అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి  | YV Subba Reddy Says 50 Assets Are Worthless Assets Of TTD In Chittoor District | Sakshi
Sakshi News home page

అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి 

Published Sun, May 24 2020 8:33 AM | Last Updated on Sun, May 24 2020 8:58 AM

YV Subba Reddy Says 50 Assets Are Worthless Assets Of TTD In Chittoor District - Sakshi

సాక్షి, తిరుపతి: టీటీడీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలలో బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించిన 50 ఆస్తులు దేవస్థానానికి ఏమాత్రం ఉపయోగపడనివేనని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. కొన్ని టీవీ చానళ్లు ఈ విషయానికి సంబంధించి అవాస్తవాలు చెబుతున్నాయన్నారు. జీఓ ఎంఎస్‌ నం.311 రెవెన్యూ (ఎండోమెంట్స్‌ –1), తేదీ 09–04 –1990 రూల్‌–165, చాప్టర్‌ – 22, ద్వారా టీటీడీకి మేలు కలిగే అవకాశం ఉంటే దేవస్థానం ఆస్తులను విక్రయించడం, లీజుకు ఇవ్వడం లాంటి అధికారాలు టీటీడీ బోర్డుకే ఉన్నాయన్నారు. బోర్డు నిర్ణయాలకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపారు.  (సొంతూళ్లకు వలస కార్మికులు)

దేవస్థానం నిరర్ధక ఆస్తుల అమ్మక ప్రక్రియ 1974 నుంచి జరుగుతోందన్నారు. 2014 వర కు 129 ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించారని గుర్తుచేశారు. చదలవాడ కృష్ణమూర్తి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో పాలకమండలి తీర్మానం నం. 84, తేదీ 28–07–2015 మేరకు టీటీడీకి ఉపయోగపడని ఆస్తులను గుర్తించి బహిరంగ వేలం ద్వారా వాటిని విక్రయించడానికి గల అవకాశాలను పరిశీలించడానికి ఒక సబ్‌ కమిటీని నియమించిందన్నారు. ఇందులో అప్పటి పాలక మండలి సభ్యులు జి.భానుప్రకా‹Ùరెడ్డి, జె.శేఖర్, డి.పి.అనంత, ఎల్లా సుచరిత, సండ్ర వెంకట వీరయ్యను సభ్యులుగా నియమించారని తెలిపారు. (తగ్గుతున్న వెరీ యాక్టివ్‌ క్లస్టర్లు)

ఆ కమిటీ నివేదిక మేరకు, తీర్మానం నెం.253, తేదీ 30–01–2016 ద్వారా సబ్‌ కమిటీ గుర్తించిన 50 నిరర్ధక ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన పాలక మండలి ఆమోదం తెలిపిందన్నారు.  ఈ తీర్మానం మేరకు దేవస్థానం సిబ్బంది ఆంధ్రప్రదేశ్‌లోని గ్రామీణ ప్రాంతాల్లోని 17 ఆస్తులు, పట్టణ ప్రాంతాల్లోని 9 ఆస్తులు, తమిళనాడు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న 23 ఆస్తులకు సంబంధించి సబ్‌రిజిస్టార్‌ కార్యాలయాల రికార్డుల్లోని విలువ, బహిరంగ మార్కెట్‌ విలువలను సేకరించి పాలకమండలికి నివేదించారని పేర్కొన్నారు.

ఒక ఆస్తికి సంబంధించి కోర్టు కేసు ఉండడంతో వేలం ప్రక్రియ నుంచి మినహాయించినట్లు తెలిపారు. రుషికేష్‌లో ఎకరా 20 సెంట్ల భూమి వల్ల టీటీడీకి ఎలాంటి ఉపయోగం లేకుండా దురాక్రమణకు గురయ్యే ప్రమాదం ఉండడంతో దీన్ని కూడా వేలం జాబితాలో చేర్చారన్నారు. 50 నిరర్ధక ఆస్తుల విలువను రూ.23.92 కోట్లుగా ప్రస్తుత పాలక మండలి తీర్మానం నం.309 తేదీ 29–02 – 2020 ద్వారా ధర నిర్ణయిస్తూ గత పాలక మండలి నిర్ణయాలను అమలు చేయడానికి ఆమోదం మాత్రమే తెలిపామన్నారు. ఇందులో 1 నుంచి 5 సెంట్ల లోపు ఉన్న ఖాళీ ఇంటి స్థలాలు, 10 సెంట్ల నుంచి ఎకరం లోపు విస్తీర్ణం ఉన్న వ్యవసాయ భూములుగా ఉన్నాయని, వీటి వల్ల దేవస్థానానికి ఎలాంటి ఆదాయం లేక పోగా, ఆక్రమణలకు గురయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ ఆస్తులను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి నిర్ణయించామన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement