఎస్సార్ కన్నీళ్లు పెట్టారు. బాధిత గిరిజన కుటుంబాలను ఓదార్చి, తాను ఉన్నాననే దైర్యాన్ని ఇచ్చారు.
మోడల్ కాలనీ నిర్మాణం : సర్వస్వం కొల్పోయి, కట్టుబట్టలతో మిగిలిన కొడిపుంజువలస గ్రామంలో 36 కుటుంబాలతో పాటు, సమీపంలోని మరో వీధిలో నివసిస్తున్న మిగిలిన కుటుంబాలను వైఎస్సార్ ఆదుకున్నారు. గ్రామంలోని అన్ని గిరిజన కుటుంబాలను సురక్షిత ప్రాంతానికి తరలించి,78 పక్కా గృహాలతో యుద్ధప్రాతిపదికన మోడల్ కాలనీని నిర్మించారు.
గుండెల్లో గుడి కట్టారు
పెందుర్తి: సబ్బవరం మండలం జోడుగుళ్లు కూడలి వద్ద నివాసం ఉంటున్న ముర్రు రామునాయుడుకి నలుగురు కుమారులు. రామునాయుడు చిన్నపాటి మెకానిక్, విద్యుత్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు. ఈ నేపథ్యంలో పిల్లలను ఉన్నత చదువులు చదివించుకునే ఆర్థిక స్తోమత లేదు. ఆ సమయంలో మహానేత డాక్టర్ వైఎస్సార్ అధికారంలోకి రావడం ఫీజురీయింబర్స్‌మెంట్ పథకం ప్రవేశపెట్టడంతో వీరికి వరమైంది. పెద్దకుమారుడు మధనశేఖర్ పెందుర్తి మండలం నరవలోని ఓ ప్రవేటు కళాశాలలో ఎంబీఏ పూర్తిచేశారు. ఆ సమయంలో ప్రభుత్వమే ఫీజు రీయింబర్స్‌మెంట్ ద్వారా ఏడాదికి రూ.37 వేలు ఇతని చదువు నిమిత్తం చెల్లించింది.
ప్రస్తుతం అదే కళాశాలలో మధనశేఖర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తూ స్థిరపడ్డారు. రెండో కుమారుడు డిగ్రీ చదివి బ్రాండిక్స్‌లో ఉద్యోగం చేస్తున్నారు. మూడో కుమారుడు ఫణీంద్రకుమార్ భీమిలిలోని ఓ కళాశాలలో ఐటీ విభాగంలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు. నాలుగేళ్లూ అతని చదువు పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరించింది. అదే కళాశాలలో జరిగిన క్యాంపస్ ఇంటర్వ్యూలో రూ.60 వేలు పైబడిన వేతనంతో స్థిరపడ్డారు. ఆఖరి కుమారుడు రాజశేఖర్ నరవలోని ఓ కళాశాలలో ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం కొలువు కోసం ఎదురుచూస్తున్నాడు. ఇలా తమ పిల్లలను ఆ మహానేత ప్రవేశపెట్టిన ఫీజురీయింబర్స్‌మెంట్ ద్వారా చదివించినందుకు కృతజ్ఞతగా తన ఇంట్లో పూజగదిలో వైఎస్సార్ చిత్రపటాన్ని ఉంచి నిత్యం పూజిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment