
చార్జీల పెంపుపై భగ్గుమన్న విపక్షం
విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షం భగ్గుమంది.
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ చార్జీల పెంపుపై ప్రతిపక్షం భగ్గుమంది. వైఎస్సార్‌సీపీ నిరసనలతో అసెంబ్లీ దద్దరిల్లింది. పెంచిన చార్జీలను వెనక్కి తీసుకోవాలని విపక్షం గట్టిగా డిమాండ్ చేసింది. ప్రజలపై రూ. 941 కోట్ల భారాన్ని మోపిన విద్యుత్ చార్జీల పెంపు కన్నా సభలో చర్చించే ప్రధాన సమస్య ఏముంటుందని పాలకపక్షాన్ని నిలదీసింది. తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ జరగాల్సిందేనని విపక్ష సభ్యులు సభలో పెద్దఎత్తున నినదించారు.
మూడు రోజుల సమావేశాల బహిష్కరణ అనంతరం మంగళవారం సభలో అడుగుపెట్టిన వైఎస్సార్‌సీపీ.. కరెంట్ చార్జీల పెంపుపై వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దాన్ని స్పీకర్ కోడెల తిరస్కరించడంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. దీంతో సభ ప్రారంభమైన గంట వ్యవధిలోనే రెండు సార్లు వాయిదా పడింది. మూడోసారి సభ ప్రారంభంకాగానే చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సభలో ప్రకటన చేశారు. అనంతరం విపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యుత్తు చార్జీల పెంపులో హేతుబద్ధత లేదని, అందువల్ల తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూలత లేకపోవడంతో చివరకు విపక్షం సభ నుంచి వాకౌట్ చేసింది. ముఖ్యమంత్రి వివరణ తర్వాత సభ వాయిదా పడింది.
విపక్ష నిరసన ప్రారంభమిలా..
తమ వాయిదా తీర్మానాన్ని చర్చకు అనుమతించాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్న సమయంలో శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు కలగజేసుకుని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) ప్రతిపాదనలను ప్రభుత్వం అంగీకరించిందని, ప్రశ్నోత్తరాల అనంతరం దీనిపై సభలో సీఎం ప్రకటన చేస్తారన్నారు. దీనికి విపక్షం తీవ్ర అభ్యంతరం తెలిపింది. వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపడుతున్నట్టు ప్రకటించారు.
సమయం ఎంతిస్తారో చెప్పమంటే...
వైఎస్సార్‌సీపీ శాసనసభాపక్ష ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ చొరవ తీసుకుని స్పీకర్ వద్దకు వెళ్లి.. ఎలాగూ సీఎం ప్రకటన ఉన్నందున దీనిపై ఇప్పుడే చర్చిస్తే బాగుంటుందని సూచించారు. దీనికి స్పీకర్ ఒకసారి తిరస్కరించిన తీర్మానంపై చర్చ ఉండదన్నారు. ఆ దశలో జ్యోతుల సీఎం చేసే ప్రకటనపై చర్చకు ఎంత సమయం ఇస్తారో చెప్పాలని కోరారు. ఎంత అవకాశం ఉంటే అంత ఇస్తామని స్పీకర్ బదులిస్తున్న సమయంలో యనమల మళ్లీ జోక్యం చేసుకుని విద్యుత్ చార్జీలపై చిత్తశుద్ధి ఉంటే చర్చకు రావాలంటూ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. ఇంతలో అచ్చెన్నాయుడు మైకందుకుని తమంత సానుకూల ప్రభుత్వం ఎక్కడా లేదని, ఈ విషయాన్ని గుర్తించకుండా బాధ్యతారహితంగా విపక్షం వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. దీంతో విపక్ష సభ్యులు ‘విద్యుత్ చార్జీల పోటు, పేద ప్రజలపై వేటు, పెంచిన చార్జీలు తగ్గించాలి, సభలో చర్చించాలి’ అనే ప్లకార్డులు ప్రదర్శిస్తూ ‘వద్దు, వద్దు, కరెంటు చార్జీలు పెంచవద్దు’ అంటూ నినాదాలు చేశారు.
