నా కొంప ముంచడానికే వరద వస్తోంది! | YSRCP MLA Ambati Rambabu Fires On Chandrababu On Press Meet | Sakshi
Sakshi News home page

వరదలతో చంద్రబాబు ఆందోళన: అంబటి

Published Sat, Aug 17 2019 12:31 PM | Last Updated on Sat, Aug 17 2019 7:17 PM

YSRCP MLA Ambati Rambabu Fires On Chandrababu On Press Meet - Sakshi

సాక్షి, అమరావతి: ఈ ఏడాది కురుస్తున్న వర్షాలతో రాష్ట్ర ప్రజలంతా ఆనందంగా ఉంటే.. వరద నా కొంప ముంచడానికే వస్తోందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళన చెందుతున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. ప్రజలు ప్రాజెక్టుల దగ్గరకి వెళ్లి కృష్ణా ప్రవాహం చూసి ఆనందిస్తున్నారని, కానీ చంద్రబాబు కుటుంబం మాత్రం బాధగా ఉందని ఆయన అన్నారు. శనివారం అంబటి రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. హై సెక్యురిటీ జోన్‌లో ఉన్న చంద్రబాబు ప్రమాదకరమైన ఇంట్లో ఎందుకు వుంటున్నారని ప్రశ్నించారు. కృష్ణానదికి ఈ స్థాయిలో వరద రావడం చాలా అరుదున్నారు. 

ఆర్టికల్‌ 370 రద్దుతో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు వచ్చినంత కోపం కృష్ణా వరదలతో చంద్రబాబుకు వచ్చిందని అన్నారు. ఆయన నివాసం  అక్రమ కట్టడమని, నది ప్రవాహంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముందే చెప్పినట్లు ఆయన గుర్తుచేశారు. అయినా చంద్రబాబు తప్పని తెలిసికూడా మొండిగా అక్కడే వుంటున్నారని విమర్శించారు. వరదలతో చంద్రబాబు నివాసం మునిగిపోతే.. గత ఎన్నికల్లో ఓటమితో రాజకీయంగా చంద్రబాబు కొంప ఎప్పుడో మునిగిపోయిందని ఎద్దేవా చేశారు. కాగా భారీ వరదలతో నది గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరిన విషయం తెలిసిందే. దీంతో ఇంట్లో నుంచి సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోవాలని అక్కడి సిబ్బందికి అధికారులు సూచించారు. 

సమావేశంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ‘‘నీచమైన ప్రచారాల వల్లే ప్రజలు మిమ్మల్ని ఛీ కొట్టారు. ఇంటి విషయంలో తప్పు చేస్తూ దాన్ని కప్పిపుచ్చుకునేందుకు అనేక తప్పులు చేస్తున్నారు. నోటీస్ ఇచ్చేందుకు వెళ్లిన రెవెన్యూ సిబ్బందిని కూడా రానివ్వకుండా అడ్డుకున్నారు. తక్షణమే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవడం మంచిదని సూచిస్తున్నాం. తప్పును సరిదిద్దుకోకపోతే ప్రకృతి ప్రకోపానికి గురి అవుతారు. మీక్షేమం కోసం చెబుతున్నాం. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి అమరావతిలో సొంత ఇల్లు ఎందుకు కట్టుకోలేదు?. ప్రతిపక్ష నేత హోదాలో ప్రభుత్వ ఇళ్లు ఏర్పాటు కోసం చంద్రబాబు కోరితే పరిశీలిస్తాం’ అని అన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement