ఆశల పల్లకిలో..! | 2014 Business Roundup | Sakshi
Sakshi News home page

ఆశల పల్లకిలో..!

Published Fri, Dec 26 2014 12:36 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఆశల పల్లకిలో..! - Sakshi

ఆశల పల్లకిలో..!

ఎన్నో ఆశలు.. మరెన్నో కీలక సంఘటనలతో వ్యాపార రంగంలో యాక్షన్ థ్రిల్లర్‌ను తలపించిన 2014 సంవత్సరం కనుమరుగవుతోంది. దేశంలో మోదీ నేతృత్వంలో ఏర్పాటైన కొత్త సర్కారు సంస్కరణల బాట పట్టడం.. స్టాక్ మార్కెట్లు ఆకాశమే హద్దుగా సరికొత్త రికార్డులతో దూసుకుపోవడంతో ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా అమెరికా రికవరీ జోరు... చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా మనకు చేదోడుగా నిలుస్తోంది.

ఏడాది ఆరంభంలో ఉక్కిరిబిక్కిరి చేసిన ధరలు.. చివరికొచ్చేసరికి శాంతించడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి. ఇదిలాఉంటే... తెలుగు బిడ్డ సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్‌కు సీఈఓగా పగ్గాలు చేపట్టి భారతీయుల సత్తాను చాటారు. ఈ-కామర్స్ రంగం జోష్ అత్యంత కీలక పరిణామం. ఏడాది పొడవునా బిజీబిజీగా గడిచిన పరిణామాల సమాహారమే ఈ బిజినెస్ రివైండ్..
 
12 నెలలు.. 6,000 పాయింట్లు
ఐదేళ్ల తర్వాత సెన్సెక్స్ అద్భుత ర్యాలీ..

ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్ముదులిపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ మార్కెట్ల ప్రామాణిక సూచీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్టమైన 28,882ను తాకింది. దీంతో డిసెంబర్ 3న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ. 100 లక్షల కోట్లను (ట్రిలియన్లు) అధిగమించింది. ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకోవడం విశేషం.

మోదీ అధ్యక్షతన కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడం, ఊపందుకున్న సంస్కరణలు వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) పెట్టుబడులను కుమ్మరించడం మార్కెట్ల జోరుకు దోహదపడింది. ఈ ఏడాది జనవరి మొదలు డిసెంబర్19 వరకూ దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి ప్రవహించిన విదేశీ పెట్టుబడులు రూ. 2.6 లక్షల కోట్లను(42.6 బిలియన్ డాలర్లు) తాకాయి.

కాగా, ఈ ఏడాది పెట్టుబడులకు సంబంధించి ఎఫ్‌పీఐలు ఈక్విటీలకు రూ. 99,450 కోట్లు(16.5 బిలియన్ డాలర్లు), బాండ్లకు రూ. 1.59 లక్షల కోట్లు (26.2 బిలియన్ డాలర్లు) చొప్పున కేటాయించారు. ఈల్డ్స్ ఆకర్షణీయంగా ఉండటంతో బాండ్లకు అత్యధిక శాతం పెట్టుబడులను ఎఫ్‌పీఐలు కేటాయిస్తూ వస్తున్నారు. అమెరికాసహా, కొన్ని విదేశీ స్టాక్ సూచీలు కొత్త గరిష్టాలతో దూసుకెళ్తున్నాయి. ఇది కూడా దేశీ స్టాక్ మార్కెట్లో సెంటిమెంట్‌కు బలాన్నిస్తోంది.  
 
విదేశాల్లో మనోళ్ల సత్తా..
మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా ఎదిగిన సత్య నాదెళ్ల ఇందులో ప్రముఖులు. మరొకరు ఫిన్లాంగ్ సంస్థ  నోకియా కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా భారతీయుడు 46 సంవత్సరాల  రాజన్ సూరీ బాధ్యతల స్వీకారం. బ్రిటన్ అగ్రశ్రేణి బ్యాంక్ శాంటడర్ యూకే చైర్మన్‌గా భారత్ సంతతికి చెందిన మహిళ శ్రుతి వదేరా నియామకం... ఏడీబీ పాలనా ట్రిబ్యునల్ అధ్యక్షురాలిగా తొలి భారతీయురాలు... లక్ష్మీ స్వామినాథన్‌లను సైతం ఈ జాబితాలో పేర్కొనవచ్చు.  భారత్ సంతతికి చెందిన వ్యక్తి  సునీల్ సబర్వాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం... ఐఎంఎఫ్‌లో ప్రత్యామ్నాయ ఈడీగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆయనను నామినేట్ చేయడం కూడా ఈ ఏడాది ముఖ్యాంశాలు.
 
