నీటి విడుదల | The release of water | Sakshi
Sakshi News home page

నీటి విడుదల

Published Fri, Jan 9 2015 3:49 AM | Last Updated on Thu, Aug 9 2018 4:26 PM

నీటి విడుదల - Sakshi

నీటి విడుదల

వైఎస్‌ఆర్‌సీపీ తోడ్పాటుతో పీబీసీకి అదనపు కోటా
పీబీసీ నీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలి
ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి

 
పులివెందుల/లింగాల :  ఈ ఏడాది పీబీసీ నీటి సాధనలో రైతుల కృషి ఎనలేనిదని వైఎస్‌ఆర్ సీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి అన్నారు. గురువారం చిత్రావతి నదిలో నిల్వ ఉన్న పీబీసీ నీటిని కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లను ఎత్తి పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు విడుదల చేశారు. ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడుతూ తుంగభద్ర జలాశయం నుంచి పీబీసీకి కేటాయించిన నీటిని సీబీఆర్‌కు విడుదల చేయించాలని పీబీసీ ఆయకట్టు రైతులు నాయకులపై, అధికారులపై ఒత్తిడి తెచ్చారన్నారు. నీటి విడుదలలో అన్యాయం జరగకుండా రైతులే తుంపెర మళ్లింపు కాలువ వద్ద నిరంతర పర్యవేక్షణ చేశారన్నారు. పీబీసీకి అదనంగా మరో టీఎంసీ నీటిని కేటాయించాలని వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుతో ఫోన్‌లో చర్చించారన్నారు. అదేవిధంగా ఇక్కడి రైతుల, ప్రజల సమస్యలను ఆయనకు వివరించి అదనపు కోటా నీటిని సాధించారన్నారు. తాను నిరంతరం హెచ్‌ఎల్‌సీ, ఐఏబీ అధికారులను అనంతపురం కలెక్టర్‌ను కలుస్తూ పీబీసీ నీటిని సాధించగలిగామని ఆయన అన్నారు. ప్రస్తుత సీబీఆర్ నుంచి పీబీసీకి నీటిని విడుదల చేయడంతో ఆయకట్టు రైతులలో సంతోషం కనిపిస్తోందన్నారు.

ప్రస్తుతం సీబీఆర్‌లో 1.20టీఎంసీల నీరు ఉన్నాయని.. అదేవిధంగా కేటాయించిన ప్రత్యేక నీటి కోటా మరో టీఎంసీ నీరు సీబీఆర్‌లోకి వచ్చి చేరుతున్నాయన్నారు. రైతులు అధైర్యపడొద్దని, సంయమనంతో నీటిని వినియోగించుకోవాలన్నారు. మొదట కామసముద్రం చెరువుకు, అనంతరం పులివెందుల పట్టణ ప్రజల దాహార్థి తీర్చేందుకు నక్కలపల్లె ఎస్‌ఎస్ ట్యాంకుకు విడుదల చేస్తారన్నారు. తాగునీటి అవసరం అనంతరం సింహాద్రిపురం మండల ఆయకట్టు రైతులకు, అనంతరం లింగాల కుడికాలువకు, చిత్రావతి నదికి నీరు విడుదల చేస్తామన్నారు.  

లింగాల కాలువకు నీరు విడుదల చేయాలి : వైఎస్ వివేకా

త్వరితగతిన లింగాల కాలువకు నీరు విడుదల చేయాలని వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి అన్నారు. అదేవిధంగా చిత్రావతి నదికి నీటిని విడుదల చేసేందుకు అదనంగా కనీసం 0.5టీఎంసీల నీటిని కేటాయించాలన్నారు. నది ద్వారా కొండాపురం వరకు నీటిని పారించాలన్నారు. దీని ద్వారా తాగడానికి నీరు కూడా లభించని చిత్రావతి పరివాహక ప్రాంతాలలో సుమారు 40గ్రామాల ప్రజలకు తాగునీరు అందుతాయన్నారు.

సొంత ఖర్చులతో కుడికాలువ పనులు :

ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సొంత ఖర్చులతో కుడికాలువ పనులు నిర్వహింపజేస్తున్నారు. కుడికాలువ 27.700 కి.మీ. వద్ద కాలువకు అడ్డంగా ఉన్న తండును తొలగింపజేసేందుకు ఇప్పటికే సుమారు రూ.10లక్షల వ్యయం చేశారు. తీవ్ర అనావృష్టితో కొట్టుమిట్టాడుతున్న మండల ప్రజలను, రైతాంగాన్ని ఆదుకొనేందుకు కనీసం చిన్నకుడాల వరకైనా లింగాల కాలువలో నీరు ప్రవహింపజేసేందుకు తీవ్ర కృషి చేస్తున్నారు.

గేట్లకు పూజలు చేసిన వైఎస్ అవినాష్, వైఎస్ వివేకా, సతీష్:

చిత్రావతి నది నుంచి కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా పీబీసీకి నీటిని విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా కుడికాలువ హెడ్ రెగ్యులేటర్ గేట్లకు పూజలు చేసి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సీపీ సీజీసీ సభ్యులు వైఎస్ వివేకానందరెడ్డి, రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చెర్మైన్ సతీష్‌రెడ్డిలు కలిసి పూజలు చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఆర్డీవో వినాయకం, పీబీసీ ఈఈ మురళీకృష్ణ, డీఈఈ జయకుమార్‌బాబు, ఏఈ నాయక్, లింగాల ఎంపీపీ పి.వి.సుబ్బారెడ్డి, సింహాద్రిపురం ఎంపీపీ భర్త కసనూరు పరమేశ్వరరెడ్డి, లింగాల, సింహాద్రిపురం మండలాల రైతులు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement