పులివెందులలో అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వరంలో రహదారుల దిగ్బంధం కార్యక్రమం బుధవారం ఉదయం ప్రారంభమైంది. దాంతో పులివెందులతోపాటు ఆ పరిసర ప్రాంతాలలో రహదారులపై వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. అలాగే వైఎస్ఆర్ సీపీ నేతలు సురేష్బాబు, అంజాద్ భాషా ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం జరిగింది.
దాంతో ఇస్కాన్ సర్కిల్, రాజంపేట, వైఎస్ఆర్ సర్కిళ్లలో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. జమ్మలమడుగులో ఆర్టీసీ బస్సులను ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, సూర్యనారాయణరెడ్డిలు అడ్డుకున్నారు. జిల్లాలోని రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రహదారులను దిగ్బంధించారు. దాంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
మైదుకూరులో వైఎస్ఆర్సీపీ నేత రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో 18వ నెంబర్ జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. అదే జిల్లాలోని పోరుమామిళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్రపాలక మండలి సభ్యులు డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో రహదారులను దిగ్బంధించారు. దాంతో ఎక్కడివాహనాలు అక్కడ నిలిచిపోయాయి. కాగా రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసగా గోవిందరెడ్డి ఆధ్వర్యంలో నడుస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారం 75వ రోజుకు చేరుకున్నాయి.