chandarlapadu
-
మున్నేరు వాగు ఘటన: నలుగురు మృతదేహలు లభ్యం
చందర్లపాడు: వంట కోసం పుల్లలు తెచ్చేందుకు సైకిళ్లపై వెళ్లిన ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. ఉదయం వెళ్లిన వారు చీకటి పడినా ఇంటికి రాకపోయేసరికి ఆరా తీసిన తల్లిదండ్రులకు తమ పిల్లలు ఏటి దగ్గరకి వెళ్లినట్లు తెలిసి ఆందోళన చెందారు. హుటాహుటిన అక్కడికి వెళ్లి చూసేసరికి ఏటొడ్డున పిల్లల దుస్తులు, చెప్పులు, సైకిళ్లు మాత్రమే కనిపించాయి. ఎంత వెతికినా వారి జాడ తెలియకపోవడంతో నీళ్లలో గల్లంతై ఉంటారని భావించి గాలింపు ప్రారంభించారు. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో సోమవారం ఈ విషాద ఘటన జరిగింది. వివరాలివీ.. గ్రామానికి చెందిన మాగులూరి సన్నీ (12), మైల రాకేష్ (11), కర్ల బాలయేసు (12), జట్టీ అజయ్ (12), గురజాల చరణ్ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 6, 7, 9 తరగతులు చదువుతున్నారు. సంక్రాంతి సెలవులు కావడంతో ఇళ్ల వద్దే ఉన్న వీరు పుల్లలు తీసుకొద్దామని సైకిళ్లపై బయల్దేరారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీశారు. పిల్లలు మునేరు దగ్గరకి వెళ్లినట్లు పశువుల కాపరులు సమాచారమిచ్చారు. చుట్టుపక్కల వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు తెలిపారు. నందిగామ రూరల్ సీఐ నాగేంద్రకుమార్, చందర్లపాడు ఎస్ఐ రామకృష్ణ, తహసీల్దార్ సుశీలాదేవి గాలింపు చర్యలు చేపట్టారు. పల్లెకారులు, గజ ఈతగాళ్లు, గ్రామస్తులు నదిలో పడవల సాయంతో రాత్రివేళ వెతుకులాట ప్రారంభించారు. నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ఘటనా స్థలికి చేరుకుని దగ్గరుండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాత్రి 11 గంటలైన పిల్లల ఆచూకీ లభ్యంకాలేదు. ముక్కుపచ్చలారని చిన్నారులు మునేరులో గల్లంతవడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతం శోక సంద్రంలో మునిగిపోయింది. నలుగురు చిన్నారుల మృతదేహలు లభ్యం నీటిలో పడి మునిగిపోయిన ఐదుగురు చిన్నారులలో నలుగురు మృతదేహలు లభ్యమయ్యాయి. మరో యువకుడి మృతదేహం కోసం గజఈతగాళ్లు గాలిస్తున్నారు. -
భాష్యం స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం
సాక్షి,చందర్లపాడు : విద్యార్థులతో వెళుతున్న ఓ ప్రయివేట్ స్కూల్ బస్సుకు తృటిలో ప్రమాదం తప్పింది. కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం తుర్లపాడు వద్ద భాష్యం స్కూల్ బస్సు అదుపు తప్పి కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. వెంటనే స్థానికులు అప్రమత్తమై విద్యుత్ సరఫరా నిలిపి వేయడంతో బస్సులో ఉన్న 32మంది విద్యార్థులు క్షేమంగా బయటపడ్డారు. అనంతరం విద్యార్థులను అక్కడ నుంచి తరలించారు. ఈ సంఘటనపై ప్రత్యక్ష సాక్షులు మాట్లాడుతూ డ్రైవర్ నిర్లక్క్ష్యంగా మితిమీరిన వేగంతో బస్సును నడపటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. మూల మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాలని పలుమార్లు హెచ్చరించినా డ్రైవర్ పెడచెవిన పెట్టేవాడని, స్కూల్ యాజమాన్యం డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు తమ పిల్లలు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
