
వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి
ఎన్నికలు ముగిశాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్సిపి ఎంపిలు రాజకీయాలు వదిలేసి ఇక అభివృద్ధి పనులపై దృష్టి సారించారు.
న్యూఢిల్లీ: ఎన్నికలు ముగిశాయి. అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రాలలోనూ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వైఎస్ఆర్సిపి ఎంపిలు రాజకీయాలు వదిలేసి ఇక అభివృద్ధి పనులపై దృష్టి సారించారు. ఆ పార్టీ ఎంపిలు ఈ రోజు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలుసుకుంటూ, తమ తమ నియోజకవర్గ సమస్యలు వివరిస్తూ బిజీబిజీగా ఉన్నారు. ఎంపీలు అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డిలు విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ను కలిశారు. గల్ఫ్ బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. గల్ఫ్ దేశాల్లో చనిపోతున్న భారతీయుల మృత దేహాలను వెంటనే భారత్‌కు రప్పించే ఏర్పాట్లు చేయాలని కోరారు. గల్ఫ్ బాధితుల సమస్యల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏజెంట్ల మోసాలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వారు కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ను కోరారు.
ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు కేంద్ర రైల్వే మంత్రి సదానందగౌడను కలిశారు. తమ నియోజకవర్గాల్లో పెండింగ్ రైల్వే ప్రాజెక్ట్‌లను పూర్తి చేయాలని కోరారు. కాచిగూడ - గుంతకల్ డబుల్ డక్కర్ రైలును ఒంగోలు వరకు పొడిగించాలని వైవీ సుబ్బారెడ్డి కోరారు. ప్రస్తుతం భద్రాచలం - మణుగూరు రైల్వే లైన్‌ను త్వరగా పూర్తి చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.