మీరు లేకపోతే.. ఉప్పూ, కారం లేనట్టే
పరిస్థితి గందరగోళంగా తయారవుతున్న దశలో బీజేపీ సభ్యుడు విష్ణుకుమార్‌రాజు కలగజేసుకుని ప్రతిపక్షం లేని రెండు రోజుల సమావేశాలు ఉప్పు, కారం లేనట్టు చప్పగా సాగాయన్నారు. విద్యుత్ చార్జీల పెంపునకు తమ పార్టీ వ్యతిరేకమన్నారు. ఆ వెంటనే మంత్రి దేవినేని ఉమా మాట్లాడుతూ ఏపీఈఆర్‌సీ విద్యుత్ చార్జీల పెంపుపై ఐదు చోట్ల బహిరంగ విచారణలు జరిపితే విపక్షం ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. దీనికి విపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
విపక్షం వాకౌట్...
చంద్రబాబు ప్రకటనపై చర్చ అనంతరం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మైక్ తీసుకుని ‘‘చంద్రబాబు మనసులో మార్పు వస్తుందని ఆశించాం. ఎన్నికల ముందు చార్జీలు తగ్గిస్తామని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. దీంతో బాబుకు జ్ఞానోదయం అయిందేమోనని, మారారేమోనని అనుకున్నాం. ఇప్పుడు చూస్తే బాబు ఏమాత్రం మారలేదని స్పష్టమైంది. ప్రభుత్వ తీరుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నాం..’’ అని ప్రకటించి వెళ్లిపోయారు. విపక్ష సభ్యులు బయటకు వెళ్లిన తర్వాత కూడా మంత్రులు అచ్చెన్నాయుడు, యనమలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రతిపక్ష నేత జగన్ లక్ష్యంగా విమర్శలు, వ్యక్తిగత ఆరోపణలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రి వివరణతో సభ బుధవారానికి వాయిదా పడింది.
జగన్‌కు మైకు ఇచ్చినట్టే ఇచ్చి...
ఈ దశలో స్పీకర్ కోడెల విపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిని మాట్లాడమని మైకు ఇచ్చారు. దాంతో ఆయన లేచి అధ్యక్షా.. ‘‘విద్యుత్ చార్జీలు తగ్గిస్తామని చంద్రబాబు చెప్పారు, కానీ ఈవేళ పెంచారు’’ అని అంటూ ఉండగానే మైకు కట్ అయింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష సభ్యులకు, స్పీకర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. తిరస్కరించిన అంశంపైన మాట్లాడే వీలులేదని స్పీకర్, అటువంటప్పుడు ఎందుకు మైకు ఇచ్చారని విపక్ష సభ్యులు వాదించుకున్నారు. సభ్యుల్ని ప్రశాంతంగా కూర్చోవాలని చెప్పేందుకు జగన్‌మోహన్‌రెడ్డికి మైకు ఇచ్చానే గానీ తిరస్కరించిన అంశంపై మాట్లాడేందుకు కాదని స్పీకర్ అన్నారు. ఈ దశలో మంత్రులు యనమల, రావెల కిశోర్‌బాబు, అచ్చెన్నాయుడు విపక్షంపై విరుచుకుపడ్డారు. ఓ పథకం ప్రకారమే వైఎస్సార్‌సీపీ సభ్యులు సభలోకి వచ్చి గొడవ చేస్తున్నారని, సస్పెండ్ కావడమో లేక బయటకు వెళ్లిపోవడమో ప్రతిపక్షం ఉద్దేశంగా ఉందని యనమల చేసిన వ్యాఖ్యకు విపక్షం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. నినాదాలు మార్మోగించింది. దీంతో స్పీకర్ సభను రెండుసార్లు వాయిదా వేశారు.