ప్రజా సంపద కొల్లగొట్టిన టీడీపీ పాలన
సాక్షి, నందిగామ : దౌర్జన్యం చేయడం, దోచుకోవడం తప్ప తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజా సమస్యలు పరిష్కరించటం తెలియదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు విమర్శించారు. నందిగామ నగర పంచాయతీ పరిధిలోని 3, 15వ వార్డుల్లో శుక్రవారం ఆయన పార్టీ నాయకులు, కార్యర్తలతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వార్డుల్లోని ప్రతి గడపకు వెళ్లి జగన్మోహన్రెడ్డి ప్రకటించిన ‘నవరత్నాలు’ పథకాలను ప్రజలకు వివరిస్తూ, అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు అమలవుతాయని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్మోహన్రావు మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్ల పాలన ప్రజా సంపదను కొల్లగొట్టడంతోనే సరిపోయిందన్నారు. టీడీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారు తెలుగుదేశం పాలనలో ఘోరంగా విఫలమవడంతో సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాలపై నిలదీస్తున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీల కౌన్సిల్ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులను అభివృద్ధి చేయడంలో పక్షపాత వైఖరి అవలంబించారని మండిపడ్డారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి ఒక్క అవకాశమివ్వాలని అభ్యర్థించారు. కార్యక్రమంలో పార్టీ పలు విభాగాల కన్వీనర్లు, కార్యదర్శులు కత్తురోజు శ్రీనివాసాచారి, నెలకుదిటి శివనాగేశ్వరరావు, చల్లా బ్రహ్మేశ్వరరావు (బ్రహ్మం), చిరుమామిళ్ల అశోక్‌బాబు, మంగునూరు కొండారెడ్డి, పసుపులేటి శ్రీనివాసరావు, షేక్ ఖాలిఖ్, కుక్కల సత్యనారాయణ ప్రసాద్, కొండా కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని ఆదరించాలి చందర్లపాడు : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని సమన్వయకర్త డాక్టర్ మొండితోక జగన్మోహన్రావు కోరారు. ప్రచార కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం చందర్లపాడులో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీగా పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. గడిచిన 20 ఏళ్లుగా ఈ నియోజకవర్గ ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు. మార్పు కోసం ఒక్కసారి తనకు అవకాశం కల్పించాలన్నారు. జననేత అధికారంలోకి వస్తే పార్టీల కతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తామని చెప్పారు. గీతా మందిరం దగ్గర నుంచి మొదలైన ప్రచారం గ్రామంలోని ప్రధాన మార్గాల గుండా సాగింది. ఆయనకు పలు చోట్ల హారతులిచ్చి స్వాగతం పలికారు. ఎంపీపీ కస్తాల రవిబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కోట బుచ్చయ్యచౌదరి, మండల కన్వీనర్ వెలగపూడి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ సత్యనారాయణప్రసాద్, ముక్కపాటి నరసింహారావు పాల్గొన్నారు. -
ఫ్లెక్సీలు కళకళ.. కోడ్ వెలవెల!
