వైఎస్సార్ సీపీ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశానికి ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌కు నివాళులు అర్పిస్తున్న వైవీ సుబ్బారెడ్డి
పశ్చిమగోదావరి, కాళ్ల: సీబీఐ జోక్యం చేసుకుంటే టీడీపీ ప్రభుత్వం హత్యా రాజకీయాలు, కుంభకోణాలు బయటపడతాయనే భయంతో సీబీఐ జోక్యాన్ని అడ్డుకునేందుకు చట్టం తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్సిస్తోందని వైఎస్సార్ సీపీ ఉభయ గోదావరి జిల్లాల ప్రాంతీయ సమన్వయకర్త, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీ ఉండి నియోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ల సమావేశం నియోజకవర్గ కన్వీనర్ పీవీఎల్ నర్సింహరాజు అధ్యక్షతన పెదఅమిరంలో శుక్రవారం నిర్వహించారు. సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశంలో ఒక భాగమైన ఆంధ్ర రాష్ట్రానికి సీబీఐ రాకుండా చట్టం ఎలా చేస్తారని ప్రశ్నించారు. సీబీఐ విచారణ చేస్తే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నంలో నిజాలు బయటపడతాయనే భయంతో ఆ విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్‌పై హత్యాయత్నంలో వారి హస్తం ఉందనటానికి ఇంతకన్నా నిదర్శనమేంటన్నారు.
ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు కూడా చేస్తారా!
దెందులూరు ఎమ్మెల్యే మట్టి దందా చేస్తున్నారని ఫిర్యాదు చేసిన వైఎస్సార్ సీపీ నాయకుడిపై హత్యాయత్నం చేయటంపై ఎమ్మెల్యేలు ఇటువంటి పనులు కూడా చేస్తారా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇది రౌడీ రాజ్యమో.. దోపిడీ రాజ్యమో.. ఖూనీకోరు రాజ్యమో ప్రజలే అర్ధం చేసుకోవాలన్నారు. వైఎస్సార్ సీపీ బలపడుతోందన్న దుగ్ధతో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు అండగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని సుబ్బారెడ్డి భరోసా ఇచ్చారు. చంద్రబాబు వైఎస్సార్‌సీపీ నాయకులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. పార్టీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీ కంతేటి సత్యనారాయణరాజు, మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, గాదిరాజు సుబ్బరాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు మంతెన యోగీంద్రకుమార్‌లు పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై బూత్ కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో పార్టీ కాళ్ల, ఆకివీడు, ఉండి, పాలకోడేరు మండలాల కన్వీనర్లు యిర్రింకి వీర్రాఘవులు, గుండా సుందరరామనాయుడు, గులిపల్లి అచ్చారావు, వెంకట్రాజుతోపాటు కొండేటి శివకుమార్, సుంకర భోగేశ్వరరావు, మేకా పార్వతి, మోరా జ్యోతి, కాటిక శ్రీదేవి, గణేశ్న రాంబాబు, షేక్ హుస్సేన్, నంద్యాల సీతారామయ్య, కేశిరెడ్డి మురళి, సునీల్ రాజు, బడుగు బాలాజి, పెన్మెత్స ప్రసాదరాజు, చిక్కాల జగదీష్, ఖండవల్లి వాసు, బీవీఆర్ చౌదరి, గంటా ఆనందరావు, రుద్రరాజు వెంకట్రామకృష్ణంరాజు, వేగేశ్న విజయరామరాజు, మన్నే నాగరాజు, వేగేశ్న జయరామకృష్ణంరాజు, తోటకూర చిన్నా, కట్రెడ్డి సీతారామయ్య, పుప్పాల పండు పాల్గొన్నారు.
టీడీపీ హత్యా రాజకీయాలు, అవినీతిని ప్రజలకు తెలియజెప్పండి
టీడీపీ ప్రభుత్వ హత్యా రాజకీయాలు, అవినీతి కుంభకోణాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బూత్ కన్వీనర్లు, సభ్యులపై ఉందని సుబ్బారెడ్డి అన్నారు. ఏడాది నుంచి ప్రజల్లో ఉంటూ ప్రభుత్వం వల్ల ఇబ్బందులు పడుతున్న, సంక్షేమ పథకాలు అందక బాధపడుతున్న వారికి జగన్‌మోహన్‌రెడ్డి భరోసా కల్పిస్తున్నారన్నారు. ప్రజా సంకల్పయాత్రకు వస్తున్న జనాదరణ చూసి టీడీపీకి వణుకు పుట్టిందని, దుర్మార్గంతో జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యా యత్నం చేయడానికి కూడా వెనుకాడలేదన్నారు. హత్యాయత్నంపై విచారణను నీరు గార్చేందుకు ఇది చిన్న విషయం అన్నట్టు ఒక ముఖ్యమంత్రి, డీజీపీ మాట్లడటం ప్రజాస్వామ్యానికి పట్టిన దురదృష్టమన్నారు. టీడీపీ వారు చేస్తున్న దోపిడీలు, అన్యాయాలు సీబీఐ విచారణలో బయటపడితే, వారిని పెట్టేందుకు జైళ్లు కూడా సరిపోవన్నారు. ప్రభుత్వ పథకాలను అడ్డుపెట్టుకుని టీడీపీ చోటా బడా నాయకులు, ఎమ్మెల్యే నుంచి మంత్రుల వరకూ దోచుకుతింటున్నారని పేర్కొన్నారు. ఓటర్లను కలిసి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తెలియచేయాలన్నారు. నేటి నుంచి ఓటింగ్ పూర్తయ్యే వరకూ ప్రతి బూత్ కన్వీనర్, మెంబర్లు కష్టపడి పనిచేసి బూత్ లెవెల్లో ప్రతి కుటుంబంతో మమేకమై ఉండాలన్నారు. నవరత్న పథకాలు కుటుంబానికి ఏ విధంగా ఉపయోగపడతాయో తెలియజేయాలన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రజలను ప్రలోభపెట్టడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని, అవసరమైతే డబ్బుతో కొనడానికి వెనుకాడదన్నారు. దోచుకున్న డబ్బుతో ప్రజలను ప్రలోభ పెట్టాలని చూస్తున్న నాయకులను ఎవరూ నమ్మొద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment