విచారణ జరిపి న్యాయం చేయండి
ఎమ్మెల్యే తాటిపై జరిగిన దాడిపై గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: అశ్వారావుపేట వైఎస్సార్‌సీపీ గిరిజన ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుపై టీడీపీ ఏలూరు ఎంపీ మాగంటి వెంకటేశ్వరరావు నేతృత్వంలోని టీడీపీ కార్యకర్తలు జరిపిన దాడిపై సమగ్ర విచారణ జరిపి, తగిన న్యాయం చేయాలని గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌కు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రజాస్వామ్య గౌరవాన్ని కాపాడేందుకు.. మళ్లీ ఇలాంటి హింసాయుత చర్యలకు పాల్పడకుండా ఉండేలా ఆంధ్రప్రదేశ్‌లోని అధికార టీడీపీకి సలహా ఇవ్వాలని కోరింది.
ఈ మేరకు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌కు వైఎస్సార్‌సీపీ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు వినతిపత్రాన్ని సమర్పించారు. వీరితోపాటు సీపీఎం ఎమ్మెల్యే రాజయ్య, వైఎస్సార్‌సీపీ నేతలు జనక్‌ప్రసాద్, నల్లా సూర్యప్రకాష్ తదితరులున్నారు. ప్రాం తీయ విభేదాలు రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందని.. హింసాయుత పద్ధతులకు దిగుతోందని వారు గవర్నర్ దృష్టికి తీసుకువచ్చారు. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కూడా వైఎస్సార్‌సీపీ బృందం కలిసింది.
గవర్నర్ న్యాయం చేస్తానన్నారు: ఎంపీ
తమ వినతిని స్వీకరించిన గవర్నర్ నరసింహన్ తాము చెప్పిన విషయాలను విన్నారని తమకు న్యాయం చేస్తారని ఎంపీ పొంగులేటి శ్రీని వాసరెడ్డి మీడియాకు తెలిపారు.