‘జీవో నెం.44ను సడలింపు వెనుక భారీ కుట్ర’
విజయవాడ: సీఆర్‌డీఏ పరిధిలో జీవో నెం.44ను సడలించడం వెనుక భారీ కుట్ర దాగి ఉందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ ఆరోపించారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ జీవో నెం.44 ఎత్తేయాలని గతంలో వైఎస్‌ఆర్ సీపీ ఆందోళన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పుడు స్పందించని ప్రభుత్వం ఇప్పుడు హడావుడిగా జీవోను సడలించిందని జోగి రమేష్ అన్నారు.
ఆంక్షల పేరుతో రైతులను భయపెట్టి మంత్రి నారా లోకేశ్, ఆయన బినామీలు పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని విమర్శించారు. ఆ కొనుగోళ్లు పూర్తయిన వెంటనే జీవోను సడలించారని అన్నారు. జీవో నెం.44ను కాంగ్రెస్ హయాంలో ఇచ్చిందన్న ఆరోపణలపై చర్చకు సిద్ధమని జోగి రమేష్ సవాల్ చేశారు. సీఆర్‌డీఏలో సభ్యుడు కాని లోకేశ్ ... కమిటీ సమావేశంలో ఎలా పాల్గొంటారని ఆయన సూటిగా ప్రశ్నించారు. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించాలని జోగి రమేష్ డిమాండ్ చేశారు.