సిగ్గుమాలిన పనిచేసి కొనసాగుతారా?
- గుడివాడ మున్సిపల్ చైర్మన్‌పై వైఎస్సార్‌సీపీ సభ్యుల ఆగ్రహం
- పార్టీకి రాజీనామా చేసేవరకు కౌన్సిల్‌కు రానివ్వబోమన్న కొడాలి
గుడివాడ: వైఎస్సార్‌సీపీ తరఫున గెలుపొంది, గుడివాడ మున్సిపల్ చైర్మన్ పదవి చేపట్టి ఇటీవల టీడీపీలో చేరిన యలవర్తి శ్రీనివాసరావుపై వైఎస్సార్‌సీపీ సభ్యులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సిగ్గుమాలిన పనిచేసి ఏ ముఖం పెట్టుకుని చైర్మన్‌గా కొనసాగుతాడని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నిలదీశారు. తమ పార్టీ తరఫున గెలిచి టీడీపీలో చేరిన చైర్మన్‌తో పాటు కౌన్సిలర్లు రాజీనామా చేసేవరకు వారిని కౌన్సిల్‌కు రానివ్వబోమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో శనివారం నాటి గుడివాడ మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఉద్రిక్త వాతావరణంలో కొనసాగింది.
పార్టీ ఫిరాయించిన చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు సమావేశ మందిరంలోకి ప్రవేశించడం చూసిన వైఎస్సార్‌సీపీ ఫ్లోర్‌లీడర్ చోరగుడి రవికాంత్ ఆవేశానికి లోనయ్యారు. బూటుతో కొట్టడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ.. పార్టీ మారి నీతిమాలిన రాజకీయాలు చేసినవారిని చెప్పుతో కొట్టాలన్నారు. కౌన్సిల్ నిరవధికంగా వాయిదా పడిన తర్వాత మాట్లాడుతూ.. ఇది కుక్క కాటుకు చెప్పు దెబ్బవంటిదని ఆయన వ్యాఖ్యానించారు. యలవర్తికి దమ్ముంటే రాజీనామా చేసి పార్టీ మారాలని అన్నారు.