‘చమురు’ వరం...
భారత్ ఆర్థిక వ్యవస్థకు జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం ఒక సానుకూల అంశంగా మారింది. జూన్‌లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. ఏడాది ముగిసే నాటికి తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలకు కనిష్ట స్థాయి ఏమిటి? ఎప్పుడు స్థిరత్వం పొందుతాయి? వంటి అంశాలపై పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది.
 
ఇన్ఫోసిస్‌కు కొత్త సారథి...
ఈ ఏడాది దేశ వ్యాప్తంగా ప్రధానంగా వార్తల్లోకి వచ్చిన సంస్థగా ఇన్పోసిస్‌ను పేర్కొనవచ్చు. దాదాపు 13 మంది అత్యున్నత స్థాయి ఉద్యోగుల వలసలు... ఇన్పోసిస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా నారాయణ మూర్తి రెండవసారి వైదొలగడం... తర్వాత సంస్థ సీఈఓగా తొలిసారి బయటి వ్యక్తి 47 ఏళ్ల విశాల్ సిక్కా ఆగస్టు నుంచి సంస్థ పగ్గాలు చేపట్టడం జరిగాయి. కంపెనీ ప్రమోటర్లు దాదాపు రూ. 6,000 కోట్ల షేర్ల అమ్మకాలు జరపడం కూడా విశేషమే.
 
ఈ-కామర్స్ హుషారు..
దేశంలో ఈ-కామర్స్ విజృంభన 2014లో ముఖ్యాంశాల్లో ఒకటి. చైనా దిగ్గజ సంస్థ అలీబాబాసహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్‌కు క్యూ కట్టారు. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని హామీ ఇచ్చారు. దీంతో భారీగా ఉద్యోగాలు రానున్నాయి. ఈ విభాగం వల్ల తమ అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నాయని రిటైల్ సంస్థలు ఆందోళన చేసే స్థాయికి పరిస్థితి వెళ్లింది. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్ల ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం.
 
టేకాఫ్.. ల్యాండింగ్!
గత ఏడాది కింగ్‌ఫిషర్ కష్టాల్లో కూరుకుపోతే, ఈ ఏడాది స్పైస్‌జెట్ ఇదే బాటపట్టింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు  సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి. ఇక టాటా ప్రమోటెడ్ సంస్థలు ఎయిరేషియా సేవలు ప్రారం భం, వచ్చే ఏడాది విస్తార సేవలకు శ్రీకారం ఈ రంగంలో ముఖ్యాంశాలు.
 
మొండి బకాయిల దెబ్బ
బ్యాంకుల మొండిబకాయిల ఆందోళన తీవ్రంగా పెరిగిన ఏడాదిగా దీనిని భావించవచ్చు. గత ఆర్థిక సంవత్సరం మొత్తంలో బ్యాంకింగ్ రంగంలో నమోదైన రూ. 2.40 లక్షల కోట్ల ఎన్‌పీఏల్లో 90 శాతం (రూ. 2.14 లక్షల కోట్లు) ఎన్‌పీఏలు ప్రభుత్వ బ్యాంకులవే. మరోవైపు  వేల కోట్ల రూపాయలు రుణాలను ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్ ప్రమోటర్లకు సంబంధించి బ్యాంకులు ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారులుగా ప్రకటించడం కీలకం.
 
కార్పొరేట్ అరెస్టులు...

2014 కార్పొరేట్ రంగంలో ముగ్గురు ప్రముఖ వ్యక్తుల అరెస్టులను ప్రధానంగా చెప్పుకోవచ్చు. నిబంధనలకు విరుద్ధంగా రెండు గ్రూప్ కంపెనీలు దాదాపు 24,000 కోట్ల నిధుల సమీకరణ... తిరిగి చెల్లించడంలో వైఫల్యం కేసులో సహారా చీఫ్ సుబ్రతారాయ్ జైలుకెళ్లారు.  ఇక నేషనల్ స్పాట్ ఎక్స్ఛేంజ్ ఇన్వెస్టర్లకు దాదాపు రూ.6,000 కోట్ల చెల్లింపుల వైఫల్యం కేసులో ఆ సంస్థ వ్యవస్థాపకుడు జిగ్నేష్ షా అరెస్ట్ సంచలనాన్ని సృష్టించింది. ఇక భారతీయ సంతతికి చెందిన గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డెరైక్టర్ రజత్ గుప్తా ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రుజువుకావడంతో జైలుపాలు కావడం మరో కీలక పరిణామం.
 
