మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
కె.గంగవరం (రామచంద్రపురం): స్థానిక వంతెన వద్ద కారు అదుపు తప్పి గోదావరి కాలువలో దూసుకుపోవడంతో ముదునూరి వినోద్ వర్మ(32) మృతి చెందాడు. స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఐ.పోలవరం మండల టి.కొత్తపలి గ్రామానికి చెందిన వినోద్ వర్మ కాకినాడలో ప్రముఖ ఫర్నిచర్ షాపును నిర్వహిస్తున్నాడు. వైఎస్సార్ సీపీ యువనాయకుడు కావడంతో స్థానిక ఎమ్మెల్యే పొన్నాడ సతీష్‌తో కలసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణస్వీకారానికి విజయవాడ తరలివెళ్లారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కారులో అమలాపురం వెళ్లి అక్కడి నుంచి యానాం మీదుగా ఏటిగట్టుపై రాజమహేంద్రవరం వెళుతున్న తరుణంలో అర్ధరాత్రి దాటాక ఇరుకు వంతెన వద్ద ప్రమాదవశాత్తూ కారు పల్టీకొట్టి కాలువలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వినోద్ కారులో నుంచి బయటకు రాలేక, ఊపిరాడక మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ శివగణేష్, కె.గంగవరం పోలీసులు హైట్రో సహాయంతో కారును బయటకు తీసి బంధువులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
సంఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే పొన్నాడ సతీష్
ఐ.పోలవరం (ముమ్మిడివరం): ప్రమాదం జరిగిన విషయం తెలిసిన వెంటనే సంఘటన స్థలానికి ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకుడు భూపతిరాజు సుదర్శనబాబు, మండల పార్టీ కన్వీనర్ పిన్నంరాజు వెంకటపతిరాజు, పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ కార్యదర్శి ఢీల్లీ నారాయణ, పిల్లంక శ్రీను, దంతులూరి రాఘవరాజు, పెన్మత్స వాసురాజు తదితరులు వెళ్లి పరిశీలించారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పటి వరకు తమతో ఉన్న వినోద్ మృతి చెందడం బాధాకరమని ఆయన ఆవేదన చెందారు. ఏటిగట్టు చాలా ప్రమాదకరంగా ఉందని తెలిసినా ఇక్కడ హెచ్చరిక బోర్డులు, స్పీడు బేకర్లు కూడా లేవన్నారు. దీనిపై అధికారులకు ఆదేశాలిస్తానన్నారు.రామచంద్రపురం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని టి.కొత్తపల్లి తీసుకు వచ్చారు. ఎమ్మెల్యే పొన్నాడ వినోద్ వర్మ తండ్రి సత్యనారాయణ రాజును, ముదునూరి సతీష్ రాజును పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వినోద్ మృతి పార్టీకి తీరని లోటని, మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తి ఇలా అకాల మరణం చెందడం దురదృష్టకరమని ఎమ్మెల్యే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment