
శ్రీకాళహస్తి: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కడం ఖాయమని, ఏపీలో అత్యధిక ఎంపీ స్ధానాలను కూడా ఆ పార్టీనే దక్కించుకుంటుందని శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగ వర ప్రసాదు వెల్లడించారు. వికారి నామ సంవత్సర ఉగాదిని పురష్కరించుకుని శనివారం ఆయన శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో పంచాంగ పఠనం నిర్వహించారు. అందులో భాగంగా ఈ ఏడాది జరగనున్న పలు అంశాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపడతారని చెప్పారు.
రాష్ట్రంలోని మెజారీటీ ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. కేంద్రంలోని భారతీయ జనతాపార్టీకి ఈ ఏడాది ఎదురుదెబ్బ తగలనుందని, ప్రధాని మోదీకి ఈ సంవత్సరం అంతగా కలిసిరాదని చెప్పారు. తమిళనాడులో అన్నాడీఎంకే బలమైన పార్టీగా నిరూపించుకుంటుందని, కర్ణాటకలో కాంగ్రెస్ కూటమి బలపడుతుందని చెప్పారు. అలాగే అంతర్జాతీయస్థాయిలో ట్రంప్‌కు ఎదురుగాలి, భారతీయులకు ప్రతి మూడు మాసాలకోసారి ఇబ్బందులు ఉంటాయన్నారు. ఈ పంచాంగ పఠనం కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీరామరామస్వామి, పలువురు ఆలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment