రాజంపేట పట్టణంఉస్మాన్‌నగర్‌లో చెత్తను స్వయంగా ఎత్తివేస్తున్న వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
రాజంపేట(వైఎస్సార్ కడప) : రాజంపేట పట్టణంలో అధ్వానంగా తయారైన పారిశుద్ధ్యం పరిస్థితిపై వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పురపాలన అధ్వానంగా ఉందంటూ తూర్పారబెట్టారు. పారిశుద్ధ్యం పనులను ప్రైవేటు సంస్థలకు అప్పగించినప్పటి నుంచి మరింత దారుణంగా తయారైందంటూ స్వయంగా ఆయనే చెత్తను ఎత్తివేసి నిరసన తెలిపారు. వివరాల్లోకెళితే.. పట్టణాల్లో పారిశుద్ధ్య పనులు ప్రైవేటీకరణ చేస్తూ ప్రభుత్వం చేపట్టిన చర్య అభాసుపాలైంది. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులు పడకేశాయి. ఎక్కడ వేసిన చెత్త అక్కడే ఉండిపోయింది. ఫలితంగా పట్టణంలో దుర్గంధం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో పారిశుద్ధ్యంపై వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలో ప్రజలతో కలిసి స్వచ్ఛందంగా చెత్త ఎత్తివేసే కార్యక్రమం చేపట్టారు.
20 ట్రాక్టర్లను పెట్టి 20 వార్డులలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు కలిసి చెత్త తొలగింపు పనులు చేపట్టారు. స్వయంగా ఆకేపాటి కూడా చెత్తను తొలగించే పనుల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఏ మున్సిపాలిటిలో లేకపోయినప్పటికి రాజంపేట మున్సిపాలిటిలో 279 జీఓను అమలు చేశారు. దీంతో పారిశుద్ధ్యం పనులు క్లీన్‌సిటీ అనే సంస్థకు అప్పగించారు. అప్పటినుంచి పారిశుద్ధ్యం పడకేసింది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పట్టణంలోని చెత్తను ట్రాక్టరలో వేసుకొని మున్సిపాలిటీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.
అయితే రాజంపేట రూరల్ సీఐ నరసింహులు ఆధ్వర్యంలో పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకున్నారు. ర్యాలీ మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లకుండా గేటుకు తాళం వేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి మున్సిపల్ రీజినల్ డైరెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ పట్టణంలో పారిశుద్ధ్యం పరిస్థితి అధ్వానంగా తయారైందని, ఇలాగే కొనసాగితే చెత్తపై సమరభేరిని మోగిస్తామని, రెండు రోజుల్లో పట్టణంలో పారిశుద్ధ్యం పరిస్థితి మెరుగు పరచాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన కార్యక్రమానికి పట్టణ ప్రజలు పెద్దఎత్తున మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఓవైపు వైఎస్సార్‌సీపీ నాయకులు ట్రాక్టర్లలో చెత్తను తొలగిస్తుంటే, మరోవైపు మున్సిపల్ సిబ్బంది కూడా హడావుడిగా చెత్తను తొలగించేందుకు ప్రయత్నించారు.
మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
ఆకేపాటితో పాటు నేతలు చెత్త ట్రాక్టర్లతో ర్యాలీగా మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకోగానే పోలీసులు రంగప్రవేశం చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మున్సిపల్ కార్యాలయం గేటుకు తాళాలు వేశారు. ప్రజలను లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆకేపాటితోపాటు వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులరెడ్డి, బీసీ విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆకేపాటి మురళీరెడ్డి,బీసీ రాష్ట్ర విభాగం ప్రధానకార్యదర్శి ఈశ్వరయ్య, బీసీ విభాగం రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పసుపులేటి సుధాకర్ నాయకులు కృష్ణారావు, భాస్కర్‌రాజు, కొండూరు విశ్వనాధరాజు, గోవిందు బాలకృష్ణ, బొల్లినేని రామ్మోహన్‌నాయుడు, దండుగోపి, పెంచలయ్య, గుండు మల్లికార్జునరెడ్డి, మైనార్టీ నాయకులు యూసఫ్, జావిద్, మసూద్, ఖలీల్, ఆలం, స్థానిక నాయకులు మార్కెట్ కృష్ణారెడ్డి, బలిజపల్లె చిన్న తదితరులు ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment