రుణానికి కొత్త రూటు.. పీ2పీ | 2018 is the most encouraging year for lending | Sakshi
Sakshi News home page

రుణానికి కొత్త రూటు.. పీ2పీ

Published Mon, Jan 21 2019 12:41 AM | Last Updated on Mon, Jan 21 2019 4:57 AM

2018 is the most encouraging year for lending - Sakshi

పీర్‌ టు పీర్‌ (పీ2పీ) లెండింగ్‌కు 2018 మంచి ప్రోత్సాహకమైన సంవత్సరంగా చెప్పుకోవచ్చు. పీటూపీ సంస్థలను ఎన్‌బీఎఫ్‌సీలుగా ఆర్‌బీఐ గుర్తించి, లైసెన్స్‌లను మంజూరు చేసింది గతేడాదే. దీంతో క్రౌడ్‌ ఫండింగ్‌ వేదికలకు అధికారిక గుర్తింపు లభించింది. దేశంలో 2016 నాటికి 30కి పైగా పీ2పీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తుండగా, వీటిలో 11 సంస్థలకు గతేడాది ఎన్‌బీఎఫ్‌సీ–పీ2పీ లైసెన్స్‌లు ఆర్‌బీఐ నుంచి లభించాయి. వీటిల్లో తొలి లైసెన్స్‌ను పొందిన సంస్థగా ఫెయిర్‌సెంట్‌ గుర్తుండిపోతుంది. మార్కెట్లో పెద్ద సంస్థ కూడా ఇదే. ఓఎంఎల్‌పీ2పీ, క్యాష్‌కుమార్, మానెక్సో, ఐటూఐ ఫండింగ్, ఫించీ, పీర్‌లాండ్, లెండెన్‌క్లబ్, పైసాదుకాణ్‌ తదితర సంస్థలు లైసెన్స్‌లు పొందిన కంపెనీల జాబితాలో ఉన్నాయి. 2018  ఈ రంగానికి పునాది వేసిన సంవత్సరం అయితే, 2019 ప్రోత్సాహకరంగా ఉంటుందని... ఈ ఏడాది పీ2పీ సంస్థలు రూ.1,000–1,500 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయవచ్చని అంచనా. ఎటువంటి క్రెడిట్‌ స్కోర్‌ లేకపోయినా రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్న... పీటూపీ సంస్థలపై సమగ్ర కథనమే ఇది...

పీర్‌ టు పీర్‌ లెండింగ్‌ అంటే? 
పీర్‌ టు పీర్‌ లెండింగ్‌ను పీ2పీ లెండింగ్‌గా కూడా పిలుస్తారు. ఇది క్రౌడ్‌ ఫండింగ్‌ తరహాలో ఉంటుంది. రుణాలు ఆశించే వారు, రుణాలు ఇవ్వాలనుకునే వారు ఎవరి సాయం అవసరం లేకుండా ఈ పీటూపీ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నేరుగా లావాదేవీలు చేసుకోవచ్చు. సంప్రదాయ విధానంలో రుణాలిచ్చే సంస్థల వద్ద అప్పు పుట్టని వారికి పీటూపీ వేదికలు అనువుగా ఉంటాయి. అధిక వడ్డీ రాబడి ఆశించే వారు పీ2పీ ద్వారా రుణాలు ఇచ్చుకోవచ్చు. పీ2పీ ప్లాట్‌ఫామ్‌లపై రుణాలు కావాలనుకునే వారు, రుణాలు ఇవ్వాలనుకునే వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. దీనికంటే ముందు అన్ని నియమ, నిబంధనలు, రిస్క్‌ వివరాలను తెలుసుకుని జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అన్ని పీ2పీ ప్లాట్‌ఫామ్‌లను ఆర్‌బీఐ ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలుగా ప్రస్తుతం పరిగణిస్తోంది. కనుక వీటిపై ఆర్‌బీఐ నియంత్రణ ఉంటుంది. 

