ఈసీకి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఢిల్లీలో ఈసీని కలిసిన ఆయన... ఏపీలో టీడీపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్‌సీపీ నుంచి 21 మంది ఎమ్మెల్యేలను చేర్చుకోవడమే కాకుండా, వారితో రాజీనామా చేయించకుండా నలుగురికి మంత్రి పదవులు కూడా ఇచ్చిన విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ విషయంలో ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించిందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. నిర్ణీత సమయంలో స్పీకర్ చర్యలు తీసుకోని పక్షంలో ఎన్నికల సంఘం నుంచి నోటీసులు పంపిస్తామన్నారని తెలిపారు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల పెంపు కూడా లేదని ఈసీ స్పష్టం చేసిందని తెలిపారు. రాజ్యాంగాన్ని సవరిస్తే తప్ప, అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు సాధ్యం కాదని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.