
భవిష్యత్తు జగన్‌దే
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉదయించే సూర్యుడైతే.. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అస్తమించే సూర్యుడని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత మోపిదేవి వెంకటరమణ వ్యాఖ్యానించారు. శనివారం శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో త్రిసభ్య కమిటీ సభ్యులైన బెల్లాన చంద్రశేఖర్, గుడివాడ అమర్‌నాధ్‌లతో కలిసి ఆయన మాట్లాడారు. మరో 30 నుంచి 40 ఏళ్లు రాజకీయాలను శాసించే సత్తా జగన్‌కుందని.. చంద్రబాబుకు ఆ పరిస్థితులు లేవని అందుకే ప్రజలు ఆఖరి అవకాశం ఇస్తూ తాజా ఎన్నికల్లో ఆయన్ను గెలిపించారన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఓటమికి కారణాలపై నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరిపామని, వాస్తవాలతో కూడిన నివేదికను పార్టీ అధినేత జగన్‌కు అందజేస్తామన్నారు. దీనిపై జూన్ 4, 5, 6 తే దీల్లో రాజమండ్రిలో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల అభ్యర్థులతో సమీక్షిస్తారన్నారు. రానున్న రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఎన్నికల్లో సాధ్యం కాని హామీలిచ్చి, ప్రజలను ప్రలోభాలకు గురిచేసి విజయం సాధించిన టీడీపీకి ఆ ఆనందం ఎంతో కాలం ఉండదని జోస్యం చెప్పారు. రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను మాఫీ చేస్తామన్న చంద్రబాబు వెంటనే ఆ హామీలను నెరవేర్చాలని డిమాం డ్ చేశారు.
ఏమాత్రం నెరవేర్చకపోయినా, కొర్రీలు పెట్టినా ప్రజల తరపున తమ పార్టీ పోరాడుతుందని స్పష్టం చేశారు. ప్రధాన ప్రతిపక్ష పాత్రను ప్రతిష్టాత్మకంగా భావించి పనిచేస్తామని, భవిష్యత్తులో అధికారం తమదేనని మోపిదేవి ధీమా వ్యక్తం చేశారు. త్రిసభ్య కమిటీ సభ్యుడు, విజయనగరం జెడ్పీ మాజీ చైర్మన బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికల్లో చంద్రబాబులా సాధ్యం కాని, చేయలేని హామీలను ఇవ్వనని తమ పార్టీ అధినేత జగన్ ముందే చెప్పారన్నారు. మరో సభ్యుడు గుడివాడ అమర్‌నాధ్ మాట్లాడుతూ రాష్ట్రంలో తమ పార్టీ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుందని, అధికార పార్టీ నుంచి ప్రజలకు ఏమాత్రం కష్టమొచ్చినా వారి పక్షాన పోరాడుతామని వివరించారు. సమావేశంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ నేత రెడ్డి శాంతి పాల్గొన్నారు.