సాక్షి, కోనాయపాలెం (చందర్లపాడు) : ఎన్నికల నగారా మోగింది. ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. వచ్చే నెల 11న ఎలక్షన్స్ జరగనున్నాయి. అయినప్పటికీ కోనాయపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ బ్యానర్లు దర్శనమిస్తూనే ఉన్నాయి. జెడ్పీటీసీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ ఇంటి ముందు పింఛన్లు, సంక్రాంతి కానుకలతో కూడిన బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. హరిజనవాడలోని వాటర్ ట్యాంకు వద్ద, అంగన్వాడీ కేంద్రం వద్ద తెలుగుదేశం ప్రభుత్వం చేసిన పనుల వివరాల జాబితాను రాశారు. ఎలిమెంటరీ పాఠశాల (చిన్నైస్కూల్) వద్ద చంద్రబాబు, లోకేష్ బొమ్మలతో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రచార పట్టికలు దర్శనమిస్తున్నాయి. ఇవి గ్రామంలోని జనసమర్థం ఉండే ప్రధాన రహదారుల వెంబడి ఉన్నప్పటికీ అధికారులు వీటిని తొలగించలేదు. ఎన్నికల నియమావళికి లోబడి అధికారులు వ్యవహరిస్తారో లేదో చూడాల్సి ఉంది. ఒత్తిళ్లకు తలొగ్గి వీటిని తొలగించని పక్షంలో సంబంధిత అధికారులపై ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు చెబుతున్నారు. మరి వీటిని తొలగిస్తారో లేదో వేచిచూడాల్సి ఉంది. తోటరావులపాడులో ఇలా.. తోటరావులపాడు గ్రామ ఎంట్రన్స్‌లో హైస్కూల్‌కు వెళ్లే ప్రధాన మార్గానికి ఎన్టీర్ మార్గ్ పేరు పెట్టి పెద్ద ఆర్చిని నిర్మించారు. ఈ ఆర్చికి ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యేలు దేవినేని వెంకటరమణ, తంగిరాల ప్రభాకరరావు ఫొటోలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోల డూమ్‌లలో లైటింగ్ ఏర్పాటు చేయడంతో పగలు, రాత్రి తేడా లేకుండా కాంతివంతంగా ప్రకాశిస్తున్నాయి. ఏటూరు గ్రామానికి వెళ్లే ఆర్అండ్బీ రహదారి వెంబడే ఈ ఆర్చి ఉండటం విశేషం. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినప్పటికీ అధికారులు ఈ ఆర్చికి అమర్చిన టీడీపీ నాయకుల ఫొటోలు కనపడకుండా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. -
పవర్ గ్రిడ్ టవర్ పనుల్లో అపశృతి
కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం పొక్కునూరు గ్రామంలోని పవర్ గ్రిడ్ నిర్మాణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. నిర్మాణ పనులు చేస్తుండగా ఇనుప పోల్ కూలి మీద పడటంతో ఆరుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు. గాయాలైన వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. బాధితులంతా జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. పవర్ గ్రిడ్ టవర్ కూలీ పనుల నిమిత్తం వచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. -
108 వాహనంలో ప్రసవం
కృష్ణా జిల్లా: చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామానికి చెందిన మాతంగి ప్రశాంతి 108 వాహనంలో ప్రసవించింది. ప్రశాంతి పరిస్థితి విషమంగా ఉండటంతో నందిగామ ప్రభుత్వాసుపత్రి డాక్టర్లు, విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ప్రశాంతిని 108 వాహనంలో తరలిస్తుండగా గుంటుపల్లి సమీపంలో 108 వాహనంలోనే ప్రసవించింది. పురిటినొప్పులతో తీవ్రంగా బాధపడుతున్న ప్రశాంతికి 108 సిబ్బంది సహాయం చేయడంతో మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డను తర్వాత విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.నందిగామ ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్వాకంపై ప్రశాంతి కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
అరవయ్యేళ్లకు కలిశారు!
