న్యూఢిల్లీ: తరచుగా జరిపే చెల్లింపులను ఆటోమేటిక్‌గా పూర్తి చేసేందుకు తోడ్పడేలా ఏకీకృత చెల్లింపుల విధానం (యూపీఐ)లో ఆటోపే ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) తెలిపింది. మొబైల్ బిల్లులు, కరెంటు బిల్లులు, నెలవారీ కట్టాల్సిన వాయిదాలు, బీమా ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్స్ చందాలు మొదలైన వాటన్నింటికీ ఈ విధానంలో ఆటోమేటిక్‌గా చెల్లింపులు జరపవచ్చు. ఆటోపేలో రూ. 2,000 దాకా పరిమితి ఉంటుంది. అంతకు మించిన లావాదేవీకి యూపీఐ పిన్ తప్పనిసరి.
యూపీఐ ఆధారిత యాప్స్ అన్నింటిలోనూ ’మ్యాన్‌డేట్’ అనే సెక్షన్ ఉంటుందని, ఇందులో ఆటో డెబిట్ ఆదేశాలను పొందుపర్చవచ్చని ఎన్‌పీసీఐ తెలిపింది. నిర్దేశిత రోజున చెల్లింపులు ఆటోమేటిక్‌గా జరిగిపోతాయి కాబట్టి ఇటు వ్యక్తులకు, అటు వ్యాపార సంస్థలకు ఇది ఉపయోగకరంగా ఉంటుందని వివరించింది. ఇప్పటికే ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా మొదలైన వాటిల్లో ఇది అందుబాటులో ఉందని పేర్కొంది. త్వరలో ఎస్‌బీఐ, జియో పేమెంట్స్ బ్యాంక్, యస్ బ్యాంక్‌లు కూడా ఇది ప్రవేశపెడుతున్నాయని ఎన్‌పీసీఐ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment