మీడియాతో మాట్లాడుతున్న మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి ముమ్మాటికీ హత్యాయత్నమేనని పార్టీ సీనియర్‌నేత, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. ఈ దాడికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, రచన అన్నీ ..చంద్రబాబేనని విమర్శించారు. ఆపరేషన్ గరుడ ఓ డ్రామా అన్నారు. శుక్రవారం హైదరాబాద్ ఎమ్మెల్యే కాలనీలోని న్యూరోసిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ జగన్‌ను పరామర్శించిన అనంతరం మీడియాతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్‌పై నిన్న జరిగిన దాడిపై ఏపీ ప్రభుత్వం స్పందిస్తున్న తీరు ఆశ్చర్యంగానూ, అభ్యంతరకరంగానూ ఉందన్నారు.
పోలీసుల సహకారం లేకుండా సాధ్యమా..
వీఐపీ లాంజ్‌లో ప్రతిపక్ష నేతపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడంటే..పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పోలీసుల కళ్లుగప్పి ఆ వ్యక్తి ఎలా లోపలికి వస్తారని ప్రశ్నించారు. ఏయిర్ పోర్టులో ఉన్న క్యాంటీన్ టీడీపీ నాయకుడిదని వైవీ గుర్తు చేశారు. దుండగుడు శ్రీనివాసరావు వైఎస్సార్ సీపీ కార్యకర్త అని ఫ్లెక్సీలు విడుదల చేస్తున్నారని, వాళ్ల కార్యకర్తే చేశారని, చిన్న ఘటన అని విచారణను తప్పుదోవ పట్టించేందుకు డీజీపీతో చెప్పించారన్నారు.
ఎల్లో ఫ్లెక్సీలు ఎక్కడా పెట్టలేదు..
తమ పార్టీ కార్యకర్తలెవరూ ఇంతవరకు ఎల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయలేదని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. వైఎస్సార్ ఫొటో లేకుండా ఫ్లెక్సీ ఉండదన్నారు. ఆ ఫ్లెక్సీలో గద్ద ఫొటో ఉందని, దీన్ని బట్టి చూస్తే టీడీపీ నేతలే తయారు చేశారన్నారు.
జగన్‌ని హత్య చేయాలని ప్రయత్నించారు..
జగన్ మెడకు గురిపెట్టి హత్యచేయాలని ప్రయత్నించారని, త్రుటిలో తప్పించుకున్నారని సుబ్బారెడ్డి చెప్పారు. ఇలాంటి ఘటన జరిగితే అక్కడ ప్రాథమిక చికిత్సకు మాత్రమే అవకాశం ఉందన్నారు. ఎయిర్ పోర్టు లాంజ్‌లోనే అంగీ తొలగించి, కాటన్‌తో కట్టు కట్టించుకుని, టీటీ ఇంజక్షన్ వేయించుకుని హైదరాబాద్‌కు వచ్చారన్నారు. ఆ కత్తికి కెమికల్ రియాక్షన్ ఉంటుందనే అనుమానంతోనే హైదరాబాద్‌లో మెరుగైన చికిత్స తీసుకునేందుకు నేరుగా ఎయిర్ పోర్టు నుంచి ఆస్పత్రికి వచ్చారన్నారు. అక్కడ వెంటనే సర్జరీ చేశారని తెలిపారు. ఈ కేసులో చంద్రబాబు ఏ1 ముద్దాయి, డీజీపీ ఏ2.. కాబట్టి థర్డ్ పార్టీ విచారణ జరిపి నిజాన్ని నిగ్గు తేల్చాలని కోర్టును ఆశ్రయించబోతున్నామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment