
‘చంద్రబాబు ఎందుకు తేల్చి చెప్పడం లేదు’
ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర,రాష్ట్రా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని బీఏసీ చైర్మన్ బుగ్గన అన్నారు.
హైదరాబాద్ : ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ అంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే, బీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలో ఏడు జిల్లాలకు కేంద్రం రాయితీలు ప్రకటించిందని హడావుడి చేస్తున్నారని, కేంద్రం ప్రకటించిన రాయితీలు రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోనివే తప్ప కొత్త విషయం కాదన్నారు.
కేంద్రం ఏపీతో పాటు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, బిహార్కు కూడా రాయతీలు ఇచ్చిందన్నారు. రాయితీలు గొప్ప విషయమైతే ఆ రాష్ట్రాలు ఎందుకు పట్టించుకోవడం లేదని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ప్రజలను గందరగోళంలో పడేయటమే చంద్రబాబు ప్రభుత్వ లక్ష్యమని ఆయన ధ్వజమెత్తారు. హోదా తప్ప మాకేమీ వద్దని చంద్రబాబు ఎందుకు తేల్చి చెప్పడం లేదని సూటిగా ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమైనదని బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న చంద్రబాబు, వెంకయ్య లాంటి వారుకూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.