‘ది.. వాకర్’ నీ విశ్వసనీయత ఏమిటి?
జేసీ వ్యాఖ్యలు అహంకారపూరితం: తమ్మినేని ధ్వజం
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడుతుందంటూ అధికార టీడీపీ ఎంపీ జె.సి.దివాకర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన అహంకారపూరిత వైఖరికి నిదర్శనమని వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ఆయన సోమవారం పార్టీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. జేసీ చాలా ఎక్కువగా మాట్లాడుతున్నారని, అసలాయనకున్న విశ్వసనీయత ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ నుంచి బయటపడిన దివాకర్ ఏ పార్టీలో చేరాలో తెలియక అన్ని పార్టీల చుట్టూ పాదయాత్ర చేసి ‘ది.. వాకర్’ (నడిచేవాడు)గా తన పేరును సార్థకం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. ‘‘టీడీపీని జేసీ క్లోజ్ చేస్తారో.. టీడీపీయే ఆయనను క్లోజ్ చేస్తుందో ముందుగా తేల్చుకోవాలి’’ అని సూచించారు. సూర్యచంద్రులున్నంత వరకూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ వైఎస్సార్ సీపీ అజరామరంగా ఉంటుంద.. ప్రజల హృదయాల్లో తమ పార్టీ ఎప్పటికీ సుస్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు.
పోలవరానికి అన్ని అనుమతులు తెచ్చిందీ వైఎస్ అని తెలియదా?
పోలవరం ప్రాజెక్టు గురించి కూడా దివాకర్ అర్థరహితంగా మాట్లాడుతున్నారని తమ్మినేని తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టుకు రూపకల్పన చేసిందీ, దానికి అన్ని రకాల అనుమతులు సాధించింది, పోలవరం నిర్మాణం పూర్తికావాలని తుదిశ్వాస వరకూ తపించిందీ వై.ఎస్.రాజశేఖరరెడ్డి అనే విషయం నిన్నటి వరకూ కాంగ్రెస్‌లో ఉన్న జేసీకి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ‘‘పోలవరం నిర్మాణం చేపట్టాలని తమ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు పాదయాత్ర చేసిన విషయం దివాకర్‌కు తెలియదా? పోలవరం నిర్మాణం కోసం ఏళ్ల తరబడి వైఎస్ కృషి చేస్తున్న సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఒక్క దరఖాస్తు అయినా తాను స్వయంగా పంపారా?’’ అని తమ్మినేని సూటిగా ప్రశ్నించారు. పోలవరంపై తమ పార్టీ వైఖరిలో ఏమీ మార్పు లేదని, దాని నిర్మాణం సత్వరం జరగాలని, తద్వారా ఆంధ్రప్రదేశ్ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నామని ఆయన స్పష్టంచేశారు.