సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్ధుల ఆత్మహత్యలకు నిరసనగా వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం ఈ నెల 16న కార్పోరెట్ విద్యాసంస్థల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం పత్రికా ప్రటనను విడుదల చేసింది. గడిచిన మూడేళ్లుగా రాష్ట్రంలోని కార్పోరేట్ విద్యాసంస్థల్లో అనేక మంది విద్యార్ధినీ, విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు సలాంబాబు మండిపడ్డారు.
గడిచిన రెండేళ్లలో కేవలం శ్రీచైతన్య, నారయణ వంటి కార్పొరేట్ కాలేజీల్లోనే అధికారిక లెక్కల ప్రకారం 38 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారన్నారు. ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వం తూతూ మంత్రంగా హడావుడి చేయటం తప్ప నివారణ చర్యలు చేపట్టలేదని ఆయన ధ్వజమెత్తారు. పురపాలక శాఖా మంత్రి నారాయణ విద్యాసంస్థలైనందుకు, విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆయన వియ్యకుండైనందుకే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారయణ విద్యాసంస్థల్లో జరుగుతున్న సంఘటనలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇటీవల మంత్రి గంటా శ్రీనివాస్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనుమతి లేని 158 కాలేజీ హాస్టల్లను గుర్తించమన్నారని, అనుమతి లేకుండా కాలేజీలు నడుస్తుంటే, ఇంటర్మీడియట్ బోర్డు, ప్రభుత్వం ఏం చేస్తుందని సలాంబాబు ప్రశ్నించారు. వెంటనే మంత్రి గంటాను బర్త్‌రఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా చక్రపాణి కమిటీ సూచనలను సత్వరమే అమలు చేసి, మరిన్ని విద్యా కుసుమాలు నేలరాలకుండా కాపాడాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment