
ప్రత్యేక హోదాపై మీనమేషాలు తగదు
ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి
బాపట్ల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక హోదాపై మీనమేషాలు మానుకోవాలని ఎమ్మెల్సీ డాక్టరు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సూచించారు. బాపట్లలోని తన నివాసంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధించుకుంటే హక్కుగా రాష్ట్రాభివృద్ధికి నిధులు తెచ్చుకోవచ్చని తెలిపారు. ప్రత్యేక ప్యాకేజీలంటే కేంద్ర ప్రభుత్వం దయాదాక్ష్యిణ్యాలపై ఆధారపడి ఉంటాయని పేర్కొన్నారు. ప్రత్యేకహోదా కోసం 18సార్లు నివేదికలను పంపినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పుకోవటం విచారకరమన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉన్న టీడీపీనే అన్నిసార్లు ప్రత్యేకహోదాపై నివేదిక పంపితే వినకపోతే సఖ్యతఉన్నాట్లా..? లేనట్లో సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. శాంతియుతంగా విజయవాడలో ప్రదర్శన చేపడితే విచక్షణరహితంగా అరెస్టు చేయించటం సరికాదన్నారు.
శంకుస్థాపనకు దూరం.. పచ్చటి భూములను చదును చేసి రాజధాని నిర్మించటం ఏమేరకు భావ్యమో చంద్రబాబునాయుడు చెప్పాలని ఉమ్మారెడ్డి డిమాండ్ చేశారు. శివరామకృష్ణ కమిటీ కూడా పంటపొలాల జోలికి వెళ్లకూడదనే నివేదిక ఇచ్చిందన్నారు. ఇప్పుడు రాజ ధాని శంకుస్థాపనకు వెళ్ళితే వైఎస్సార్‌కాంగ్రెస్‌పార్టీ కూడా పచ్చటి పొలాలను నాశనం చేసుకున్నదాంట్లో భాగస్వామ్యం ఉంటుందని చెప్పారు. రాజధాని శంకుస్థాపనకు తమ పార్టీ దూరంగా ఉంటుందని తెలిపారు. 33 వేల ఎకరాలు పంటపొలాలను తీసుకోకుండా నూజివీడులో ఉన్న 50వేల ఎకరా ల అటవీభూములు తీసుకుంటే నేడు ఆహార ధాన్యాలు పండే పచ్చటి పొలాల కు ఇబ్బంది కలిగేదికాదన్నారు.
ధరల స్థిరీకరణకు నిధి కేటాయించకపోవటం విచారకరం..పప్పుధాన్యాలు, ఇతర నిత్యావసర సరుకుల ధరలు వంద నుంచి 140శాతం పెరిగినప్పటికీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అదుపు చేయలేకపోతున్నాయని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ధరల స్థిరీకరణకు వెయ్యికోట్లు కేటాయిస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఆ విషయాన్ని అసలు పట్టించుకోవటంలేదన్నారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు నరాలశెట్టి ప్రకాశరరావు, నాయకులు నరాలశెట్టి కృష్ణమూర్తి, వెంకట్రావు ఉన్నారు.