ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇచ్చిన హామీలను నమ్మి తామంతా మోసపోయామని జనం ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేపట్టాక ఇచ్చిన హమీల్లో ఒక్కటీ అమలు కాలేదని మండిపడ్డారు. గడపగడపకూ వైఎస్‌ఆర్ కార్యక్రమంలో భాగంగా పర్యటిస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకులకు ప్రజలు తమ సమస్యలను వివరిస్తున్నారు. గురువారం జిల్లాలోని పలు గ్రామాల్లో జరిగిన కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది.
శ్రీకాకుళం అర్బన్: శ్రీకాకుళం రూరల్ మండలంలోని కుందువానిపేటలో వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ధర్మాన ప్రసాదరావు ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. స్మార్ట్ విలేజ్ అని చెప్పి తమ భూములన్నీ ప్రభుత్వం లాక్కుంది. ఎటువంటి పరిహారం ఇవ్వలేదు, తర్వాత బతుకు తెరువు కోసం వలస వెళ్లిన వారికి రేషన్ కట్ చేస్తున్నారని చీకటి దానయ్య, బర్రి లక్ష్మణ తదితరులు ధర్మాన ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు మాయ మాటలు నమ్మి మోసపోయారని, స్మార్ట్ విలేజ్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇది హామీగానే మిగిలిపోయిందన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, డీసీఎంఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి, పీఏసీఎస్ అధ్యక్షుడు గొండు కృష్ణమూర్తి పాల్గొన్నారు.
ఆమదాలవలసలోని మెట్టక్కివలసలో పార్టీ హైపవర్ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 500 ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న మోసాలను వివరించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందడం లేదని, నిరుద్యోగభృతి ఇవ్వడం లేదని విద్యార్థులు, యువకులు తమ్మినేనికి వివరించారు.
రణస్థలం మండలం అల్లివలసలో ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్‌చార్జి గొర్లె కిరణ్‌కుమార్ ఆధ్వర్యంగో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు తమ రేషన్‌కార్డులు తొలగించారని, పింఛన్లు రాకుండా చేశారని కిరణ్‌కుమార్ దృష్టికి తీసుకువచ్చారు.
రాజాం నగర పంచాయతీ పరిధి 17వ వార్డు అమ్మవారు కాలనీలో ఎమ్మెల్యే కంబాల జోగులు కార్యక్రమాన్ని నిర్వహించారు. గడచిన రెండేళ్లలో చంద్రబాబు ప్రభుత్వం రూ.లక్షల కోట్లు అవినీతికి పాల్పడిందని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోపించారు. బాబు ఇచ్చిన హామీలను ముద్రించిన 100 ప్రశ్నల కరపత్రాన్ని ఇంటింటికీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ నేతలు టంకాల పాపినాయుడు, పాలవలస శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నరసన్నపేట మండలం మడపాం పంచాయతీ కొత్తపేట, బుచ్చిపేట గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలను పక్షపాతంగా అమలు చేస్తున్నారని, అర్హులైనప్పటికీ రాజకీయంగా కక్షసాధించి ఎంపిక చేయడం లేదని, ఉపాధిపనుల్లో కూడా వివక్షత చూపుతున్నారని పలువురు మహిళలు కృష్ణదాస్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఏక పక్షంగా వ్యవహరిస్తూ నియంతృత్వ ధోరణిని అవలంబిస్తున్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, మహిళా అధ్యక్షురాలు చింతాడ మంజు పాల్గొన్నారు.
నందిగాం మండలం దడ్లరామచంద్రాపురం గ్రామంలో టెక్కలి నియోజకవర్గ ఇన్‌చార్జి దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. 80 సంవత్సరాలైనప్పటికీ వృద్ధాప్య పింఛన్ రావడం లేదనిచమళ్ల బోడెమ్మ దువ్వాడ ముందు ఆవేదన వ్యక్తం చేసింది. కార్యక్రమంలోపార్టీ నేతలు దువ్వాడ వాణి, కొంచాడ పాపయ్య, రొక్కం సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.
కొత్తూరు మండలం మాసింగి కాలనీలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు మాటలకు మోసపోయామని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామన్నారని, ఈ మాటలకు నమ్మి రుణం కట్టలేదని, ఇపుడు బ్యాంకర్లు వద్దనుంచి నోటీసులు వచ్చాయని బి.దమయంతి, కవితలతోపాటు పలువురు నోటీసులు చూపించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు డి.అప్పన్న, పొట్నూరు మధుబాబు, రాజా, మోహనరావు, షణ్ముఖరావు, గోవిందరావు పాల్గొన్నారు.
ఇఛ్చాపురంలోని పురుషొత్తపురంలో నియోజకవర్గ సమన్వయకర్త నర్తు రామారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పార్టీ జిల్లా అద్యక్షురాలు రెడ్డి శాంతి పాల్గొన్నారు. పింఛన్లు అందడం లేదని, డ్వాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేయలేదని పలువురు ఫిర్యాదు చేశారు.
హామీలతో ముంచేశాడు!
Published Thu, Jul 14 2016 11:59 PM | Last Updated on Fri, Aug 10 2018 6:21 PM
Advertisement
Advertisement