‘టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను సహించం’ | YSRCP Women Leaders Protest at Visakha TDP Office | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయం ముట్టిడికి యత్నం

Published Thu, Jan 30 2020 8:19 PM | Last Updated on Thu, Jan 30 2020 8:53 PM

YSRCP Women Leaders Protest at Visakha TDP Office - Sakshi

సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో గురువారం సర్క్యూట్‌ హౌస్‌ నుంచి కాగడాల ర్యాలీ నిర్వహించారు. వికేంద్రీకరణపై అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా టీడీపీ ఎమ్మెల్యేల దిష్టిబొమ్మలను మహిళలు దగ్ధం చేశారు. నగరానికి చెందిన నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సెవెన్‌హిల్స్‌ జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు మహిళలు ప్రయత్నించారు. వారికి పోలీసులు సర్దిచెప్పి పంపించారు.

టీడీపీ నాయకులు ఉత్తరాంధ్ర ద్రోహులుగా వ్యవహరిస్తున్నారని మహిళలు ఈ సందర్భంగా ధ్వజమెత్తారు. టీడీపీ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ, గణేశ్‌కుమార్‌ విశాఖ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. తమ ఓట్లతో గెలిచి విశాఖపట్నానికి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీ ఎమ్మెల్యేల నాటకాలను విశాఖ ప్రజలు సహించబోరని హెచ్చరించారు. పదవులను అడ్డుపెట్టుకుని డబ్బు సంపాదించుకోవాలని చూస్తున్నారు తప్పా ఓట్లు వేసి గెలిపించిన తమకు న్యాయం చేయాలన్న ఆలోచన టీడీపీ ఎమ్మెల్యేలకు లేదని ధ్వజమెత్తారు.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలైన ఉత్తరాంధ్ర ఇప్పటికి వెనుబడి ఉందన్నారు. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూస్తుంటే టీడీపీ నాయకులు అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే తప్పకుండా విశాఖ పరిపాలనా రాజధాని కావాలని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు అడ్డుపడితే ఉత్తరాంధ్ర ప్రజల ఆగ్రహావేశాలకు గురికాక తప్పదని హెచ్చరించారు. ‘పరిపాలన వికేంద్రీకరణ కావాలి. విశాఖ రాజధాని కావాలి’ అని ప్రజలంతా కోరుకుంటున్నారని తెలిపారు. (చదవండి: కార్య నిర్వాహక రాజధానిగా విశాఖ భేష్‌)

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఖాయం
విశాఖ కేంద్రంగా పరిపాలనా రాజధాని కోరుతూ పద్మనాభం మండలంలో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. రైతులతో పాటు ఎడ్లబండి ఎక్కి పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఇనాం భూముల రైతులకు రైతు భరోసా ఇచ్చిన సీఎం వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో విశాఖ కేంద్రంగా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. (చదవండి: మూడు రాజధానుల ప్రక్రియ ఆగదు)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement