
జీఎస్టీ నుంచి చేనేత రంగాన్ని మినహాయించండి
♦ కేంద్ర ఆర్థిక మంత్రికి వైఎస్సార్ కాంగ్రెస్ విన్నపం
న్యూఢిల్లీ: జీఎస్టీ నుంచి చేనేత రంగానికి మినహాయింపు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రతినిధి బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి విన్నవించింది. పార్టీ చేనేత విభాగం నేతలతో కలసి ఎంపీలు బుట్టా రేణుక, వైఎస్ అవినాశ్‌రెడ్డి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి వినతిపత్రం సమర్పించారు. ‘జీఎస్టీ ప్రభావం నిరుపేద చేనేత కార్మికులకు ఇబ్బందిగా పరిణమించింది. చేనేత వస్త్రాల ముడి సరుకుపై 5 శాతం, వెయ్యి రూపాయల పైబడి ఉత్పత్తులకు 12 శాతం జీఎస్టీ విధించారు. చేనేత రంగంపై జీఎస్టీ ప్రభావం లేకుండా చూడాలి. ఈ అంశాలపై మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇదివరకే మీకు లేఖ రాశారు’ అని విజ్ఞాపన పత్రంలో కోరారు. ఈ భేటీ అనంతరం ఎంపీ బుట్టా రేణుక మీడియాతో మాట్లాడుతూ ‘జీఎస్టీ ప్రభావాన్ని ఆర్థిక మంత్రికి వివరించాం. చేనేతను, పవర్‌లూమ్ రంగాన్ని వేరుగా చూడాలని కోరాం. వారు సానుకూలంగా స్పందించారు..’ అని వివరించారు.
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ ‘వారం క్రితమే చేనేత సోదరులు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. చేనేత కార్మికులకు జీఎస్టీ లేకుండా చూడాలని వారు కోరారు. జగన్ వెంటనే ఆర్థిక మంత్రికి లేఖ రాశారు. చేనేత ప్రతినిధులను కేంద్ర మంత్రి వద్దకు తీసుకెళ్లాలని మాకు సూచించారు. మేమంతా ఆయనకు సమస్యను వివరించాం. చేనేత రంగానికి జీఎస్టీ ఉండరాదని గట్టిగా మా డిమాండ్ వినిపించాం. దీనిని ఫిట్‌మెంట్ కమిటీకి నివేదిస్తామని, ఆ తరువాత జీఎస్టీ కౌన్సిల్‌కు వస్తుందని, ఆ తరువాత తగిన నిర్ణయం తీసుకుంటామని జైట్లీ మాకు హామీ ఇచ్చారు..’ అని పేర్కొన్నారు. ఈ ప్రతినిధి బృందంలో వైఎస్సార్ చేనేత విభాగం ఏపీ అధ్యక్షుడు చిల్లపల్లి మోహన్‌రావు, పార్టీ సీజీసీ సభ్యుడు గిరిరాజ్ నగేష్, పార్టీ చేనేత విభాగం నేతలు భండారు ఆనంద్ ప్రసాద్, అందె జగదీష్, పాక సురేష్, కొల్లిపాక సురేష్ బాబు, బుట్టా రంగయ్య తదితరులు ఉన్నారు.