జహీరాబాద్, న్యూస్‌లైన్: జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోగల వరద కాలువలను కబ్జాదారులు దర్జాగా మింగేశారు. దీంతో వరద నీరంతా ముందుకెళ్లకుండా ఎక్కడికక్కడే స్తంభించడంతో పరిసర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతున్నారు. కబ్జాదారులు మాత్రం కాసులు రాల్చుకుంటున్నారు. వరదనీరు రోడ్లపైనే నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చోద్యం చూస్తోంది. వరద కాలువలను ఇష్టానుసారంగా ఆక్రమించుకుని కట్టడాలు కొనసాగితున్నారు. ఇప్పటికే దాదాపుగా కాలువలు కబ్జాలకు గురయ్యాయి. దీంతో వర్షం కురిస్తే వరద నీరు ఎక్కడికక్కడే నిలిచిపోతోంది.
ఫలితంగా పరిసర ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. జహీరాబాద్‌తో పాటు, పట్టణంలో కలిసిపోయిన అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఈ పరిస్థితి నెలకొంది. మున్సిపల్ పరిధిలో సుమారు 3 కిలో మీటర్ల మేర వరద కాలువలున్నాయి. పట్టణ పరిధిలో ఉన్న కాలువలు మాత్రం ఆక్రమణలకు గురయ్యాయి. వరద కాలువలు చిన్న మురికి కాలువల మాదిరిగా రూపాంతరం చెందాయి. జహీరాబాద్‌లోని ఆర్యనగర్, బాగారెడ్డిపల్లి, రాచన్నపేట, ఎన్‌జీఓ కాలనీ, అల్లీపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని ఎస్‌బీహెచ్ కాలనీ, మూసానగర్ కాలనీలలో వరద కాలువలు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయి.
జహీరాబాద్ పట్టణం-అల్లీపూర్ గ్రామం మధ్యన గల పెద్దవాగు కబ్జాలకు గురైంది. మూసానగర్ నుంచి ఎన్జీఓ కాలనీ వరకు చిన్న కాలువగా మారింది. ఎన్జీఓ కాలనీ నుంచి ఎస్‌బీహెచ్ కాలనీ వరకు వాగు పూర్తిగా కబ్జాకు గురైంది. రైల్వే ట్రాక్ వైపు నుంచి గడిమహెలా వెళ్లే వరద కాలువపై అక్రమ కట్టడాలు వెలియడంతో కాలువ ఆనవాళ్లే లేకుండా పోయింది. వరద నీరు వెళ్లేందుకు జాతీయ రహదారిపై నిర్మించిన బ్రిడ్జిని పూర్తిగా మూసివేసి దిగువ ప్రాంతంలో ఆక్రమణదారులు ఇళ్లను నిర్మించుకున్నారు. దీంతో వరద నీరంతా 9వ జాతీయ రహదారిపైనే స్తంభించి రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇప్పటికీ పలు నిర్మాణాలు జరుగుతున్నా ఇటు మున్సిపల్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోక పోవడంతో ఆక్రమణదారులకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని పలువురు విమర్శిస్తున్నారు.
మురికి నీరంతా రోడ్లపైనే..
వరద కాలువలు పూర్తిగా కుదించుకుపోవడంతో వర్షాకాలంలో వరద నీరంతా రోడ్లపైనే ప్రవహిస్తోంది. వర్షం కురవకున్నా మురికి నీరు సైతం రోడ్లపైకి చేరుతోంది. మురికి నీరు రోడ్లపైనే ప్రవహిస్తుండటంతో పాద చారులు, విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పరిసర ప్రాంతాలలో నివాసం ఉండే ప్రజలు రోగాల పాలవుతున్నారు.
మురికి తొలగించడం కూడా ఇబ్బందే
కుదించుకుపోయిన కాలువల్లో మురికిని కూడా బయటకు తీయలేని పరిస్థితి. కాలువకు ఇరువైపులా అక్రమ కట్టడాలు చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఇళ్ల మధ్యలో దారిని వదలకపోవడంతో మురికిని తొలగించే అవకాశం లేకుండా పోయింది. రెవెన్యూ మ్యాప్ ఆధారంగా సర్వే చేపట్టి అక్రమ కట్టడాలను తొలగిస్తే తప్ప వరద నీటి సమస్య శాశ్వతంగా తీరే అవకాశం లేదని పట్టణ ప్రజలు పేర్కొంటున్నారు. ఈ విషయంలో కలెక్టర్ స్పందిస్తే తప్ప తమ సమస్యలు తీరే పరిస్థితి కనిపించడం లేదని ఆయా కాలనీల్లో నివాసం ఉంటున్న ప్రజలు అంటున్నారు. ఇదిలా ఉండగా ఎన్జీఓ కాలనీ నుంచి టౌన్ చర్చికి వెళ్లే రోడ్డుపై రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. కాల్వలో మురికి నీరు ఎక్కడికక్కడే నిలిచి పోయింది. దీంతో ఆయా ప్రాంతాలకు వెళ్లే దారి రాకపోకలు సాగించేందుకు వీలు లేకుండా మారింది.
వరద.. రోత!
Published Mon, Oct 28 2013 12:34 AM | Last Updated on Tue, Oct 16 2018 6:27 PM
Advertisement
Advertisement