రుణదాతలు అయితే... 
పీ2పీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రుణాలు ఇచ్చి మంచి ఆదాయం గడిద్దామనుకునే వారు ముందు చూడాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. గుర్తింపు పొందిన పీటుపీ ప్లాట్‌ఫామ్‌లు కచ్చితమైన మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. సమాచార భద్రత, సమాచార వెల్లడి, రుణ గ్రహీత సమాచారాన్ని క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలకు ఇవ్వడం, అలాగే, పలు అంశాలకు సంబంధించి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఆన్‌లైన్‌ ప్రపంచంలో ఎన్నో ప్లాట్‌ఫామ్‌లు పీ2పీ సేవలను ఆఫర్‌ చేస్తుంటే, వీటిలో ఎన్‌బీఎఫ్‌సీ–పీటూపీగా ఆర్‌బీఐ వద్ద పేర్లను నమోదు చేసుకున్నవి కొన్నే. ‘‘సంబంధిత ప్లాట్‌ఫామ్‌పై రుణాల పరిమాణం?, ఎంత మంది రుణ గ్రహీతలు పేర్లను నమోదు చేసుకున్నారు, రుణాలు మంజూరు వంటివి కంపెనీ ప్రణాళికలు. వ్యాల్యూమ్‌ తక్కువగా ఉంటే, దీర్ఘకాలం పాటు రుణ గ్రహీత లభించకపోవచ్చు. పీ2పీ లెండింగ్‌ కంపెనీ నుంచి ఈ వివరాలే తెలుసుకోవాలి’’ అని ఐటూఐ ఫండింగ్‌ సహ వ్యవస్థాపకుడు రాఘవేంద్ర ప్రతాప్‌ సింగ్‌ తెలిపారు. రుణ ఎగవేతల శాతం ఏ విధంగా ఉందని, తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడంలో జాప్యం జరిగితే, లేదా ఎగవేస్తే ఏంటి పరిస్థితి? అన్న వాటిపైనా దృష్టిపెట్టాలి. ప్రతీ పీ2పీ సంస్థ పారదర్శకతలో భాగంగా పోర్ట్‌ఫోలియో పనితీరు సమాచారాన్ని వెల్లడించాల్సి ఉంటుంది. అయితే, చాలా సంస్థలు తమ ప్లాట్‌ఫామ్‌పై రుణ ఎగవేతలు ఏ స్థాయిలో ఉందన్న  సమగ్ర వివరాలను బహిర్గతం చేయడం లేదు. అయితే, సంబంధిత ప్లాట్‌ఫామ్‌ ద్వారా రుణాలు ఇవ్వాలనుకునే వారు ఈ వివరాలను అడిగి తెలుసుకోవాల్సిన బాధ్యతను విస్తరించొద్దు. రుణ చెల్లింపుల్లో జాప్యం, ఎగవేతల పట్ల సంబంధిత పోర్టల్‌ ఏ విధమైన చర్యలు తీసుకుంటుంది, ఎలా రికవరీ చేస్తుందనేది కీలకం. అలాగే చట్టపరమైన ప్రక్రియల గురించి కూడా తెలుసుకోవాలి.  

రాబడులు ఏ మేర... 
రుణగ్రహీతల అర్హతలపై రుణాలిచ్చే వారి రాబడులు ఆధారపడి ఉంటాయి. భిన్న రిస్క్‌ కేటగిరీల గురించి ముందు తెలుసుకోవాలి. అప్పుడు రాబడులపై స్పష్టత వస్తుంది. అధిక సగటు రాబడులు వస్తున్నాయంటే అదే స్థాయిలో రిస్కూ ఉంటుందని తెలుసుకోవాలి. కనుక భిన్న విభాగాల్లో రుణాలు ఇవ్వడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు. రుణ గ్రహీత పేరు, ఇతర సమాచారాన్ని పీటూపీ ప్లాట్‌ఫామ్‌ వెల్లడించకపోవచ్చు. అయితే, రుణం ఇచ్చేవారిగా తీసుకునే వారి వివరాలను అడిగి తెలుసుకునే హక్కు ఉంటుంది. అందుకని వెబ్‌సైట్‌లో వెల్లడించకపోయినా అడిగి తెలుసుకోవాలి.

