మార్కెట్ పంచాంగం
భారత్ సూచీలు మూడు వారాల నుంచి దాదాపు 4 శాతం శ్రేణిలో తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. క్రితం వారం ఈ శ్రేణి 2.5 శాతానికి పరిమితమయ్యింది. ఇలా ఒడిదుడుకుల శాతం క్రమేపీ తగ్గి, ఒక్కసారిగా విస్తృతంకావడం సర్వసాధారణం. ప్రస్తుతానికి భారత్ మార్కెట్ దీర్ఘకాలిక ట్రెండ్ బుల్లిష్‌గానూ, స్వల్పకాలిక ట్రెండ్ బేరిష్‌గానూ వుంది. రాబోయే ఒకటి, రెండు వారాల్లో ఈ శ్రేణి విస్తృతమై, ఎటో ఒకవైపు మార్కెట్ వేగంగా కదలవచ్చు. అలా కదిలే దిశ తో దీర్ఘకాలిక ట్రెండ్ బేరిష్‌గా మారడం లేదా స్వల్పకాలిక ట్రెండ్ బుల్లిష్‌గా రూపాంతరం చెందడం జరగవచ్చు. ఇక ఈ వారం సాంకేతికాంశాలకొస్తే...
సెన్సెక్స్ సాంకేతికాంశాలు...
మే 15తో ముగిసిన వారంలో బీఎస్‌ఈ సెన్సెక్స్ 27,544-26,750 పాయింట్ల శ్రేణి మధ్య హెచ్చుతగ్గులకు లోనై, చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 219 పాయింట్ల స్వల్పలాభంతో 27,324 పాయింట్ల వద్ద ముగిసింది. వరుసగా మూడు వారాల నుంచి 27,500-600 శ్రేణి అవరోధం కల్పిస్తున్నందున, ఈ స్థాయిని భారీ ట్రేడింగ్ పరిమాణంతో దాటి స్థిరపడితేనే తదుపరి పెరుగుదల సాధ్యపడుతుంది. అటుపైన స్థిరపడితే క్రమేపీ 27,830 స్థాయికి పెరగవచ్చు.
అనూహ్యమైన సానుకూల వార్తలేవైనా వెలువడితే 28,090 పాయింట్ల స్థాయికి సైతం ర్యాలీ జరిపే చాన్స్ వుంది. సెన్సెక్స్ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాలంటే 28,090 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ వారం తొలి నిరోధ శ్రేణిని దాటలేకపోతే 26,750 స్థాయి వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. మార్కెట్‌ను తీవ్ర నిరుత్సాహానికి లోనుచేసే వార్తలేవైనా వెలువడితే మరోదఫా 26,420 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. ఈ స్థాయిని కూడా కోల్పోతే 26,250 పాయింట్ల వద్దకు పతనం కావొచ్చు.
నిఫ్టీ నిరోధం 8,355
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గత మార్కెట్ పంచాంగంలో అంచనాలకు అనుగుణంగా 8,335 పాయింట్ల సమీపంలో నిరోధాన్ని చవిచూసి, 8,090 పాయింట్ల వద్దకు పతనమయ్యింది. తదుపరి స్వల్పంగా కోలుకోవడంతో చివరకు 71 పాయింట్ల లాభంతో 8,262 పాయింట్ల వద్ద ముగిసింది. మూడు వారాల నుంచి 8,300-8,355 పాయింట్ల శ్రేణి నిఫ్టీకి 8 దఫాలు అవరోధం కల్పించినందున, ఈ శ్రేణిని అధిగమించిన తర్వాతే ఆపైన పెరిగే అవకాశం వుంటుంది. ఈ శ్రేణిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే 8,420 పాయింట్ల వద్దకు పెరగవచ్చు.
ఆపైన స్థిరపడితే 8,505 పాయింట్ల స్థాయిని అందుకోవచ్చు. ఈ వారం తొలి అవరోధ శ్రేణిని అధిగమించలేకపోతే 8,090 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయిని కోల్పోతే వేగంగా 7,960 పాయింట్ల స్థాయికి క్షీణించవచ్చు. గత డిసెంబర్‌లో మద్దతునిచ్చిన ఈ స్థాయిని నష్టపోతే, ప్రతికూల పరిస్థితుల్లో 7,730 పాయింట్ల వద్దకు పతనమయ్యే ప్రమాదం వుంటుంది. నిఫ్టీ తిరిగి అప్‌ట్రెండ్‌లోకి ప్రవేశించాలంటే 8,505 స్థాయిపైన కొద్ది ట్రేడింగ్ సెషన్లపాటు స్థిరపడాల్సి ఉంటుంది.
- పి. సత్యప్రసాద్
అవరోధ శ్రేణి 27,500-600
Published Mon, May 18 2015 1:55 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM
Advertisement
Advertisement