అవినీతి, హత్యల్లో రాష్ట్రాన్ని చంద్రబాబు నెం.1గా చేశారని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా అన్నారు.
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి, హత్యల్లో చంద్రబాబు నాయుడు నెంబర్ వన్‌గా చేశారని తుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ధ్వజమెత్తారు. ఆయన గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలోని అన్ని హామీలు అమలు చేశామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ...వారి కార్యకర్తల ముందు కాకుండా ప్రజల ముందు చెప్పగలరా అని సూటిగా ప్రశ్నించారు. యనమల వయసుకు తగ్గట్టుగా మాట్లాడటం లేదని దాడిశెట్టి రాజా మండిపడ్డారు.
ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు కన్నబాబు మాట్లాడుతూ పట్టిసీమ ప్రాజెక్ట్ వల్ల చంద్రబాబు, లోకేశ్ గ్రోత్ రేటులు పెరిగాయే తప్ప రైతులు, ప్రజల గ్రోత్ రేటు పెరగలేదన్నారు. గురువారం నుంచి జూన్ 5వ తేదీ వరకూ ప్రతి నియోజకవర్గంలో ప్లీనరీ సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలు, అధికార పార్టీలో లోపాలపై చర్చించి తీర్మానాలు చేస్తామని అన్నారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో జరిగిన వైఎస్‌ఆర్ సీపీ సమావేశంలో కురుసాల కన్నబాబు, కందుల దుర్గేష్, దాడిశెట్టి రాజా, వంతల రాజేశ్వరి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జక్కంపూడి విజయలక్ష్మి, పార్టీ నేతలు పాల్గొన్నారు.