దేవరపల్లిలో ఏం జరుగుతోంది?
దళితుల భూములను పరిశీలించిన వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస రెడ్డి
దేవరపల్లి: ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో దళితుల భూములను ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాస రెడ్డి శుక్రవారం పరిశీలించారు. యంత్రాలతో చెరువులు తవ్వుతున్న భూముల్లో కలియ తిరిగారు. తమ భూములు దౌర్జన్యంగా లాక్కున్నారని నాయకులు ఎదుట దళితులు గోడు వెళ్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. అన్ని రకాలుగా అండగా ఉంటామని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని బాధితులకు సుబ్బారెడ్డి, శ్రీనివాసరెడ్డి భరోసాయిచ్చారు.
పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నేతృత్వంలో స్థానిక అధికార పార్టీ నేతలు ఆ భూములను లాక్కునేందుకు పలుమార్లు ప్రయత్నించిన్నట్టు బాధితులు ఆరోపించారు. గత ఎన్నికల్లో తమకు ఓట్లేయలేదన్న అక్కసుతో 70 ఏళ్లుగా తాము సాగు చేసుకుంటున్న భూములు లాక్కునేందుకు సిద్ధమయ్యారని వాపోయారు. టీడీపీ నాయకులు 300 ఎకరాలు ఆక్రమించినా పట్టించుకోని ప్రభుత్వం పోలీసులను మొహరించి తమ భూముల్లో చెరువులు తవ్వడాన్ని తప్పుబడుతున్నారు.
కాగా, దేవరపల్లిలో దళితుల భూములను బలవంతంగా లాక్కుంటున్నారని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ డాక్టర్ రామ్‌శంకర్ కటేరియాకు ఫిర్యాదు చేశారు.