వెంకట్రామిరెడ్డి, పుల్లమ్మ మృతదేహాలు
మధిర : క్షణికావేశంలో భార్యాభర్తలు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నారు. ఇది, గురువారం రాత్రి వంగవీడు గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. వంగవీడు గ్రామస్తులైన ఓబుల వెంకట్రామిరెడ్డి(50)–పుల్లమ్మ(45) దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు చెన్నారెడ్డికి వివాహమైది. తల్లిదండ్రులతోపాటు ఉంటూ వ్యవసాయం చేస్తున్నాడు. చిన్న కుమారుడు వెంకటేశ్వరరెడ్డి, హైదరాబాద్‌లో చదువుకుంటున్నాడు. రైతు వెంకట్రామిరెడ్డిది మధ్యతరగతి కుటుంబం. ఎల్లమ్మ దేవతకు ఈ వారం మొక్కు చెల్లించాలని వెంకట్రామిరెడ్డి దంపతులు అన్నారు. మరోవారం చేద్దామని కొడుకు, కోడలు చెప్పారు. ఈ విషయమై వారి మధ్య ఏం జరిగిందో ఏమో..! గురువారం రాత్రి కుమారుడు, కోడలు ఇంట్లో పడుకున్నారు.
వరండాలోని మంచాలపై వెంకట్రామిరెడ్డి, పుల్లమ్మ దంపతులు పడుకున్నారు. వీరు రోజూ తెల్లవారుజామునే నిద్ర లేస్తారు. ఉదయం తలుపులు తెరిచిన చెన్నారెడ్డికి, తల్లిదండ్రులు నిద్ర నుంచి ఇంకా లేవకపోవడం, కొట్టంలోగల విషపు గుళికల వాసన ఇక్కడి వరకు రావడంతో అనుమానం వచ్చింది. తల్లిదండ్రులను ఎంత లేపినా లేవలేదు. అప్పటికే వారు మృతిచెందారు. ‘‘ఎంత పని చేశారు’’ అంటూ ఆ కొడుకు భోరున విలపించాడు. గ్రామస్తులంతా వచ్చారు. ‘‘వీరికి ఆర్థిక బాధలు కూడా లేవు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడేవారు కాదు’’ అని, గ్రామస్తులు చర్చించుకున్నారు. మధిర రూరల్ ఎస్‌ఐ బండారి కిషోర్, పంచనామా నిర్వహించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం మధిర ప్రభుత్వ సివిల్ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment