
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త డ్రామా ఆడుతున్నారని ఆయన ఢిల్లీ పర్యటన ‘సేవ్ డెమోక్రసీ’ గురించి కాదని, అది సేవ్ చంద్రబాబు పర్యటన అని వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించిన నవంబర్ 1నే చంద్రబాబు ఢిల్లీలో రాష్ట్రాన్ని ముక్కలు చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిశారని, ఇంత కంటే ఘోరం మరొకటి ఉంటుందా? అని విమర్శించారు.
23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. చంద్రబాబు పచ్చి అవకాశవాది అని ఎవరితో అవసరం పడితో వారితో పొత్తు పెట్టుకోవడం ఆయనకు అలవాటు అని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కేసు తన మెడకు చుట్టుకుంటుందేమోనన్న భయంతో రెండు సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగారన్నారు.
ప్రకాశం జిల్లా కరవు కనపడలేదా?
ప్రకాశం జిల్లాలో వెలుగులు నింపుతానని చంద్రబాబు హామీలిచ్చి ప్రజలను మళ్లీ మోసగించే ప్రయత్నం చేస్తున్నారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిత్యం కరవుతో అల్లాడే ప్రకాశంలో వెలుగులు నింపేందుకే 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెలిగొండ ప్రాజెక్టును చేపట్టి 60 శాతం పనులు పూర్తి చేశారని కానీ చంద్రబాబు నాలుగేళ్లలో మిగిలి పోయిన 40 శాతం పనులను పూర్తి చేయలేక పోయారని వివరించారు. వాస్తవం ఇలా ఉంటే వచ్చే ఫిబ్రవరిలో నీళ్లిస్తామని చంద్రబాబు ఒంగోలు పర్యటనలో ప్రకటించడం విడ్డూరమన్నారు.
వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2020లో ఈ ప్రాజెక్టు పూర్తవుతుందన్నారు. కృష్ణపట్నం పోర్టు యాజమాన్యంతో లాలూచీ పడే రామాయపట్నం పోర్టు ప్రతిపాదనను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకూ పంపలేదని అన్నారు. మూడేళ్ల క్రితమే కేంద్రం కనిగిరి వద్ద నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ జోన్‌ను మం జూరు చేస్తే ఇప్పటి వరకూ భూసేకరణ పూర్తి కాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఎవరితోనూ పొత్తులుండవని ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా ఎవరిస్తారో వారికే మద్దతు ఇస్తామని తెలిపారు.