ఆర్థిక రికవరీ..
గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటును నమోదుచేసుకున్న దేశం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చింది. అయితే రెండవ త్రైమాసికంలోనే 5.3 శాతం వృద్ధిలోకి జారిపోవడం కొంత నిరుత్సాహాన్ని ఇచ్చింది. అయితే ఆర్థిక సంవత్సరం మొత్తంలో 5.5 శాతం వృద్ధి రేటు తగ్గదని ప్రభుత్వం, ఆర్‌బీఐసహా పలు విశ్లేషణా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. ఎస్‌అండ్‌పీ సైతం భారత్ రేటింగ్‌ను పెంచడం కొంత సానుకూలంగా మారింది. మొత్తంగా మోదీ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించడం, సంస్కరణలపై సత్వర నిర్ణయాలతో మొత్తం ఆర్థిక వ్యవస్థ రికవరీ బాట పడుతున్న సంకేతాలు కనబడుతున్నాయి.
 
ధరలు.. రేట్లు...
గత రెండుమూడేళ్లగా ధరల పెరుగుదల రేటు తీవ్ర ఆందోళన కలిగించినప్పటికీ, ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఇది ఆర్‌బీఐ నిర్దేశిత లక్ష్యంకన్నా తక్కువకు దిగిరావడం పాలక, పారిశ్రామిక, ఆర్థిక వర్గాల్లో సంతోషాన్ని నింపింది. నవంబర్‌లో టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం రేటు ‘0’గా నమోదుకాగా, రిటైల్ ధరల ఆధారిత ద్రవ్యోల్బణం రేటు 4.4 శాతంగా ఉంది. రెండవ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 5.3 శాతం కావడం, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు క్షీణత-స్వల్ప వృద్ధి రేటు మధ్య తిరుగుతున్న నేపథ్యం.. వంటి అంశాల నేపథ్యంలో ద్రవ్యోల్బణం దిగువస్థాయిలో ఉన్న అంశాన్ని పరిగణనలోకి తీసుకుని వడ్డీరేట్లను తగ్గించాలని పరిశ్రమల వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.

అయితే ఈ విషయంలో ఆర్‌బీఐ చీఫ్ రఘురామ రాజన్ తన కఠిన విధానాన్ని సడలించకపోవడం కొంత విమర్శలకు కారణమయ్యింది.  అయితే, 2015 మొదటి రెండు, మూడు నెలల్లో వడ్డీరేట్ల తగ్గింపు నిర్ణయం ఉండొచ్చని భావిస్తున్నారు.  కాగా రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానాన్ని... పావురాళ్లు, గుడ్లగూబలతో పోల్చుతూ పాలసీ విధానం సందర్భంగా గవర్నర్ రాజన్ వద్ద ఆసక్తికరమైన చర్చ జరగడం ప్రధానంగా వార్తల్లోకి ఎక్కింది.
 
ఆటోమొబైల్  రంగానికి స్పీడ్ బ్రేకర్లు...
అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది ఎగుడుదిగుడుగా సాగింది. సంవత్సరం ప్రారంభంలో ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించాయి. మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం.

అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్‌మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. ఏదైతేనేం, మొత్తం మీద మందగమనం రోజులు పోయి మళ్లీ వృద్ధి బాటలోకి మళ్లగలుగుతున్నామని, కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి.  ఇక, టాటా మోటార్స్ ఎండీ కార్ల్ స్లిమ్ ప్రమాదవశాత్తూ మరణించడం ఈ రంగానికి ఎదురైన విషాదాల్లో ఒకటి. కాగా, మయాంక్ పరీఖ్, అరవింద్ సక్సేనా వంటి పలువురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లు  కంపెనీలు మారారు.
 
జనవరి

వాణిజ్య విమానయాన సేవలకు వందేళ్లు.  
నాస్కామ్ అద్యక్షునిగా తెలుగు వ్యక్తి చంద్రశేఖర్ బాధ్యతలు
ప్రపంచంలోని అతిపెద్ద పీసీ తయారీ సంస్థ లెనోవో చేతికి ఐబీఎం సర్వర్ వ్యాపారం.
2005 ముందటి నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ప్రజలకు ఆర్‌బీఐ సూచన.
టాటా మోటార్స్ ఎండీ కార్‌స్లిమ్ మృతి.
ప్రపంచంలోనే అత్యధిక లావాదేవీలు నిర్వహించిన ఈక్విటీ మార్కెట్‌గా ఎన్‌ఎస్‌ఈ.
 
ఫిబ్రవరి
అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ చరిత్రలో తొలి మహిళా చైర్‌పర్సన్‌గా జానెట్ యెలెన్ బాధ్యతల స్వీకరణ.
స్టీవ్ బామర్ స్థానంలో 38 ఏళ్ల చరిత్ర గలిగిన మైక్రోసాఫ్ట్ చీఫ్‌గా తెలుగు తేజం సత్య నాదెళ్లకు పగ్గాలు.
19 బిలియన్ డాలర్ల భారీ మొత్తంతో వాట్‌యాప్‌ను కొన్న ఫేస్‌బుక్.
మారుతీ ‘800’ ఉత్పత్తి పూర్తిగా నిలిపివేత.
 
మార్చి
హెచ్‌పీసీఎల్ తొలి మహిళా సీఎండీగా నిషీ వాసుదేవ
స్టాక్ మార్కెట్ మోసం కేసులో కేతన్ పరేఖ్‌కు రెండేళ్ల జైలుశిక్ష విధించిన సీబీఐ కోర్టు
ఫోర్బ్స్ అపర కుబేరుల్లో మళ్లీ బిల్ గేట్స్‌కు అగ్రసాథనం. 56 మంది భారతీయులకు చోటు. ముకేశ్ అంబానీ టాప్.
చెన్నై నుంచి ఎయిర్ ఏషియా ఇండియా తొలి విమానం టేకాఫ్.
 
ఏప్రిల్
ఐడీఎప్‌సీ, బంధన్ ఫైనాన్స్ సంస్థలకు బ్యాంకింగ్ లెసైన్స్‌లు.
సన్‌ఫార్మా-ర్యాన్‌బాక్సీ విలీనం రూ.20,000 కోట్ల డీల్
హోల్సిమ్ (స్విట్జర్లాండ్), లఫర్జీ (ఫ్రాన్) కంపెనీల విలీనం ప్రకటన.
పపంచంలో అతిపెద్ద సిమెంట్ కంపెనీగా ఆవిర్భావం.
ఫిన్లాంగ్ సంస్థ నోకియా కొత్త ప్రెసిడెంట్, సీఈఓగా భారతీయుడు రాజన్ సూరి నియామకం.
 

మే
ఎఫ్‌టీఐఎల్ ప్రమోటర్ జిగ్నేష్ షా అరెస్ట్
ప్రపంచంలోనే అతి ఖరీదైన ఇల్లుగా ముంబైలోని ముకేశ్ నివాసం ‘అంటిలియా’
దేశీ ఈ-కామర్స్‌లో అతిపెద్ద విలీనం. ఫ్లిప్‌కార్ట్ చేతికి మింత్రా.
ముగిసిన అంబాసిడర్ శకం. ఉత్పత్తిని నిలిపేసిన హిందుస్తాన్ మోటార్స్
ఆర్థికమంత్రిగా అరుణ్‌జైట్లీ బాధ్యతలు. నల్లధనం వెలికితీతపై జస్టిస్ ఎంబీ షా నేతృృత్వంలో సిట్  ఏర్పాటు
రిలయన్స్ ఇండస్ట్రీస్ చేతికి ‘నెట్‌వర్క్ 18’ గ్రూప్.
 
జూన్
తొలిసారి 25,000పైన సెన్సెక్స్
ఇన్ఫోసిస్ సీఈఓగా 47 ఏళ్ల విశాల్ సిక్కా. తొలిసారి బయటి వ్యక్తికి పగ్గాలు.
ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలు రుజువుకావడంతో జైలులోకి గోల్డ్‌మన్ శాక్స్ మాజీ డెరైక్టర్, భారత్ సంతతి వ్యక్తి 65 ఏళ్ల రజిత్‌గుప్తా.
అంతర్జాతీయ విమాన సంస్థల కూటమి స్టార్ అలయన్స్‌లో ప్రభుత్వ రంగ ఎయిర్ ఇండియాకు చోటు.
 
జూలై

మోడీ ప్రభుత్వం మొదటి రైల్వే బడ్జెట్.
రూ.17,94,892 బడ్జెట్ వ్యయంతో ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ తొలి బడ్జెట్
చిత్ర నిర్మాణంలోకి మహీంద్రా గ్రూప్ ప్రవేశిస్తోందని వార్తలు.
వచ్చే మూడేళ్లలో రూ.2.1 లక్షల పెట్టుబడుల ప్రణాళికలను ప్రకటించిన టాటా గ్రూప్. రూ.6,24,754 కోట్ల ఆదాయ కంపెనీగా ఆవిర్భావం
 

ఆగస్టు

తెలుగు వ్యక్తి  కేవీ చౌదరి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్ చైర్మన్‌గా బాధ్యతలు.
ప్రాంతీయ భాషల్లో డొమైన్లు. ఈ నెల 27 నుంచీ హిందీతో ఆరంభం. తరువాత తెలుగుసహా ఆరు భాషల్లో ప్రారంభం
కుటుంబ కలహాల నేపథ్యం... ‘చెట్టినాడ్’ గ్రూప్ పగ్గాల మార్పు.
దేశ వ్యాప్తగా ప్రధాని జనధన యోజన పథకం ప్రారంభం.
 
సెప్టెంబర్
విజయమాల్యాను ఉద్దేశపూర్వక ఎగవేతదారుగా ప్రకటించిన యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
అలీబాబా ఐపీఓ ప్రపంచ రికార్డు. ఐపీఓ విలువ రూ.1,50,000 కోట్లు. చైనాలో అత్యంత సంపన్నునిగా ఆవిర్భవించిన కంపెనీ ప్రమోటర్ జాక్ మా.
కోల్‌గేట్ స్కామ్‌లో 214 బొగ్గు గనులను రద్దు చేసిన సుప్రీంకోర్టు.
 
అక్టోబర్
డీఎల్‌ఎఫ్ చైర్మన్ కేపీ సింగ్‌పై సెబీ నిషేదాజ్ఞలు. స్టాక్ మార్కెట్ కార్యకలాపాల  నుంచి మూడేళ్ల బహిష్కరణ
ఆర్థికమంత్రిత్వశాఖ ముఖ్య ఆర్థిక సలహాదారుగా అరవింద్ సుబ్రమణియన్
రిలయన్స్‌కు వర్తించని విధంగా గ్యాస్ ధర 6.17 డాలర్ల పెంపునకు కేంద్రం ఆమోదం
డీజిల్ ధరపై నియంత్రణల తొలగింపు
అమెరికాలో ఉద్దీపణలకు స్వస్తి.
 
నవంబర్
అత్యంత శక్తివంతురాలైన భారత్ వ్యాపార మహిళగా ఎస్‌బీఐ చీఫ్ అరుంధతీ భట్టాచార్య.
మళ్లీ కిసాన్ వికాస పత్రాలు ప్రారంభం.
కొటక్ మహీంద్రాలో ఐఎన్‌జీ వైశ్యా బ్యాంక్ విలీనానికి ఒప్పందం.
భారత్‌కు అలీబాబా వ్యవస్థాపకుడు జాక్‌మా. భారత్‌లో మరిన్ని పెట్టుబడులు
రూ. 100 లక్షల కోట్ల విలువను దాటిన స్టాక్ మర్కెట్ విలువ.
 

డిసెంబర్
మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతన ప్యాకేజీ రూ.520 కోట్లుగా ఖరారు.
కరెన్సీ నోట్లపై గాంధీజీ బొమ్మ మినహా మరోటి ఉండబోదని ఆర్‌బీఐ స్పష్టీకరణ
రూ.60,000 కోట్ల విలువైన ముడిచమురు దిగుమతికి రష్యా సంస్థ రోజ్‌నెట్‌తో ఎస్సార్ ఆయిల్ ఒప్పందం.
అనిల్ అంబానీ (అడాగ్) గ్రూప్ నేతృత్వంలోని బిగ్ సినిమాను కొన్న కార్నివల్. మల్టీప్లెక్స్ రంగంలో అతిపెద్ద ఒప్పందం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement