సమైక్య పోరులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి రోజున పెద్ద ఎత్తున నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : సమైక్య పోరులో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం గాంధీ జయంతి రోజున పెద్ద ఎత్తున నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేపడుతున్నారు.
జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈ దీక్షలు జరగనున్నాయి. జిల్లా చరిత్రలో ఈ దీక్షలు సమైక్య ఉద్యమంలో ఒక మైలురాయిగా నిలిచిపోనున్నాయి. ఒకే రోజున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోనూ సుమారు 20 మంది వరకు పార్టీ నేతలు ఈ దీక్షలు చేపట్టనుండటం విశేషంగా చెప్పవచ్చు.
గతంలో ఏ ఉద్యమంలోనూ ఇంత మంది నాయకులు వేర్వేరు కేంద్రాల్లో ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టిన సంఘటనలు లేవు. రాష్ట్ర విభజనతో జిల్లా ప్రజానీకం ఎదుర్కోబోయే కష్ట, నష్టాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు దీక్షల్లో పాల్గొంటున్నారు. వారికి సంఘీభావంగా మరి కొందరు నాయకులు కూడా దీక్షల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.
నెల్లూరు సిటీ సమన్వయకర్త పి.అనీల్‌కుమార్ యాదవ్ నేతృత్వంలో గాంధీబొమ్మ సెంటర్లో, రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఆత్మకూరు బస్టాండు సెంటర్‌లోనూ ఉదయం 10 గంటలకు దీక్షలు ప్రారంభిస్తారు. ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్సీ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఉదయగిరిలో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి, కావలిలో రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి దీక్షలు చేపట్టనున్నారు. సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి మండల కేంద్రమైన వెంకటాచలంలో కాకాణి గోవర్ధన్‌రెడ్డి, గూడూరు నియోజకవర్గ సమన్వయకర్తలు డాక్టర్ సీహెచ్.బాలచెన్నయ్య, పి.సునీల్‌కుమార్ క్లాక్‌టవర్ సెంటర్‌లోనూ, సూళ్లూరుపేటలో దబ్బల రాజారెడ్డి, కిలివేటి సంజీవయ్య, నెలవసుబ్రమణ్యం, వెంకటగిరిలో కొమ్మి లక్ష్మయ్యనాయుడు దీక్షలు చేపడతారు.
కోవూరు నియోజకవర్గానికి సంబంధించి నార్తురాజుపాళెంలో జరిగే దీక్షల్లో ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పాల్గొంటారు. కాగా నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్ బుధవారం ఉదయం గాంధీ జయంతిని పురస్కరించుకుని నగరంలోని గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారు. అనంతరం ఆత్మకూరు వెళ్తారు. ఆత్మకూరులో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో జరిగే నేతల దీక్షా శిబిరాన్ని ప్రారంభిస్తారు. అనంతరం ఉదయగిరి, కావలి, కోవూరు, నెల్లూరు నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టిన నాయకులకు సంఘీభావం ప్రకటించనున్నారు.