చందర్లపాడు: పూర్వ విద్యార్థుల కలయికతో కృష్ణాజిల్లా చందర్లపాడు పులకించిపోయింది. ఆరు దశాబ్దాల క్రితం విడిపోయిన మిత్రుల కలయికకు స్థానిక యార్లగడ్డ సుబ్బారావు స్వగృహం వేదికగా మారింది. 1956లో స్థానిక వాసిరెడ్డి కోటయ్య మెమోరియల్ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్ఎల్సీ చదివిన విద్యార్థులు కలుసుకొని మధురానుభూతులు పంచుకున్నారు. వారి ఆప్తమిత్రుడు సుబ్బారావు 11వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన కుమారులు వెంకట్రావు, బాపయ్య, చంటి, బుల్లబ్బాయి, సత్యనారాయణప్రసాద్‌ల నుంచి ఆహ్వానం అందుకున్న పూర్వ విద్యార్థులు తమ మిత్రుడికి అంజలి ఘటించేందుకు సామూహికంగా తరలివచ్చారు. ఉద్యోగాలు, వ్యాపారాలు, ఇతర వ్యాపకాల నిమిత్తం వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన వారంతా ఒక్కటిగా కలుసుకొని నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. -
చెట్టును ఢీకొన్న బైక్.. ఇద్దరి మృతి
నందిగామ(కృష్ణా జిల్లా): చందర్లపాడు మండలం ముప్పాళ్ల సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చందర్లపాడుకు చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఆటో బోల్తా : ఎనిమిది మందికి గాయాలు
విజయవాడ : కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం కోనాయపాలెం వద్ద కూలీలను తీసుకువెళ్తున్న ఆటో బుధవారం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 8 మంది కూలీలు గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను చందర్లపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం జగ్గయ్యపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... ప్రమాదంపై ఆరా తీశారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
మరణంలోనూ ఒక్కటిగా....
భర్త మృతి తట్టుకోలేక భార్య మరణం చందర్లపాడులో విషాదఛాయలు చందర్లపాడు : జీవితంలో కలిసి మెలిసి ఉండటమేకాదు.. చావులోనూ ఒకటయ్యారు ఆ ఆలుమగలు.. పిల్లలను పెంచి పెద్దచేసి వాళ్లను ఓ ఇంటి వాళ్లను చేసిన ఆ దంపతులు ఊహించని రీతిలో మృత్యుడిలోకి చేరుకున్నారు. ముందుగా భర్త మృతిచెందగా ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా కొద్ది గంటల్లోనే తనువుచాలించింది. మండల కేంద్రమైన చందర్లపాడులో మంగళవారం జరిగిన ఈ ఘటన గ్రామస్తులను కలచివేసింది. గ్రామానికి చెందిన వడ్లమూడి వెంకటేశ్వర్లు(65) హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతని భార్య తిరుపతమ్మ(60) అతనికి చేదోడువాదోడుగ ఉంటోంది. వయస్సు మీద పడటంతో కొద్ది నెలల క్రితమే హోటల్‌ను తీసేశారు. ప్రశాంతంగా జీవిస్తున్న సమయంలో వెంకటేశ్వర్లు ఈ నెల 13న మధ్యాహ్నం 2 గంటల సమయంలో గుండెపోటుకు గురై మరణించాడు. భర్త తనువుచాలించడంతో భార్య తిరుపతమ్మ తీవ్ర మనోవేదనకు గురైంది. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆమె రాత్రి 10 గంటల సమయంలో తుదిశ్వాస విడిచింది. వీరిరువురికి బుధవారం కుటుంబ సభ్యులు దహనసంస్కారాలు నిర్వహించారు. -
ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం ధర్నా
విజయవాడ : ప్రభుత్వానికి అనుకూలమైన వ్యక్తులకు మాత్రమే కార్పొరేషన్ రుణాలు కేటాయిస్తున్నారని ఆగ్రహించిన దళితులు సోమవారం ఎండీవో కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా చందర్లపాడు మండల కార్యాలయం ఎదుట సోమవారం చోటుచేసుకుంది. మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన దళితులు గతంలో ఎస్సీ కార్పోరేషన్ రుణాల కోసం మొరపెట్టుకోగా.. ప్రస్తుతం మంజూరైన రుణాల్లో అధిక శాతం టీడీపీ అనుకూల వర్గాలకు చెందినవే ఉన్నాయి. దీన్ని నిరసిస్తూ అదే గ్రామానికి చెందిన దళితులు ఎండీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని ఎండీవోకు వినతిపత్రం అందించారు.