► 24 గంటల నీటి సరఫరా ఏమైంది?
► వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి అప్పిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా ప్రశ్న
► పోరాటాలకు వెనుకాడబోమని హెచ్చరిక
పట్నంబజారు(గుంటూరు): ‘ఎండలు మండుతున్నాయి..నగర ప్రజల గొంతులు ఎండిపోతున్నాయి..వేసవిలో తాగునీటి కష్టాలను పట్టించుకోని దుస్థితిలో ప్రభుత్వం, అధికారులు ఉన్నారు. దీనిపై ప్రజల పక్షాన చూస్తూ ఉరుకోం..ప్రజలకు నీరు ఇచ్చే దాకా..ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోం’ అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి చెప్పారు. 24/7 సమగ్ర నీటి సరఫరా అని ఆకాశమే హద్దుగా ప్రచారాలు చేశారని, అయినా ఇప్పటి వరకు కనీసం పనులు కూడా మొదలు పెట్టని పరిస్థితులు కనపడుతున్నాయని విమర్శించారు.
రూ.460 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రారంభించిన సమగ్ర తాగునీటి పథక నిర్మాణ పనులు నత్తనడక సాగుతుంటే, మే 31లోపు సమగ్ర తాగునీటి ప్రాజెక్టు ఎలా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. అరండల్‌పేటలోని పార్టీ నగర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకర్ల సమావేశంలోమాట్లాడారు. అధికారుల గణాంకాల ప్రకారమే నిత్యం ప్రతి మనిషికి 14 లీటర్ల నీరు కావాలని, నగర జనాభా ప్రకారం 140 ఎంఎల్‌డీల నీరు కావాల్సి ఉంటే, కేవలం 80 నుంచి 90 ఎంఎల్‌డీల నీరు మాత్రమే అందజేస్తున్నారని ధ్వజమెత్తారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌పై నిర్లక్ష్యం..
వేసవి కాలం సమీపిస్తున్న తరుణంలో అధికార యంత్రాంగం ముందుగానే సమ్మర్ యాక్షన్ ప్లాన్‌తో సిద్ధంగా ఉండి, జనవరిలో చెరువులు నింపే కార్యక్రమాన్ని కూడా పూర్తిస్థాయిలో నిర్లక్ష్యం చేశారని అప్పిరెడ్డి మండిపడ్డారు. రూ.5కోట్లతో ప్రతి సంవత్సరం సమ్మర్‌యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తారని, ప్రస్తుతం రూ.2కోట్లు మాత్రమే కేటాయించటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గుంటూరు నగరానికి ఉండవల్లి నుంచి నులకపేట మీదుగా తక్కెళ్ళపాడు వరకు ప్రత్యేకంగా పైపు లైను నిర్మించే పనులు నత్తే నయం అన్న చదంగా నడుస్తున్నాయన్నారు. భూగర్భ జలాలు వేల అడుగుల్లోతుకు అడుగంటి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం నీటి ట్యాంకర్‌ల ద్వారా సరఫరా చేయకుండా దారి మళ్లిస్తున్నారని ఆరోపించారు. నీటి ఎద్దడిని పరిష్కరించకపోతే ఎంతటి పోరాటాలకైనా వెనుకాడబోమని హెచ్చరించారు.
ప్రణాళికలు ఏవీ..
గుంటూరుతూర్పు ఎమ్మెల్యే షేక్ మొహమ్మద్ ముస్తఫా మాట్లాడుతూ ప్రణాళికలు లేకుండా అధికారులు వ్యవహరించటం సిగ్గుచేటన్నారు. ప్రజ లు గొంతెండుతోంది మహాప్రభో అన్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడని మండిపడ్డారు. కేవలం ధనార్జన కోసమే కాకుండా, కొద్ది మేర కు ప్రజాభివృద్ధికి కావాల్సిన పనులు కూడా చేయాలని సూచించారు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నియోజవర్గానికి నిధులు కూడా కేటాయించలేని నీఛ సంస్కృతికి చంద్రబాబు సర్కార్ నాంది పలికిందని మండిపడ్డారు.
ఆనాడు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి పక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు సైతం ని«ధులు కేటాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రజల కోసం పోరుబాట పట్టేందుకు వెనుకాడబోమన్నారు. కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు ఉడతా కృష్ణ, తుమ్మేటి శారదా శ్రీని వాస్, పూనూరి నాగేశ్వరరావు, ఆబీద్‌బాషా, అగ్గిపెట్టల రాజు, బత్తుల దేవా నంద్, పార్టీ నేతలు చదలవాడ రవీంద్రనా«థ్, పానుగంటి చైతన్య, షేక్ రబ్బా ని, షేక్ గౌస్, నరాలశెట్టి అర్జున్, విఠ ల్, వినోద్, సంతోష్, రామ్, లక్ష్మీనారా యణ, మస్తాన్‌వలి పాల్గొన్నారు.