సాక్షి, హైదరాబాద్ : ప్రతిపక్ష నేత.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన హత్యయత్నం కేసు దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. ఈ మేరకు జస్టిస్ ఆకుల వెంకటశేషసాయి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. విమానాశ్రయంలో భద్రతా లోపాలవల్లే జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్ మంగళవారం ధర్మాసనం ముందు విచారణకు రానున్న నేపథ్యంలో, స్వతంత్ర సంస్థ దర్యాప్తు కోసం తన ముందు దాఖలైన వ్యాజ్యంపై బుధవారం విచారణ జరుపుతానని జడ్జి తెలిపారు.
జగన్‌పై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి ఏపీ పోలీసులు సక్రమంగా దర్యాప్తు చేయడంలేదని, అందువల్ల దర్యాప్తు బాధ్యతలను స్వతంత్ర సంస్థకు అప్పగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ సీపీ తరఫున ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై సోమవారం జస్టిస్ ఏ.వి.శేషసాయి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, జగన్‌పై హత్యాయత్నం జరిగిందని, అయితే ఈ ఘటనపై దర్యాప్తు సరైన రీతిలో సాగడంలేదన్నారు. హత్యాయత్నం జరిగిన వెంటనే నిందితుడు పబ్లిసిటీ కోసం చేశారంటూ డీజీపీ ప్రకటించారన్నారు. అయితే, రిమాండ్ రిపోర్టులో హత్యాయత్నం జరిగినట్లు పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారని వివరించారు. దీనిపై మీరేమంటారని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది డి.రమేశ్‌ను న్యాయమూర్తి ప్రశ్నించారు.
అసలు ఈ వ్యాజ్యానికి విచారణార్హతే లేదని.. కేసును మంగళవారానికి వాయిదా వేస్తే అందుకు సంబంధించిన తీర్పులన్నింటినీ కోర్టు ముందుంచుతానని తెలిపారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, వచ్చే సోమవారానికి వాయిదా వేస్తానని, ఆ రోజు తుది విచారణ జరుపుతానని చెప్పారు. ఈ సమయంలో నిరంజన్‌రెడ్డి స్పందిస్తూ, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, అందువల్ల అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, దర్యాప్తు చేస్తుంటే మంచిదే కదా.. అత్యవసరం ఏముందన్నారు. స్వతంత్ర దర్యాప్తు విషయంపై ఉన్నతాధికారులను ఎవరైనా ఆశ్రయించారా? అని ఆరా తీశారు. ఘటన జరిగిన వెంటనే డీజీపీ హత్యాయత్నం ఘటనను పబ్లిసిటీ స్టంట్‌గా తేల్చేశారని, మరి అలాంటప్పుడు తాము ఎవరిని కలిసి ఏం ప్రయోజనమని నిరంజన్‌రెడ్డి అన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి.. ఇదే అంశంపై పిల్ దాఖలైనట్లు ఉంది కదా అని అడగ్గా, ప్రభుత్వ న్యాయవాది రమేశ్ అవునని చెప్పారు. అయితే ఈ వ్యాజ్యాన్నీ పిల్‌కు జత చేస్తానని న్యాయమూర్తి ప్రతిపాదించారు. పిల్‌తో జత చేయవద్దని, మంగళవారం పిల్ విచారణకు వచ్చే అవకాశం ఉందని, దానిపై ధర్మాసనం స్పందనను బట్టి ఈ వ్యాజ్యంపై బుధవారం విచారణ జరపొచ్చని నిరంజన్‌రెడ్డి సూచించారు. ఇది మంచి ప్రతిపాదన అంటూ జడ్జి విచారణను బుధవారానికి వాయిదా వేశారు.
జగన్‌పై హత్యాయత్నం కేసు రేపటికి వాయిదా
Published Tue, Oct 30 2018 5:28 AM | Last Updated on Tue, Oct 30 2018 5:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment