
మార్కాపురం/పెద్దదోర్నాల: మూడు జిల్లాల్లో శాశ్వతంగా కరువు నివారించే వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంపై టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఒంగోలు పార్లమెంట్ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 2018 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామంటూ మూడేళ్లుగా ఆర్భాటపు ప్రకటనలు చేస్తూ ప్రజల్ని మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. సోమవారం పార్టీ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ వైవీ మాట్లాడుతూ టన్నెల్–1 పూర్తి కావాలంటే రూ.150 కోట్లు, టన్నెల్–2కు రూ.350 కోట్లు అవసరమవుతాయన్నారు. ప్రభుత్వం 2014–15లో రూ.50 కోట్లు, 2015–16లో రూ.70 కోట్లు, 2016–17లో రూ.200 కోట్లు మాత్రమే కేటాయించినట్టు చెప్పారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు సుమారు రూ.37 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు.
వెలిగొండ మొదటి టన్నెల్ పనులు 2008 ఆగస్టు 19న ప్రారంభం కాగా, 2014 నాటికి 12 కిలోమీటర్లు పూర్తయ్యాయని చెప్పిన ఎంపీ వైవీ చంద్రబాబు ప్రభుత్వంలో మాత్రం 3 కిలోమీటర్లు మాత్రమే పూర్తయ్యాయన్నారు. మొదటి టన్నెల్‌కు 6 కోట్లు, 2వ టన్నెల్‌కు 3 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. రెండవ టన్నెల్ పనులు 2009లో ప్రారంభం కాగా, మొత్తం 18.82 కిలోమీటర్లుకు గానూ 2014 నాటికి 10.68కిలోమీటర్ల దూరం పూర్తయిందని, 2014 నుంచి ఇప్పటి వరకు 2 కిలోమీటర్లు మాత్రమే పనులు జరిగాయన్నారు. హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 36 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు చేయగా, ఇప్పుడు రూ.97 కోట్లతో ప్రతిపాదనలు చేశారన్నారు. మొదటి టన్నెల్ పనులు 2018 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉందన్నారు. ఇప్పటికి 14.92 కిలోమీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. రోజుకు ఐదారు మీటర్లకు మించి పనులు జరగటం లేదని ఎంపీ చెప్పారు.
వెలిగొండతో కరువు దూరం..
ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం జిల్లాలో 735 గ్రామాలు, నెల్లూరు జిల్లాలో 30, కడప జిల్లాలో 30 గ్రామాలకు తాగునీరు అందుతుందన్నారు. ప్రకాశం జిల్లాలో 3.35 లక్షల ఎకరాలకు సాగునీరు, నెల్లూరు జిల్లాలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గల్లోని 80 వేల ఎకరాలు, కడప జిల్లాలోని పొరుమామిళ్ల, కలసపాడు, బద్వేలు ప్రాంతాల్లో 26వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. మూడేళ్లుగా టీడీపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని ఎంపీ వైవీ అన్నారు.
జిల్లాలో కరువు పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, నాలుగేళ్లుగా వర్షాలు లేక, పంటలు పండక, తాగునీరు లేక అవస్థలు పడుతున్నారని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తేనే ఈ ప్రాంతంలో కరువు పోతుందని, 2018కి ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆర్‌ఆర్ ప్యాకేజిని నిర్వాసిత గ్రామాల ప్రజలకు తక్షణమే అందించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికపై పనులు పూర్తి చేయాలన్నారు. ప్రాజెక్టుపై ప్రభుత్వం ఇలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ఆయన పాదయాత్ర పూర్తయిన తరువాత వెలిగొండ ప్రాజెక్టు కోసం ఈ ప్రాంత ప్రజాప్రతినిధులతో పాదయాత్ర చేపడతామని ఆయన చెప్పారు. పోలవరంతోపాటు వెలిగొండ ప్రాజెక్టుపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీ వెంట మాజీ ఎమ్మెల్యేలు కేపీ కొండారెడ్డి, ఉడుముల శ్రీనివాసరెడ్డి, పిడతల సాయి కల్పనారెడ్డి, సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి, మార్కాపురం, కొనకనమిట్ల, పొదిలి, పెద్దారవీడు, తర్లుపాడు, పెద్దదోర్నాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ కన్వీనర్లు మాలకొండయ్య, రామనారాయణరెడ్డి, సాయి రాజేశ్వరరావు, రంగారెడ్డి, డి.వెంకటరెడ్డి, బాషాపతిరెడ్డి, అమిరెడ్డి రామిరెడ్డి, కె.నరసింహారావు, మెట్టు వెంకటరెడ్డి, నల్లబోతుల కొండయ్య, చిర్లంచర్ల బాలమురళీకృష్ణ, జంకె ఆవులరెడ్డి, కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి కంది ప్రమీలారెడ్డి, రమణమ్మ, ఆవులమంద పద్మ, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వెలిగొండ ప్రాజెక్టు డీఈలు ఏకాంబరేశ్వరయ్య, రామమోహనరావు ఉన్నారు.
దోచుకోవడానికే కాంట్రాక్టర్ మార్పు..
పాత కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించకుండా 60సీ జీఓ విడుదల చేసి కడప జిల్లాకు చెంది టీడీపీ నేతగా ఉన్న కొత్త కాంట్రాక్టర్‌ను నియమించుకుంటున్నారని ఎంపీ చెప్పారు. 2వ టన్నెల్ పనులు 2019మే నాటికి పూర్తి చేయాల్సి ఉండగా నిధులు లేక పాత బకాయిలు చెల్లించకపోవటంతో ప్రాజెక్టు పనులు రెండు నెలల నుంచి నిలిచిపోయాయన్నారు. ప్రభుత్వం ఇప్పటికిప్పుడు 500 కోట్ల రూపాయలు కేటాయించి పనులు ప్రారంభిస్తే టన్నెల్ పనులు పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందన్నారు. వాస్తవాలు ఇలా ఉండగా, చంద్రబాబునాయుడు, నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అసెంబ్లీలో మూడేళ్లుగా వెలిగొండ ప్రాజెక్టును 2018కి పూర్తి చేస్తామంటూ ప్రకటిస్తున్నారని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ప్రశ్నించారు. తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే కచ్చితంగా వచ్చే బడ్జెట్‌లో రూ.500 కోట్లు కేటాయించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కాంట్రాక్టర్లను మార్చినంత మాత్రాన దోపిడీ జరగటమే తప్ప, పనులు ముందుకు జరగవన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు.