'కొత్తపల్లి గీత తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారు'
హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీత మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎన్నికల సందర్భంగా గీత నామినేషన్ వేసేటపుడు తప్పుడు ధ్రువపత్రాలు పొందుపరిచారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆరోపించారు. మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఈశ్వరి మాట్లాడారు.
కొత్తపల్లి గీత ఎస్టీ కాదంటూ, ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ ఈశ్వరి ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. కొత్తపల్లి గీత నామినేషన్ అఫిడవిట్‌లో ఫోర్జరీ సంతకాలు చేశారని ఆరోపించారు. సమాచార హక్కు చట్టం ద్వారా ఆమె నామినేషన్ పత్రాలు తీసుకున్నామని ఈశ్వరి వెల్లడించారు. ఆమె ఎస్టీ కాదని గతంలోనే జాయింట్ కలెక్టర్ మంగపతిరావు రిపోర్టు ఇచ్చారని చెప్పారు. ఈ ప్రెస్‌మీట్ తన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేశారు. కొత్తపల్లి గీతకు దమ్ముంటే రాజీ నామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధపడాలని ఈశ్వరి సవాల్ విసిరారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గీత ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.