ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకూ రాజధాని ఢిల్లీయే!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ... ఆన్‌లైన్ షాపింగ్ ప్రియులకూ రాజధానిగా వర్ధిల్లుతోంది. తమ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌పై షాపింగ్ చేస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది ఎన్‌సీఆర్ (దేశ రాజధాని ప్రాంతం) నుంచే ఉంటున్నారని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఆ తర్వాత బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నట్టు ‘ఫ్లిప్‌ట్రెండ్స్ 2016’ నివేదిక రూపంలో తెలిపింది. వెల్లూర్, తిరుపతి, బళ్లారి, జోర్హట్, కొట్టాయమ్ ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్యా పరంగా టైర్–3 పట్టణాల్లో మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.
2016లో ఆన్‌లైన్ షాపింగ్ చేసిన వారిలో 60 శాతం మంది పురుషులేనట. ఎలక్ట్రానిక్ వస్తువులు, పర్సనల్ ఆడియో, పాదరక్షలు, లైఫ్‌స్టయిల్ ఉత్పత్తులను వీరు ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇక 2016లో ఎలక్ట్రానిక్ యాక్ససరీలు, మొబైల్స్, మహిళల వస్త్రాలు, పురుషుల పాదరక్షలు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో ఎక్కువ శాతం అమ్మకాలు జరిగాయి.
50 శాతం లావాదేవీలు ఖరీదైన ఫోన్లు, కన్జూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్‌కు సంబంధించినవేనని... నోకాస్ట్ ఈఎంఐ, పాత వస్తువులతో మార్పిడి ఇందుకు వీలు కల్పించాయని ఫ్లిప్‌కార్ట్ వివరించింది. విద్యుత్‌ను ఆదా చేసే బల్బ్‌లు, వాల్ స్టిక్కర్లు, సెల్ఫీ స్టిక్స్, ప్రింటర్‌ఇంక్, స్లిమ్మింగ్ బెల్ట్‌లు, కండోమ్‌లు, ప్రొటీన్ సప్లిమెంట్‌లు, మస్సాజర్, బీపీ మెషిన్లు, హుక్కా మెషిన్లు, హుక్కా ఫ్లావర్ల అమ్మకాలు కూడా జరిగాయని తెలిపింది.