
ప్రచారం నిర్వహిస్తున్న డాక్టర్ జగన్మోహన్‌రావు
సాక్షి, నందిగామ : దౌర్జన్యం చేయడం, దోచుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించటం తెలియదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్‌మోహన్‌రావు విమర్శించారు. నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 3, 15వ వార్డుల్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లోని ప్రతి గడపకు వెళ్లి జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలవుతాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్ల పాలన ప్రజా సంపదను కొల్లగొట్టడంతోనే సరిపోయిందన్నారు.
టీడీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు
తెలుగుదేశం పాలనలో ఘోరంగా విఫలమవడంతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిల్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులను అభివృద్ధి చేయడంలో పక్షపాత వైఖరి అవలంబించారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్థించారు.
కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల కన్వీనర్లు, కార్యదర్శులు కత్తురోజు శ్రీనివాసాచారి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం), చిరుమామిళ్ల అశోక్‌బాబు, మంగునూరు కొండారెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్ ఖాలిఖ్, కుక్కల సత్యనారాయణ ప్రసాద్, కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీని ఆదరించాలి
చందర్లపాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్‌రావు కోరారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చందర్లపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. గడిచిన 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. మార్పు కోసం ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలన్నారు. జననేత అధికారంలోకి వస్తే పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు.
గీతా మందిరం దగ్గర నుంచి మొదలైన ప్రచారం గ్రామంలోని ప్రధాన మార్గాల గుండా సాగింది. ఆయనకు పలు చోట్ల హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎంపీపీ కస్తాల రవిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట బుచ్చయ్యచౌదరి, మండల కన్వీనర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణప్రసాద్, ముక్కపాటి నరసింహారావు పాల్గొన్నారు.