టీడీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారు
ఎమ్మెల్యే కొడాలి నాని
నందివాడ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రామాపురంలో దళితుల మధ్య చీలిక తీసుకురావటం కోసం అధికార పార్టీ నాయకులు గ్రామంలో గొడవలు పెడుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) ఆరోపించారు. రామాపురానికి చెందిన టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై దాడి చేసి గాయపరిచారు. దీంతో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు గాయపడి వారిని గుడివాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కొడాలి నాని గాయపడిన కార్యకర్తలను పరామర్శించారు. ఎమ్మెల్యే నాని విలేకర్లతో మాట్లాడుతూ మా పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ మొండ్రు వెంకటేశ్వరరావు వర్గానికి చెందిన కార్యకర్తల ఇళ్లపై అధికార పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి విధ్వంసం సృష్టించారని తెలిపారు. గతంలో అధికార పార్టీ వ్యక్తులు మా పార్టీ కార్యకర్తలపై దాడి చేస్తే పోలీసులు మాపై 307 సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి జైలుకు పంపారని, టీడీపీ వారిని 327 సెక్ష న్ నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇచ్చి బయటకు వదిలేశారని ఆయన పేర్కొన్నారు.
టీడీపీ వారి దాడిలో ఆరుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించినట్లు వివరించారు. దీనిపై జిల్లా ఎస్పీ, డీఐజీతో మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఇలాగే అధికార పార్టీ నాయకులు దాడులకు తెగబడితే మున్ముందు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ పెయ్యల ఆదాం, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు దేశిరెడ్డి రామ్మోహన్‌రెడ్డి, జెడ్పీటిసీ సభ్యుడు మీగడ ప్రేమ్‌కుమార్, సీనియర్ నాయకులు దూక్కిపాటి శశిభూషణ్, పాలడుగు రాంప్రసాద్, కో-ఆప్షన్ సభ్యుడు బండి సుబ్బారావు, పూనూరి బుద్దారెడ్డి, చంద్రయ్య పాల్గొన్నారు.