ఆ కమిటీలో లోకేశ్‌కు స్థానమా?
వైఎస్సార్‌సీపీ నేత కొలుసు పార్థసారథి ధ్వజం
సాక్షి, హైదరాబాద్: సీనియర్ మంత్రులు ఉండాల్సిన భూ కేటాయింపుల కమిటీలో ఏ అర్హత ఉందని లోకేశ్‌కు స్థానం కల్పిస్తారని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. సీఎం చంద్రబాబు గద్దె నెక్కిన నాటి నుంచీ తన కుమారుడు లోకేశ్‌ను ఎలా ప్రమోట్ చేయాలనే తాపత్రయంతోనే పని చేస్తున్నారని, ఆయనకు ఏ మాత్రం ప్రజాస్వామ్య విలువలు లేవని విమర్శించారు.
పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ లోకేశ్‌ను 2015 సెప్టెంబర్ 30న టీడీపీ జాతీయ కార్యదర్శిగా చేశారని, ఈ ఏడాది మార్చి 30న ఎమ్మెల్సీ చేశారన్నారు. ఆ తర్వాత రెండు రోజులకే మంత్రిని చేశారని, ఇపుడు నెల రోజులకే సీనియర్ మంత్రులుండాల్సిన కమిటీలో ఆయన్ను సభ్యుడిగా చేశారంటే బాబుకు తన కుమారుడి పట్ల ఆరాటం కనిపిస్తోందన్నారు. పెట్టుబడిదారులకు భూపందేరం కోసమే ఇలా చేశారని దుయ్యబట్టారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి కనుకనే ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తిని కమిటీ నుంచి పక్కన బెట్టారా? అని అనుమానం వ్యక్తం చేశారు.