రుణ గ్రహీతలు అయితే... 
ఇతర మార్గాలలో రుణాలు లభించని వారు సహజంగానే పీ2పీ ప్లాట్‌ఫామ్‌లవైపు చూడొచ్చు. ఈ తరహా వ్యక్తులు పీ2పీ ప్లాట్‌ఫామ్‌ వేదికలపై తమ పేర్లు, ఇతర వివరాలతో నమోదు చేసుకుని, రుణాలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. ముందుగా మీరు పేరు నమోదు చేసుకుంటున్న సంస్థకు ఆర్‌బీఐ అనుమతి ఉందా? అని. చాలా సంస్థలు వేగంగా రుణ సదుపాయం కల్పిస్తున్నప్పటికీ ఆర్‌బీఐ వద్ద తమ పేర్లను నమోదు ఎన్‌బీఎఫ్‌సీ–పీటూపీ రిజిస్ట్రేషన్‌ పొంది వ్యాపారం చేస్తున్నవి కొన్నే. ఆర్‌బీఐ గుర్తింపు ఉన్నవి మార్గదర్శకాల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఈ సంస్థల ద్వారా లావాదేవీలు నిర్వహించడం ఒకింత నయం. అదనపు ఫీజులు, కనిపించని చార్జీల గురించి కూడా వాకబు చేయాలి. మొత్తం వడ్డీకి అదనంగా ఏవైనా చార్జీలు వసూలు చేసేదీ, లేదా తాము పొందే రుణంలో ఏమైనా కత్తిరింపు ఉందా అని విచారించాలి. రిజిస్ట్రేషన్‌ ఫీజు, ప్రాసెసింగ్‌ ఫీజులు సహజంగానే ఉంటాయి. ఇవి కాకుండా ఇంకా ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవాలి. తీసుకున్న రుణాన్ని ముందుగానే తీర్చేద్దామనుకుంటే చార్జీల విధింపు ఉందా అని చూడాలి. ఆర్‌బీఐ మార్గదర్శకాల ప్రకారం ఒక ఈఎంఐని 90 రోజుల్లోపు చెల్లించడంలో విఫలమైతే అది చెల్లింపుల వైఫ్యలంగా పరిగణించడం జరుగుతుంది. ఈ గడువు కొన్ని ప్లాట్‌ఫామ్‌లలో భిన్నంగా ఉంది. సకాలంలో రుణం లభించడం ఎంతో అవసరం. అప్పుడే అవసరాలకు ఉపయోగపడుతుంది. అందుకే మీరు ఆశ్రయించే ప్లాట్‌ఫామ్‌పై ఎంత వేగంగా రుణాల మంజూరు ఉందనేది తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఒక్కో కంపెనీకి ఇది వేర్వేరుగా ఉంటుంది.

అప్పు ఎగ్గొడితే...? 
పీ2పీ లెండింగ్‌ సంస్థల ద్వారా ఎవరైనా రుణాలను ఇతరులకు ఆఫర్‌ చేయడం ద్వారా వడ్డీ ఆదాయం అందుకోవచ్చు. రెండంకెల రాబడులంటే సహజంగానే ఆసక్తి ఉంటుంది. మరి రుణం తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించడంలో విఫలమైతే ఏంటి పరిస్థితి? వీరి విషయంలో పీ2పీ సంస్థలు ఏ విధంగా వ్యవహరిస్తాయి? అన్న సందేహాలు ఉంటుంటాయి. అయితే, ఈ విషయంలో పీ2పీ సంస్థలు ఎన్‌బీఎఫ్‌సీ సంస్థల మాదిరే చురుగ్గానే వ్యవహరిస్తున్నాయి. రుణాలు తీసుకునే వారికి సంబంధించిన సమాచారాన్ని భిన్న మార్గాల్లో సేకరిస్తుంటాయి. ‘‘నిజమైన కస్టమర్లకే రుణాలు అందించాలి. కస్టమర్‌ ఉద్దేశాన్ని తెలుసుకుని, దరఖాస్తులను ప్రాసెస్‌ చేసే విషయంలో ప్రత్యామ్నాయ సమాచారం ఉపయోగపడుతుంది’’ అని క్యాష్‌కుమార్‌ సహ వ్యవస్థాపకుడు ధీరేన్‌ మఖిజియా తెలిపారు. మా దగ్గర నమోదు చేసుకునే ప్రతీ కస్టమర్‌ డేటా, క్రెడిట్‌ సమాచారం, రిస్క్‌ను ఆటోమేటెడ్‌ ఆల్గోరిథమ్‌ టూల్స్‌ ద్వారా తనిఖీ చేయబడుతుంది. ఆర్థిక, సామాజిక, వ్యక్తిగత స్థాయిలో 400 పాయింట్లను పరిశీలించడం జరుగుతుంది. ఎన్నో చర్యల్ని తీసుకోవడం ద్వారా రుణ ఎగవేతల రేటును పరిమిత స్థాయిలోనే ఉండేలా చూస్తాం’’ అని ఫెయిర్‌సెంట్‌ వ్యవస్థాపకుడు వినయ్‌ మాథ్యూస్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement