శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు అన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం శ్రీకాకుళంలోని 36 వార్డుల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల కష్టాలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కనిపించడం లేదన్నారు.
రైతుల తరఫున మనమే పోరాటం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థగా మార్పు చెందిన తర్వాత పేద, మధ్య తరగతి కుటుంబాలపై పన్నుభారం పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాల కోసం రూ.40 కోట్లతో నిర్మించిన పథకంతో నాలుగేళ్లపాటు నిరాటంకంగా నీరు సరఫరా చేశామని ధర్మాన చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకానికి తూట్లు పొడిచిందని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో టీడీపీ ఒక్కరికైనా ఒక్క ఇల్లు ఇచ్చిందా అని ప్రశ్నించారు.
ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించాలి
ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను, అవినీతిని, అక్రమాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వార్డు అధ్యక్షులు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. బడుగు, బలహీన వర్గాల కోసం కేటాయించిన రెండు ఎకరాల స్థలాన్ని టీడీపీ ప్రభుత్వం లీజు పేరిట ఎన్‌టీఆర్ ట్రస్ట్‌కు కేటాయించడం దారుణమన్నారు. దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వార్డుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగుర వేసేందుకు సిద్ధం కావాలని వార్డు కమిటీ ప్రతినిధులకు ధర్మాన పిలుపునిచ్చారు.
ఇసుక విధానం పేరుతో టీడీపీ శ్రేణులు కోట్లాది రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు ఎం.వి.పద్మావతి, చల్లా రవి, అంధవరపు సూరిబాబు, కోణార్క్ శ్రీను, సాధు వైకుంఠరావు, చల్లా అలివేలుమంగ, మండవిల్లి రవి, ఎం.వి.స్వరూప్, మామిడి శ్రీకాంత్, కింతలి సత్యనారాయణ, పొన్నాడ రుషి, గుడ్ల దామోదరరావు, కె.సీజు, ఆర్‌ఆర్ మూర్తి, కెఎల్ ప్రసాద్, నక్క రామరాజు, ధర్మాన రఘునాథమూర్తి, కిల్లాన సాయి, కె.విజయ్‌కుమార్, బలగ పండరీనాద్, బైరి మురళి, ఖలీల్, అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడదాం
Published Tue, Mar 29 2016 11:49 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM
Advertisement
Advertisement